దాదాపు పదిరోజుల నుంచి కర్ణాటకలో రాజకీయ రచ్చ కొనసాగుతూ ఉంది. కుమారస్వామి ప్రభుత్వంపై అసహనంతో సంకీర్ణ సర్కారులోని పదహారు మంది ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాలను సంధించారు. స్పీకర్ కు రాజీనామా పత్రాలను పంపించి వారు ముంబైలో తలదాచుకుంటున్నారు. వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించకపోవడం, దానిపై వారు సుప్రీం వరకూ వెళ్లిపోవడం జరిగింది.
అలా అందుకు సంబంధించిన రచ్చ కొనసాగుతూ ఉంది. మరోవైపు కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ విషయంలో భారతీయ జనత పార్టీ ఘాటుగా స్పందిస్తోంది. కుమారస్వామికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతలేదని కమలనాథులు అంటున్నారు. తక్షణం ఆయన రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.
అయితే కుమారస్వామి మాత్రం రాజీనామా ఊసు ఎత్తడంలేదు. అయితే విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి మాత్రం ఆయన సై అని అంటున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా అదేరీతిలో స్పందిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్, కుమారస్వామిలు వేర్వేరు ప్రకటనల్లో విశ్వాస పరీక్షకు సై అని అంటున్నారు.
దీంతో భారతీయ జనతా పార్టీ మరింత వేగంగా స్పందిస్తోంది. తక్షణమే కుమారస్వామి సర్కారుకు విశ్వాస పరీక్ష పెట్టాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారంపై స్పీకర్ అంతిమంగా గురువారానికి వాయిదా వేశారు. గురువారం విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి రెడీగా ఉండాలని స్పీకర్ అధికార పక్షాన్ని ఆదేశించారు.
అంతకన్నా ముందుగా ఎమ్మెల్యేల రాజీనామాలపై రేపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. వారి రాజీనామాలను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీం ఆదేశిస్తే.. ఆయన ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఒకవేళ వారిపై అనర్హత వేటు వేసినా, రాజీనామాలు ఆమోదించినా.. కుమారస్వామి సర్కారుకు తగిన బలం ఉండదు.
విశ్వాస పరీక్షతో ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు కుమారతో టచ్లో ఉన్నారనే ప్రచారమూ జరుగుతూ ఉంది!