నిమ్మ‌లా… రోజూ న‌మ్ముతారా?

సూప‌ర్‌సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల‌ను జ‌నంలోకి తీసుకెళ్ల‌డంలో టీడీపీ సీనియ‌ర్ నేత నిమ్మ‌ల రామానాయుడు ఎన్నిక‌ల సంద‌ర్భంలో అద్భుతంగా ప‌ని చేశారు.

సూప‌ర్‌సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల‌ను జ‌నంలోకి తీసుకెళ్ల‌డంలో టీడీపీ సీనియ‌ర్ నేత నిమ్మ‌ల రామానాయుడు ఎన్నిక‌ల సంద‌ర్భంలో అద్భుతంగా ప‌ని చేశారు. చిన్న పిల్లలు, మ‌హిళ‌లు, వృద్ధులు, రైతులు, వ‌లంటీర్లు…ఇలా ఏ ఒక్క‌రినీ నిమ్మ‌ల రామానాయుడు వ‌దిలిపెట్ట‌లేదు. విద్యార్థుల‌కైతే మీకు రూ.15 వేలు, మ‌హిళ‌లు ఎదురొస్తే అమ్మా ఏడాదికి మీకు రూ.18 వేలు, వృద్ధులు క‌నిపిస్తే మీకు నెల‌కు రూ.4 వేలు, రైతులకైతే మీకు ఏడాదికి రూ.20 వేలు, నిరుద్యోగులు ఎదురైతే మీకు నెల‌కు రూ.3 వేల భృతి… ఇలా అడిగిన వాళ్ల‌కు, అడ‌గ‌ని వాళ్ల‌కు ఎన్నెన్నో చెప్పిన నాయ‌కుడిగా నిమ్మ‌ల రామానాయుడు నిలిచారు.

వృద్ధుల‌కు మిన‌హాయిస్తే, ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క హామీని కూట‌మి ప్ర‌భుత్వం నిల‌బెట్టుకున్న దాఖ‌లాలు లేవు. ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి ప్ర‌చారాన్నే నిమ్మ‌ల రామానాయుడు మొద‌లు పెట్ట‌డం విశేషం. వ‌చ్చే ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. అలాగే 16 వేల ఉపాధ్యాయుల పోస్టుల భ‌ర్తీకి డీఎస్సీ ఫైల్‌పై సీఎం చంద్ర‌బాబు మొద‌టి సంత‌కం చేశార‌ని ఆయ‌న గుర్తు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే వచ్చే విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయ పోస్టుల నియమకాలు పూర్తి చేస్తామని ఆయ‌న‌ హామీ ఇచ్చారు. పాల‌కొల్లులో ఆదివారం ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ కూట‌మి అభ్య‌ర్థి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌రాన్ని గెలిపించాల‌ని కోరుతూ ఆయ‌న ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా నిరుద్యోగులు, విద్యావంతుల‌కు నిమ్మ‌ల హామీలు ఇచ్చారు. ఎనిమిది నెల‌ల క్రితం ఇదే రీతిలో ప్ర‌చారం చేసి, గంప‌గుత్త‌గా జ‌నం ఓట్ల‌ను పొందారు. ఇప్పుడు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఓట్లు వుండ‌డంతో వాళ్ల ఓట్ల‌ను ఎలాగైనా పొందేందుకు నిమ్మ‌ల మ‌రోసారి త‌న‌దైన ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే నిమ్మ‌ల రామానాయుడి ప్ర‌చారానికి కాలం చెల్లింద‌ని, ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని విద్యావంతులు అంటున్నారు. ఒక‌ట్రెండుసార్లు మోస‌పోతార‌ని, రోజూ ఎలా సాధ్య‌మ‌ని నిరుద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు. ఎనిమిది నెల‌ల్లో ఏమీ చేయ‌లేద‌ని, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే నిమ్మ‌ల హామీల ప్ర‌స్తావ‌న తెస్తున్నార‌ని వాళ్లు అంటున్నారు.

6 Replies to “నిమ్మ‌లా… రోజూ న‌మ్ముతారా?”

Comments are closed.