ప‌వ‌న్‌పై వ‌ర్మ షాకింగ్ ట్వీట్‌.. తూచ్‌తూచ్‌!

త‌న‌కు తెలియ‌కుండా ఆ పోస్టు, వీడియోను షేర్ చేశార‌ని చెప్పుకొచ్చారు. ఈ లోపు రాజ‌కీయంగా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ ర‌గిలిపోతున్నారు. ప‌వ‌న్ కార‌ణంగా త‌న రాజ‌కీయ ఉనికికి ప్ర‌మాదం ఏర్ప‌డింద‌నే ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ‌ర్మ‌లో నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా పిఠాపురంలో త‌న‌కు సంబంధం లేకుండా జ‌న‌సేన నాయ‌కులు ప‌నులు చ‌క్క‌బెడుతుండ‌డాన్ని వ‌ర్మ జీర్ణించుకోలేక‌పోతున్నారు. పిఠాపురంలో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ఆధిప‌త్య పోరు ప‌తాక‌స్థాయికి చేరింది.

ఆ మ‌ధ్య వ‌ర్మ ప్ర‌యాణిస్తున్న కారుపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. అయిన‌ప్ప‌టికీ వ‌ర్మ ఆవేద‌న‌ను ప‌ట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎక్స్‌లో వ‌ర్మ ఒక పోస్టు పెట్టి, ఆ త‌ర్వాత టీడీపీ అధిష్టానం ఆగ్ర‌హించ‌డంతో తొల‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కూ వ‌ర్మ పోస్టు ఏంటో తెలుసుకుందాం.

“క‌ష్ట‌ప‌డి సాధించిన విజ‌య‌మే నిజ‌మైన గౌర‌వం” అంటూ వ‌ర్మ ట్వీట్ చేయ‌డంతో పాటు ప‌వ‌న్‌తో క‌లిసి ప్ర‌చారం చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. వ‌ర్మ పోస్టుపై ఎవ‌రికి తోచిన‌ట్టు వాళ్లు విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. త‌న వ‌ల్లే ప‌వ‌న్ గెలుపొందార‌నే అర్థం వ‌చ్చేలా వ‌ర్మ పోస్టు పెట్టార‌నేది అంద‌రి అభిప్రాయం. త‌న క‌ష్టంతో ప‌వ‌న్ గెలిచార‌ని, అందుకే ప‌వ‌న్‌కు గౌర‌వం లేద‌ని వ‌ర్మ అభిప్రాయ‌ప‌డిన‌ట్టు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఫైర్ అవుతున్నారు.

పిఠాపురంలో వ‌ర్మ ట్వీట్ రాజ‌కీయంగా మంట పుట్టించింద‌ని గుర్తించిన టీడీపీ అధిష్టానం సీరియ‌స్ అయ్యింది. వ‌ర్మ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. దీంతో వ‌ర్మ వెంట‌నే యూట‌ర్న్ తీసుకున్నారు. త‌న‌కు తెలియ‌కుండా ఆ పోస్టు, వీడియోను షేర్ చేశార‌ని చెప్పుకొచ్చారు. ఈ లోపు రాజ‌కీయంగా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా …తాపీగా వ‌ర్మ ఖాతా నుంచి పోస్టు, వీడియోను తొల‌గించారు.

5 Replies to “ప‌వ‌న్‌పై వ‌ర్మ షాకింగ్ ట్వీట్‌.. తూచ్‌తూచ్‌!”

Comments are closed.