కూనకు ఊరట దక్కిందా?

రానున్న కాలంలో కాబోయే మంత్రి తమ నేత అని ఇప్పటికి ఈ పదవి తమకు సంతోషమేనని కూన వర్గీయులు కొండంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు అయిన కూన రవికుమార్ కి ఎట్టకేలకు ఒక పదవి దక్కింది. ఆయనను పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ శాసనసభా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.

కూన రవికుమార్ ఈసారి మంత్రి కావాలని అనుకున్నారు. తనకే తప్పకుండా దక్కుతుందని కూడా అంచనా వేసుకున్నారు. జిల్లా నుంచి బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి దక్కి దశాబ్దాలు అయింది. ఆ లోటుని తెలుగుదేశం ఈసారి తీరుస్తుందని ఆశపడ్డారు.

పార్టీకి వీర విధేయుడిగా కూన రవికుమార్ ఉన్నారు. సొంత మేనమామ తమ్మినేని సీతారాం పార్టీని విడిచి వెళ్ళినా కూన రవికుమార్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ బలోపేతం చేశారు. ఆయన చేసిన సేవలకు మంత్రి పదవి ఖాయమని అనుచరులు భావించారు.

అయితే ఆ ఆశ తీరలేదు. దాంతో కొన్నాళ్ల నుంచి ఆయన వర్గం అసంతృప్తిగా ఉంది అని ప్రచారం సాగింది. టీడీపీ అధినాయకత్వం సీనియర్లకు సముచితమైన స్థానం కల్పిస్తూ వస్తోంది. మంత్రి పదవి కల్పించలేని వారికి వేరే అవకాశాలు ఇస్తోంది. ఆ విధంగా కూనకు పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా నియామకం జరిగింది అని అంటున్నారు.

ఇటీవల కాలంలో కూన రవికుమార్ రాజకీయంగా మళ్ళీ జోరు పెంచారు. వైసీపీ మీద విమర్శలు చేస్తూ కూటమి పాలనలో అభివృద్ధిని ఆయన జనంలోకి తెస్తున్నారు. రానున్న కాలంలో కాబోయే మంత్రి తమ నేత అని ఇప్పటికి ఈ పదవి తమకు సంతోషమేనని కూన వర్గీయులు కొండంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

4 Replies to “కూనకు ఊరట దక్కిందా?”

Comments are closed.