చందనోత్సవం కత్తి మీద సాము!

ఈసారి ఏప్రిల్ 30న స్వామి వారి చందనోత్సవం వస్తోంది. దానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఉత్తరాంధ్ర లోని అతి పెద్ద నారసింహ క్షేత్రంగా శ్రీ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ప్రతీ ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు ఘనంగా చందనోత్సవం నిర్వహిస్తారు. చందనోత్సవానికి ఏపీ నుంచే కాదు ఒడిశా సహా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ప్రతీ ఏటా వచ్చే లక్షలాది మంది మంది భక్తులకు స్వామి దర్శనం చేయించడం కత్తి మీద సాముగా మారుతోంది. సాధారణ భక్తులకు పెద్ద పీట అని చెబుతున్నా ఆ సమయంలో అధికార జోక్యం ఎక్కువగా ఉంటుంది. వీఐపీలు వీవీఐపీలతో పాటు ఆ మాత్రం రాజకీయ పలుకుబడి ఉన్న వారు అంతా హవా చూపిస్తారు.

చందనోత్సవం ఏ ఇబ్బందులూ లేకుండా చేయాలని ఎన్నో సార్లు మీటింగులు పెట్టి కసరత్తు చేసినా ఆఖరి నిముషంలో మాత్రం రాజకీయ జోక్యాలతో అసలు వ్యవహారమే మారుతోంది అన్నది ఉంది. దాంతో చందనోత్సవం వేళ ప్రతీసారి విమర్శలు వస్తున్నాయి. ఆ సమయంలో వేసవి ఎండలకు మండుతూ కొండ మీద గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల అగచాట్లు చెప్పనలవి కాదు.

దాంతో ఈసారి అలాంటివి జరగకుండా ముందస్తుగా సమావేశాలను ఉన్నత స్థాయిలో అధికారులు నిర్వహిస్తున్నారు. చందనోత్సవానికి వచ్చే సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత అని చెబుతున్నారు. అయితే జనాల నుంచి వినిపిస్తున్న ఫిర్యాదు వీఐపీ కల్చర్ ని పక్కన పెట్టి అందరికీ దర్శనాలు చేయించాలని.

కానీ అది ఆచరణలో అంత సులువుగా అయ్యేది కాదు. దాంతో ఎవరికీ చెప్పలేక అధికారులే మల్లగుల్లాలు పడుతూంటారు. ఈసారి ఏప్రిల్ 30న స్వామి వారి చందనోత్సవం వస్తోంది. దానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గతసారి చందనోత్సవం సమయంలో ఎన్నికలు ఉండడంతో రాజకీయ హడావిడి పెద్దగా లేకుండా పోయింది. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వస్తున్న తొలి పండుగ. పైగా మూడు పార్టీలూ అధికారంలో ఉన్నాయి. దాంతో ఏ విధంగా ఈ అధికార రాజకీయ సందడిని సంతరించుకుంటూ సామాన్యుడికి అప్పన్న దర్శనం అధికారులు చేయిస్తారో చూడాలి.

3 Replies to “చందనోత్సవం కత్తి మీద సాము!”

Comments are closed.