కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలున్నాయి. ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారం మొత్తాన్ని తామే చెలాయించాలనే ధోరణే… మూడు పార్టీల నేతల మధ్య విభేదాలకు కారణమైంది. కొన్నిచోట్ల టీడీపీ, జనసేన, బీజేపీలోనే అంతర్గత కలహాలు కూడా తీవ్రస్థాయిలో ఉన్నాయి.
తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, ఆయన తండ్రి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ల మధ్య కొన్నినెలలుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోసారి జేసీ కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కెలకడం చర్చనీయాంశమైంది.
తాడిపత్రిలో బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే అస్మిత్, మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి ఏ మాత్రం గౌరవించడం లేదని మండిపడ్డారు. తమ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మరిచిపోవద్దని ఆయన చెప్పుకొచ్చారు. జాతీయస్థాయిలో అధికారంలో వున్న తాము… కూటమిలోని నాయకులు, కార్యకర్తలకు గౌరవం ఇస్తున్నామన్నారు. కానీ తాడిపత్రిలో మాత్రం బీజేపీ శ్రేణుల్ని అధికారంలో భాగస్వాములుగా చూడకపోవడాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు.
తాడిపత్రిలో బీజేపీ కార్యకర్తలపై చిన్నచూపు ఎందుకని తండ్రీతనయుల్ని ఆయన నిలదీశారు. గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని, బీజేపీ నాయకుల్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అప్పుడు జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కూడా పార్థసారథే. మరోసారి తమపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్థసారథిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడి స్పందన ఏంటో చూడాలి.