సవాళ్లు అందరూ చేస్తుంటారు. కొందరు కేవలం మీడియాలో ప్రచారం కోసం నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటారు. మరికొందరు తమ స్థాయిని ఎక్కువ ఊహించుకుని, తమ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేస్తుంటారు. ఇందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసే సవాళ్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి సరికొత్త సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని నందివాడలో ఇళ్ల పట్టాల పంపిణీలో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబుకు సవాల్ విసిరారు. ఇంతకూ తమ్మినేని సవాల్ ఏంటంటే…
‘ఓటుకు కోట్లు కేసులో ఫోన్ రికార్డ్‌లో నీ గొంతు కాదని దబాయిస్తే… కాణిపాకంలోని విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేద్దాం రా?’ అని చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు.
ఒకప్పుడు ప్రమాణాలంటే కాణిపాకం వినాయకుడి ఆలయమే ప్రసిద్ధి. అందుకే ఆ ఆలయాన్నే తమ్మినేని తాజాగా ఎంచుకున్నారు. స్పీకర్ తాజా సవాల్ టీడీపీ శ్రేణుల్ని ఇరుకన పడేసేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్పీకర్ సవాల్‌పై టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల లోకేశ్ పదేపదే ముఖ్యమంత్రి జగన్‌ను ప్రమాణం చేద్దామని సవాల్ విసురుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సరైన సమయంలో సరైన సవాల్‌ను తమ్మినేని విసిరారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తమ్మినేని సవాల్ తండ్రి కాకపోయినా, కనీసం కొడుకైనా స్వీకరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.