మంగళగిరిలో ఊహించినట్టే జరిగింది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈయన సుదీర్ఘ కాలం టీడీపీకి సేవలందించారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి చేరికతో మంగళగిరిలో వైసీపీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది.
టీడీపీలో తనకు తీవ్ర అవమానం జరిగిందని గంజి చిరంజీవి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను మానసికంగా హత్య చేశారని సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీకి రాజీనామా చేసినప్పుడే ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారానికి తెరలేచింది. రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగినట్టే గంజి చీరంజీవి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కండువా కప్పుకున్న అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు.
అణగారిన వర్గాల అభివృద్ధికి వైసీపీ కృషి చేస్తోందని తెలిపారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదని ధ్వజమెత్తారు. నిరంతరం అవమానాలకు గురిచేస్తూ బీసీలను ఏమి ఉద్ధరిస్తారని టీడీపీ నేతల్ని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సహా ఏ ఒక్క సామాజిక వర్గానికి గౌరవం లేదని చెప్పుకొచ్చారు. టీడీపీలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానిదేనని పరోక్షంగా ఆరోపించారు.
మంగళగిరిలో ప్రధానంగా కుల సమీకరణలపై టీడీపీ, వైసీపీ దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ప్రస్తుతానికి వైసీపీ పైచేయి సాధించినట్టే కనిపిస్తోంది. అయితే గంజి చిరంజీవి చేరికతో మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి మార్పు అంశం తెరపైకి వచ్చింది. గంజి చిరంజీవి వైసీపీలో చేరిక సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటే ఉండడం విశేషం.
వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా అభిమానిస్తానని ఆళ్ల అనేక సందర్భాల్లో చెప్పారు. మంత్రి పదవి ఇస్తానని జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయినా… ఎప్పుడూ ఆళ్ల అలకబూనలేదు. ఇదిలా వుండగా మంగళగిరిలో టీడీపీ తరపున మరోసారి నారా లోకేశ్ బరిలో దిగనున్నారు. 2019లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేశ్ ఓటమిపాలయ్యారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి పోటీ సహజంగానే అందరి దృష్టి ఆకర్షించనుంది.