శత్రుచర్ల శకం ముగిసినట్లేనా?

కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ తమ్ముడి కుమారుడు అయిన వీరేష్‌ చంద్రదేవ్‌కి టీడీపీలో ప్రముఖ స్ధానం దక్కుతోంది.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పిన రాజకీయ కుటుంబం శత్రుచర్ల విజయరామరాజుది. ఆయన తనతో పాటు తమ్ముడు చంద్రశేఖరరాజును కూడా రాజకీయంగా పైకి తీసుకుని వచ్చారు.

అన్నదమ్ములు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. విజయరామరాజు అయితే మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌ హయాంలో ఆయన హవా ఒక స్ధాయిలో ఉండేది. ఇక ఆయన టీడీపీలో చేరిన తరువాత ఎమ్మెల్సీగా పదవిని అందుకున్నారు. పాతపట్నం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు.

2019 ఎన్నికలలో తమ మేనల్లుడికి కురుపాం టిక్కెట్‌ను ఇప్పించుకున్నా వైసీపీ ప్రభంజనంలో గెలిపించుకోలేకపోయారు. నాటి నుంచే ఆయనకు రాజకీయ కష్టాలు మొదలయ్యాయి. చంద్రశేఖరరాజు కుమార్తె పల్లవిని కురుపాం నుంచి టీడీపీ అభ్యర్ధిగా చేయాలని ఆయన చూసినా అధినాయకత్వం మాత్రం పట్టించుకోలేదు.

కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ తమ్ముడి కుమారుడు అయిన వీరేష్‌ చంద్రదేవ్‌కి టీడీపీలో ప్రముఖ స్ధానం దక్కుతోంది. ఆయన సూచించిన తోయక జగదీశ్వరికి కురుపాం టిక్కెట్‌ దక్కింది. ఆమె గెలిచారు. వీరేష్‌ చంద్రదేవ్‌కు రాష్ట్ర కార్యదర్శి పదవిని కూడా ఇచ్చారు. దాంతో ఆయన హవా చాటుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో శత్రుచర్ల శకం ముగిసినట్లే అని అంటున్నారు.