తిరుప‌తి దౌర్జ‌న్యాలే పున‌రావృతం!

పాల‌కొండ‌లో కూడా మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక జ‌ర‌గ‌కుండా టీడీపీ గూండాలు య‌థేచ్ఛ‌గా దౌర్జ‌న్యానికి తెగ‌బడ్డార‌ని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో ఎన్నిక వాయిదా ప‌డింది.

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక సంద‌ర్భంగా అక్క‌డ చోటు చేసుకున్న కిడ్నాప్‌లు, దౌర్జ‌న్యాలే రాష్ట్ర వ్యాప్తంగా మ‌రికొన్ని చోట్ల పున‌రావృతం అయ్యాయి. బ‌హుశా తిరుప‌తిలో డార్లింగ్ మంత్రి నేతృత్వంలో సాగించిన అరాచ‌కాన్నే మిగిలిన చోట్ల కూడా టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఆద‌ర్శంగా తీసుకున్నార‌నే మాట వినిపిస్తోంది.

ఇవాళ పాల‌కొండ‌, తుని, పిడుగురాళ్ల మున్సిపాల్టీల్లో చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. క‌నీస బ‌లం లేక‌పోయినా, అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకునేందుకు టీడీపీ నేతృత్వంలో సాగించిన అరాచ‌కాన్ని రాష్ట్ర ప్ర‌జానీకం చూస్తూ నివ్వెర‌పోతోంది. గ‌తంలో వైసీపీ అరాచ‌కానికి పాల్ప‌డింద‌ని విమ‌ర్శించిన టీడీపీ నేత‌లు, ఇప్పుడు తామేం త‌క్కువ కాద‌ని నిరూపించుకోడానికి త‌హ‌త‌హ‌లాడ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

తిరుప‌తిలో టీడీపీకి ఒకే ఒక్క కార్పొరేట‌ర్ ఉన్న‌ప్ప‌టికీ, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని ద‌క్కించుకోడానికి ఆ పార్టీ చేసిన దారుణాలు అన్నీఇన్నీ కావు. ఏకంగా వైసీపీ డిప్యూటీ మేయ‌ర్ అభ్య‌ర్థి శేఖ‌ర్‌రెడ్డి బిల్డింగ్‌ల‌ను కూల్చేయ‌డానికి బుల్డోజ‌ర్ల‌ను పంపి, కొంత మేర‌కు న‌ష్టం క‌లిగించారు. దీంతో శేఖ‌ర్‌రెడ్డి భ‌యాందోళ‌న‌కు గురై, టీడీపీలో చేరిపోయారు. ఇలాంటి ఘ‌ట‌నే పిడుగురాళ్ల‌లో పున‌రావృతం అయ్యింది.

పిడుగురాళ్ల‌లో 29వ వార్డు కౌన్సిల‌ర్ మునీరాకు చెందిన రెండు ఇళ్ల‌ను నిర్దాక్ష్య‌ణ్యంగా కూల్చి వేశారు. ఈ కూల్చివేత‌ల‌తో ఎలాంటి ప్ర‌జాస్వామిక విలువ‌ల్ని నెల‌కొల్పాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం అనుకుంటున్న‌దో, పాల‌కుల‌కే తెలియాలి. కౌన్సిల‌ర్ల‌ను కిడ్నాప్ చేసి, బెదిరించి టీడీపీలో చేర్చుకోవ‌డం… తిరుప‌తి ఘ‌ట‌న‌ను గుర్తు చేస్తోంది. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావు ఆధ్వ‌ర్యంలో సాగ‌డం గ‌మ‌నార్హం.

పాల‌కొండ‌లో కూడా మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక జ‌ర‌గ‌కుండా టీడీపీ గూండాలు య‌థేచ్ఛ‌గా దౌర్జ‌న్యానికి తెగ‌బడ్డార‌ని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో ఎన్నిక వాయిదా ప‌డింది. కాకినాడ జిల్లా తునిలో మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ఎన్నిక జ‌ర‌గ‌కుండా టీడీపీ రౌడీలు ప‌ట్ట‌ప‌గ‌లు, పోలీసుల స‌మ‌క్షంలోనే దాదాగిరి చెలాయించిన‌ట్టు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిల‌ర్ల‌ను ఎన్నిక‌ల హాల్లోకి అనుమ‌తించి, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల్ని మాత్రం అడ్డుకోవ‌డం గ‌మ‌నార్హం.

తునిలో మున్సిప‌ల్ చైర్మ‌న్ సుధాబాలు ఇంటిచుట్టూ భారీ సంఖ్య‌లో టీడీపీ శ్రేణులు మోహ‌రించాయి. ఈ సంద‌ర్భంగా అక్క‌డికి వెళ్లిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి ప్ర‌య‌త్నించ‌డం కెమెరాలు క‌ళ్ల‌కు క‌ట్టాయి. కాపాడాల్సిన పోలీసులు… ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తుండ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. గ‌తంలో వైసీపీ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసింద‌ని టీడీపీ, జ‌న‌సేన తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించాయి. ఇప్పుడు ఏం జ‌రుగుతున్న‌దో రాష్ట్ర ప్ర‌జానీకం టీవీల్లో, సోష‌ల్ మీడియాలో చూస్తూ నివ్వెర‌పోతోంది.

5 Replies to “తిరుప‌తి దౌర్జ‌న్యాలే పున‌రావృతం!”

  1. Ok agreed some facts in this article, but why you have not questioned when brutal things like not allowing to submit nominations, nomination papers are teared, beaten mercilessly, arranged fake voters in some elections….what not…? happened in the previous government.

Comments are closed.