cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

మాటలు-చేతలు ఓకే.. ఫలితం దక్కుతుందా జగన్!

మాటలు-చేతలు ఓకే.. ఫలితం దక్కుతుందా జగన్!

అధికారంలోకి వస్తూనే అవినీతిరహిత పాలన అందిస్తానంటూ జగన్ ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. ఎందుకంటే అదొక సినిమా డైలాగ్. చెప్పడానికి బాగుంటుంది. కానీ చేతల్లోకి వచ్చేసరికి మాత్రం అసాధ్యం. దేశవ్యాప్తంగా కాన్సర్ లా పాతుకుపోయిన అవినీతిని తుడిచివేయడం ముఖ్యమంత్రి వల్ల కాదు కదా, ఆ ప్రధాని వల్ల కూడా కాదు. ఉన్నంతలో దాన్ని నిరోధించొచ్చు తప్ప తుడిచివేయడం సాధ్యంకాదు.

రాజధాని అమరావతిని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వం చేసిన అవినీతి బాగోతాన్ని వెలికితీసే ప్రక్రియ ప్రారంభించారు జగన్. రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూముల వివరాలు, వాటికి చెల్లించిన పరిహారం, ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసిన వాటి వివరాలు, నిర్మాణాల పేరుతో దుర్వినియోగం అయిన కోట్ల రూపాయల నిధులపై పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. కానీ దీన్ని ప్రక్షాళన చేయడం జగన్ అనుకున్నంత సులభంకాదు.

చట్టవ్యతిరేకమైన పనుల్నే చట్టాల చట్రంలో ఇరికించి పకడ్బందీగా చేశారు చంద్రబాబు. అక్రమాల్ని కూడా సక్రమంగా చూపించారు. పైకి ఇల్లీగల్ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి. అమరావతికి సంబంధించి జగన్ చేయాలనుకున్న పూర్తిస్థాయి ప్రక్షాళన సాధ్యం కాకపోవచ్చు. ఉన్నంతలో కొన్ని ఒప్పందాల్ని మాత్రం రద్దుచేసే వీలుంది.

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు కూడా ఇలాంటివే. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలతో రాష్ట్ర ఖజానాకు 2636 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వాటిని రికవరీ చేయాలని అధికారులకు ఆదేశించారు జగన్. సోలార్, పవన విద్యుత్ సంస్థలతో జరిగిన ఒప్పందాలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఓ కమిటీని సైతం వేశారు. కానీ ఆ ఒప్పందాల్ని పునఃసమీక్షించడం కుదరదని కేంద్రం ఇప్పటికే స్పష్టంచేసింది. పైగా కేంద్రం ఆధీనంలో ఎక్కువ శాతం ఉన్న శాఖ ఇది. ఇందులో జగన్ పూర్తిస్థాయిలో వేలు పెట్టడానికి ఆస్కారం లేదు.

ఇక గత ప్రభుత్వ పంచమహాపాతకాల్లో అత్యంత ముఖ్యమైనది పోలవరం. పోలవరాన్ని ఓ అవినీతి కూపంలా మార్చింది టీడీపీ. కేంద్రం సొమ్ముని దిగమింగి ప్రాజెక్ట్ మొదలు కాకముందే పూర్తయినట్టు బిల్డప్ ఇచ్చి, ఏడాదికేడాది డెడ్ లైన్లు పెంచుకుంటూ పోతూ పోలవరాన్ని అవినీతి కాసారంలా మార్చారు చంద్రబాబు. పోలవరం చంద్రబాబుకి ఏటీఎంలా మారిందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.

అలాంటి పోలవరంలో అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తానని జగన్ చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఉన్నంతలో అంచనాల్ని తగ్గించొచ్చేమో తప్ప, బిల్లులు చెల్లించకుండా ఉండలేని పరిస్థితి. కాంట్రాక్టుల్ని కూడా మార్చలేని పరిస్థితి. ఉన్నంతలో జగన్ చేతిలో ఉన్న ఒకే ఒక్క అంశం సహజవనరుల దోపిడీకి అడ్డుకట్ట వేయడం. ఇక్కడ కూడా ఆయన పటిష్టమైన యంత్రాంగాన్ని నెలకొల్పితేనే పని జరుగుతుంది. లేదంటే సహజ వనరుల అక్రమ రవాణా సాగిపోతూనే ఉంటుంది.

ఇప్పటికే ఇసుక రవాణా చూస్తున్నాం. ఖనిజ సంపద దోపిడీ చూస్తున్నాం. దీన్ని సమూలంగా మార్చేసే అధికారం మాత్రం సీఎం చేతిలో ఉంది. ఆ దిశగా ఇప్పటికే బాక్సైట్ తవ్వకాలపై నిషేధం విధించిన ముఖ్యమంత్రి.. సహజ వనరుల దోపిడీ నివారణ, అక్రమ కట్టడాల తొలగింపుపై పూర్తిస్థాయిలో పనిచేసే అస్కారం ఉంది. ఇక పైన చెప్పుకున్న మిగతా అంశాల్లో మాత్రం ఒక్కడిగా మార్పు తీసుకురాలేరు జగన్. ఈ విషయంలో ఆయనకు కేంద్రం నుంచి కూడా పూర్తి మద్దతు అవసరం. అప్పుడే అవినీతిరహిత పాలనకు అంతోఇంతో అర్థం.

జగన్‌ విషయంలో కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?