తమ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ మాస్టర్ ప్లాన్ వేసినట్టు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఏకంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధినే అడ్డుకునే కుట్రకు తెరలేపారని జనసేన నేతలు మండిపడుతున్నారు. సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, మత్స్యకారులను రెచ్చగొడుతూ పిఠాపురానికి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారని పవన్ తాలూకూ నాయకులు వాపోతున్నారు.
కాకినాడ సెజ్ తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో వుంటుంది. ఇందులో యు.కొత్తపల్లి పిఠాపురం నియోజకవర్గం, తుని నియోజక వర్గ పరిధిలోకి తుని తొండంగి వస్తాయి. తుని నియోజకవర్గంలో అరబిందో, దివీస్ ఫార్మా కంపెనీలున్నాయి. అంటే తుని నియోజకవర్గంలో అన్నమాట. ఈ కంపెనీలు యు.కొత్తపల్లె మండలానికి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వుంటాయి.
అయితే ప్రశాంతంగా ఉన్న మత్స్యకారులను కాలుష్యం పేరుతో ఏ మాత్రం సంబంధం లేని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రెచ్చగొడుతున్నట్టు జనసేన నాయకులు ఆరోపిస్తుండడం గమనార్హం. తొండంగి, కొత్తపల్లి మండలాల్లో మత్స్యకారులు ప్రశాంతంగా వుండేవారు. ఎప్పుడైతే రాజకీయంగా తన ఉనికికి ప్రమాదం పొంచి వుందని వర్మ గ్రహించారో, అప్పటి నుంచి మత్స్యకారుల్ని రెచ్చగొడుతూ పరిశ్రమలు రాకుండా అడ్డుకునే కుట్రపన్నారని వర్మపై జనసేన నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
కాకినాడ సెజ్‌లో పరిశ్రమలు, అలాగే తన నియోజకవర్గంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇటీవల 10 మంది అధికారులతో కూడిన కమిటీని పంపారు. దీంతో వర్మకు భయం పట్టుకుందనేది జనసేన ఆరోపణ. అంతేకాదు కాకినాడ సెజ్‌కు భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై కూడా పవన్‌కల్యాణ్ దృష్టి సారించారు. ఈ రైతుల్లో ఎక్కువ మంది కాపులున్నారు.
పరిశ్రమల ఏర్పాటుతో పాటు రైతుల సమస్యల్ని పరిష్కరిస్తే పిఠాపురంలో పవన్‌కల్యాణ్ రాజకీయంగా బలపడతాడని, అప్పుడు తనకు భవిష్యత్ లేదని వర్మ ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే ఉన్న పరిశ్రమల యజమానుల్ని బెదిరించడం, కొత్తవి రాకుండా ఆందోళనల పేరుతో భయం సృష్టించే కుట్రకు వర్మ పాల్పడుతున్నట్టు జనసేన నేతల ప్రధాన ఆరోపణ. కాకినాడ సెజ్‌లో కావాల్సినంత భూమి ఉన్నప్పటికీ, పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు రావడం లేదు.
ఎందుకంటే, ప్రస్తుతం అక్కడ నెలకున్న రాజకీయ. దీని వెనుక కూటమిలోని నాయకుడే క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడం ఆశ్చర్యం కలిగించే అంశం. వర్మ వైఖరిపై జనసేన నాయకులు తీవ్రంగా రగిలిపోతున్నారు. కేవలం పవన్ రాజకీయంగా బలపడతారనే ఏకైక కారణంతో ఏకంగా నియోజకవర్గ అభివృద్ధినే అడ్డుకుంటున్నాడని, దీనికి పొల్యూషన్ అనే అస్త్రాన్ని ఆయుధంగా ఎంచుకుని, మత్స్యకారుల్ని పావులుగా వాడుకుంటున్నారని మిత్రపక్ష పార్టీ రగిలిపోతోంది.