చంద్రబాబు సర్కార్ పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అలాగే చాలా కాలంగా పక్కన పెట్టిన వాళ్లలో కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా వివాస్పద యువ ఐఏఎస్ అధికారి కొత్తమాసు దినేష్‌కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఫైబర్‌నెట్ ఎండీగా దినేష్‌కుమార్ తీవ్ర అవినీతికి పాల్పడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ హోదాలో జీవీరెడ్డి నాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఫైబర్‌నెట్ ఎపిసోడ్‌లో దినేష్‌కుమార్ అవినీతిపై పెద్ద చర్చే జరిగింది. దీంతో అప్పట్లో ఆయన్ను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పుడాయన్ను ఆయుష్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించడం గమనార్హం. దీన్నిబట్టి అతనిపై అవినీతి ఆరోపణలు నిజం కాదని ప్రభుత్వం నమ్ముతుందా? అదే నిజమైతే, జీవీరెడ్డి ఆరోపణల మేరకు, ఉద్యోగుల్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం సామాజిక కోణంలో ఆలోచించి దినేష్‌కుమార్‌పై వేటు వేయకపోగా, పోస్టింగ్ ఇచ్చారనే చర్చ ఐఏఎస్ వర్గాల్లో జరుగుతోంది.
అలాగే చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన తర్వాత ఎలాంటి పోస్టింగ్‌లకు నోచుకోని పలువురు ఐఏఎస్ అధికారులపై ఎట్టకేలకు దయచూపారు. రేవు ముత్యాలరాజును రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌గా, కె.మాధవీలతను ఏపీ రైతుబజార్ సీఈవోగా, వైసీపీ హయాంలో సీఎంవో కార్యాలయంలో పనిచేసిన కె.నీలకంఠారెడ్డికి వైద్యారోగ్యశాఖలో పోస్టు ఇచ్చారు.
అలాగే తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల జారీలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి బాధ్యురాల్ని చేస్తూ టీటీడీ తిరుపతి జేఈవో ఎం.గౌతమి జీఏడీకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెను గిరిజన గురుకులాల కార్యదర్శిగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు.
వీళ్లే కాకుండా, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాను రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ విభాగానికి బదిలీ చేశారు. ఇంత వరకూ సిసోడియా నిర్వహిస్తున్న బాధ్యతల్ని అదే శాఖలో చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మికి అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఆ శాఖకు సంబంధించి అదనపు బాధ్యతల్ని ఆమె నిర్వహించనున్నారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సెక్రటరీ అయిన కాటమనేని భాస్కర్‌కు అదనంగా ఏపీహెచ్ఆర్‌డీఐ డైరెక్టర్ బాధ్యతల్ని అప్పగించడం గమనార్హం.