మొత్తానికి పుట్టా సుధాకర్ యాదవ్ దిగివచ్చారు. కావాలంటే తొలగించుకోండి కానీ, తాను మాత్రం రాజీనామా చేయను గాక చేయను అంటూ భీష్మించుకు కూర్చున్న ఆయన మరి ఏమయిందో కానీ అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేసారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో చాలా మంది టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసారు. కానీ పుట్టా మాత్రం భీష్మించుకు కూర్చున్నారు. మరో పక్కన వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమిస్తారని వార్తలు వినిపించాయి. అయినా పుట్టా తన పట్టు వీడలేదు.
ఇలాంటి నేపథ్యంలో ఆయన ఈ రోజు చటుక్కున రాజీనామా చేసారు. ఈరోజునే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీటీడీ బోర్డును ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసి కొత్త బోర్డును నియమిస్తామని ప్రకటించారు. మరి ఏదో ఒక టైమ్ కోసం రాజీనామా చేయాలని చూస్తున్నారో, ఏమిటో? ఈ ప్రకటన రాగానే పుట్టా రాజీనామా చేసారు.
ఇప్పుడు ఇక కొత్త బోర్డును ముఖ్యమంత్రి జగన్ నియమించాల్సి వుంది.