Advertisement

Advertisement


Home > Politics - Gossip

టీడీపీలో ఆ ఫిర్యాదులు.. కారణం చంద్రబాబు కాదా?

టీడీపీలో ఆ ఫిర్యాదులు.. కారణం చంద్రబాబు కాదా?

తమకు నియోజకవర్గంలోని నేతలే మోసం చేశారు.. అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షల్లో వారు ఈ విషయంలో ఆందోళన వ్యక్తంచేశారు. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ.. నియోజకవర్గంలో నేతలుగా పేర్గాంచిన వారు పోలింగ్‌ సమయంలో తమకు సహకరించలేదని, ప్రచార సమయం నుంచినే వారు సహకారం అందించలేదనే ఫిర్యాదులు చంద్రబాబుకు అందాయి.

అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాము..' అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే అలాంటి వారిని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదని విశ్లేషకులు మొదటి నుంచినే చెబుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత కలహాల గురించి బయటివారే బాగా చెబుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడి తీరువల్లనే అలాంటి కలహాలు మొదలయ్యాయని.. ఆయన వల్లనే అవి పతాక స్థాయికి చేరాయని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.

భారీ ఎత్తున ఫిరాయింపుదారులను ప్రోత్సహించడంతో తెలుగుదేశం పార్టీకి మేలు జరగలేదని, దానివల్లనే పార్టీ మరింతగా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు మొదటి నుంచి హెచ్చరిస్తూ ఉన్నారు. పార్టీలోకి వచ్చినవారు, పాతవారు కలవలేకపోయారని.. దీంతో రచ్చలు తప్పలేదని పోలింగ్‌ ముందే పరిశీలకులు చెబుతూ వచ్చారు.

అనంతపురం వంటి జిల్లాలో ఐదేళ్ల సమయంలో కూడా జేసీ దివాకర్‌ రెడ్డికి టీడీపీలోని పాత వారికి మధ్యన పొత్తు కుదరలేదు. వారు రోడ్లకు ఎక్కి కొట్టుకున్నంత పనిచేశారు. ఆఖర్లో చంద్రబాబు నాయుడు వారికి రాజీ చేసేసినట్టుగా ప్రకటించారు. అయితే ఆ రాజీలు అన్నీ ఉత్తుత్తివే అని.. ఆ నేతలు ఒకరి కింద మరొకరు గోతులు తీసుకోవడంలో బిజీగానే గడిపారని స్పష్టం అవుతూ వచ్చింది.

ఒక్క అనంతపురం ఎంపీ సీటు పరిధిలోనే చాలా నియోజకవర్గాల్లో రచ్చలు రేగాయి. గుంతకల్‌, అనంతపురం అర్బన్‌, కల్యాణదుర్గం, రాయదుర్గం, శింగనమల.. ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ నేతల మధ్యన విబేధాలు ప్రస్ఫుటం అయ్యాయి. టికెట్లు దక్కిన వారికి మిగతావారు సహకరించని పరిస్థితి కనిపించింది.

కర్నూలుజిల్లాలో ఆఖరి నిమిషంలో పలు రాజీనామాలు కూడా చోటు చేసుకున్నాయి. కర్నూలు ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిలు టికెట్లు ఖరారు దశలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. ఇక కర్నూలు ఎంపీ సీటు పరిధిలో కోట్ల, కేఈ వర్గం పైకి చేతులు కలిపినా లోలోపల సహకరించుకోలేదని స్పష్టం అవుతోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వారే ఫిర్యాదులు చేసుకోవడం గమనార్హం. ఆలూరు, పత్తికొండ, డోన్‌ నియోజకవర్గాల్లో కేఈ, కోట్ల వర్గాలు పోలింగ్‌ సమయంలో కూడా కలహించుకున్నాయని తెలుస్తోంది.

నంద్యాల ఎంపీ సీటు పరిధిలో కూడా అదే రాజకీయం నడిచింది. ఏవీ సుబ్బారెడ్డికి ఏమాత్రం బలంలేదని టికెట్‌ తెచ్చుకున్న భూమా కుటుంబీకులు తమకు ఏవీ సహకరించలేదంటూ ఇప్పుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం విశేషం. నంద్యాల ఎంపీ టికెట్‌ రాజకీయం కూడా ఆఖర్లో పలు రాజీనామాలకు దారితీసింది. ఆళ్లగడ్డలోనూ అఖిలప్రియ తీరుతో కొందరు బయటకు వెళ్లిపోయారు.

ఇలాంటి రాజకీయ పరిణామాలు పోలింగ్‌కు ముందు పక్షంరోజుల పాటు సంభవించాయి. అంతవరకూ చంద్రబాబు నాయుడు ఫిరాయింపు రాజకీయాలతో పార్టీని బలోపేతం చేసుకోవాలని అనుకుంటే.. అవన్నీ ఆఖరి నిమిషంలో ఎదురుతున్నాయి. పలువురు ఫిరాయింపు నేతలు తెలుగుదేశం పార్టీకి రాజీనామాలు చేశారు. కొందరు తిరిగి వైఎస్సార్సీపీలోకి చేరిపోగా మరికొందరు జనసేన బాటపట్టారు. ఇంకొందరు టీడీపీలో ఉంటూ పార్టీకి నష్టంచేశారు.

పోస్ట్‌పోల్‌ విశ్లేషణల సమయంలో చంద్రబాబుకు ఈ విషయంలో పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అయినా మొత్తం కథ అక్కడి వరకూ రావడానికే కారకుడు చంద్రబాబు నాయుడు. ఈ అంశంలో ఆయనకే ఫిర్యాదు చేశారు తెలుగుదేశం నేతలు!

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?