బాబు, ప‌వ‌న్‌కు టీడీపీ, జ‌న‌సేన శ్రేణులు షాక్ ఇస్తాయా?

సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉన్న ప‌ట్టుద‌ల‌… క్షేత్ర‌స్థాయిలో క‌నిపించ‌డం లేద‌ని స‌మాచారం.

గ‌తంలో రాయ‌ల‌సీమ జిల్లాల్లోని రెండు ప‌ట్ట‌భ‌ద్రుల, అలాగే ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్‌కు బుద్ధి చెప్పాల‌ని, వైసీపీ శ్రేణులే వ్య‌తిరేకంగా ప‌ని చేశాయి. ప‌ట్టుప‌ట్టి మ‌రీ మూడుచోట్లా వైసీపీ అభ్య‌ర్థుల్ని ఓడించ‌డంలో సొంత‌పార్టీ శ్రేణులు క్రియాశీల‌క పాత్ర పోషించాయి. ఈ మూడు స్థానాల్లో ఓట‌మే, ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌త‌నానికి దారి తీసింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

ఈ నేప‌థ్యంలో 27న రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయ‌, రెండు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారాయి. ముఖ్యంగా ఉభ‌య‌గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెల‌వాల‌ని సీఎం చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ప‌దేప‌దే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై సంబంధిత‌ మంత్రులు, ఎమ్మెల్యేల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌వుతూ, ఎలాగైనా గెలిచి తీరాల‌ని దిశానిర్దేశం చేస్తున్నారు.

కానీ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉన్న ప‌ట్టుద‌ల‌… క్షేత్ర‌స్థాయిలో క‌నిపించ‌డం లేద‌ని స‌మాచారం. ప్ర‌భుత్వం ఏర్ప‌డి తొమ్మిది నెల‌ల‌వుతోంద‌ని, మాయ మాట‌ల‌తో మ‌భ్య పెట్ట‌డం మిన‌హాయిస్తే, చేసిందేమీ లేద‌నే ఆవేద‌న చాలా మందిలో వుంది. ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే, త‌మ‌కు క‌నీస గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. టీడీపీ ద్వితీయ శ్రేణి నాయ‌కుల్లో కూడా త‌మ పనులేవీ కావ‌డం లేద‌నే ఆగ్ర‌హం వుంది.

ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రికి బుద్ధి చెప్పాలంటే, ఈ ఎన్నిక‌లే స‌రైన‌వ‌నే భావ‌న చాలా మందిలో వుంద‌నే మాట వినిపిస్తోంది. గ‌తంలో జ‌గ‌న్‌కు బుద్ధి చెప్ప‌డానికి వైసీపీ శ్రేణులు ఇలాగే చేశాయ‌నే స్ఫూర్తిని కూట‌మి నేత‌లు తీసుకుంటున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఉదాహ‌ర‌ణ‌కు తెనాలిలో తీసుకుందాం. ఆలపాటి రాజేంద్ర‌ను గెలిపించాల‌ని సోమ‌వారం మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ నాయ‌క‌త్వంలో స‌మావేశం నిర్వ‌హించారు. కానీ నాదెండ్ల మ‌నోహ‌ర్ అనుచ‌రులు ఆల‌పాటికి చేసే ప‌రిస్థితి వుండ‌ద‌ని అంటున్నారు.

ఎందుకంటే ఆల‌పాటిని గెలిపిస్తే, మ‌రో ప‌వ‌ర్ సెంట‌ర్ తెనాలిలో ఏర్ప‌డుతుంద‌నే భ‌యం నాదెండ్ల‌లో వుంది. పైకి మాత్రం ఆలపాటిని గెలిపించాల‌ని స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. పొన్నూరులో ధూళిపాళ్ల న‌రేంద్ర ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజేంద్ర‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ప‌రిస్థితి వుండ‌దు. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో టీడీపీపై జ‌న‌సేన నాయ‌కులు క‌త్తులు నూరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా ఉండ‌ర‌నే గ్యారెంటీ లేదు. అందుకే రెండు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో గెలుపు గురించి టీడీపీ ధీమాగా చెప్ప‌లేని ప‌రిస్థితి.

11 Replies to “బాబు, ప‌వ‌న్‌కు టీడీపీ, జ‌న‌సేన శ్రేణులు షాక్ ఇస్తాయా?”

  1. అబ్బా..అలా జరిగితే బావుండు..అని నీకొచ్చే ఎర్రి కలలు అన్నీ ఇలా ఆర్టికల్స్ పేరుతో ఇక్కడ వదలండి:)

Comments are closed.