చినబాబు కామెడీ : ఎప్పటిలాగే ఇవాళ కూడా..

రాజకీయాల్లో తన మాటలతో నిత్యం కామెడీ చేస్తుండడం, తన అజ్ఞానాన్ని, అవగాహనలేమిని బయటపెట్టుకుంటూ ఉండడం చినబాబు నారా లోకేష్ కు బాగానే అలవాటు. అందుకు ఆయన పేరుమోశారు కూడా. అలాంటి చినబాబు.. తాజాగా జగన్మోహన్…

రాజకీయాల్లో తన మాటలతో నిత్యం కామెడీ చేస్తుండడం, తన అజ్ఞానాన్ని, అవగాహనలేమిని బయటపెట్టుకుంటూ ఉండడం చినబాబు నారా లోకేష్ కు బాగానే అలవాటు. అందుకు ఆయన పేరుమోశారు కూడా. అలాంటి చినబాబు.. తాజాగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్ తో మళ్లీ ఓసారి కామెడీ పండించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఎక్కడ ఏం జరుగుతుందా.. ఎవరు చస్తారా.. అందుకు ప్రభుత్వమే కారణం అన్నట్టుగా ట్వీట్లు చేసేసి.. నాలుగు స్టేట్మెంట్లు గుమ్మరించేసి ప్రభుత్వాన్ని విమర్శిద్దామా.. అని ఎదురుచూస్తూ ఉంటారు కొందరు నాయకులు. చినబాబు కూడా ఆ బాపతే అనడంలో సందేహం లేదు. తాజాగా ఆయన జంగారెడ్డి గూడెం మరణాలకు సంబంధించి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతవరకు ఎవ్వరూ కాదనలేని సత్యం. కొన్ని మరణాలకు సంబంధించి.. నాటుసారా వలన సంభవించిన మరణాలుగా పోలీసులు కేసు కట్టిన మాట కూడా నిజం. నాటు సారా తయారీ అనే ఆరోపణలు అసంబద్ధం అని, అవి సహజమరణాలే అని జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటించడం జరిగింది. అందులో కొంత తొందరపాటు కూడా ఉండొచ్చు. మొత్తానికి జగన్ ఆ మాట అనేశారు. 

అంతమాత్రాన ఆ మరణాలకు పూర్తి బాధ్యత జగన్ ఎలా వహిస్తారు. నాటుసారా మరణాలే అని దర్యాప్తులో తేలితే.. సదరు నాటుసారా కాస్తున్న వారెవరో.. ఇతరప్రాంతాల్లో కాస్తున్నట్టయితే గనుక.. అక్కడినుంచి జంగారెడ్డి గూడెం తెచ్చి అమ్ముతున్న వారెవరో వారిని పట్టుకుని శిక్షించాలనే డిమాండ్ ప్రతిపక్షం వైపు నుంచి వినిపిస్తే సబబుగా ఉంటుంది. అది ధర్మం.. నిజంగా ప్రతిపక్షం నిర్వహించాల్సిన పాత్ర. 

దర్యాప్తు కోరడం, నిందితులు తేలితే లేదా తమకు తెలిస్తే వారి గురించి ఫిర్యాదు చేసి శిక్ష పడేవరకు పోరాడడం చేయాలి. అయితే ఇక్కడ అందరూ గాలివాటు మాటలు చెప్పేవాళ్లే తప్ప.. నిర్దిష్టంగా పలానా వాళ్లే నాటుసారా చేస్తున్నారు, అమ్ముతున్నారు.. అనే మాట ఇప్పటిదాకా ఒక్క పార్టీ గానీ, ఒక్క నేత గానీ చెప్పనేలేదు. దాని గురించి నిజానిజాలు ఏమీ తెలియకపోయినా చినబాబు జగన్ రాజీనామాను డిమాండ్ చేసేస్తున్నారు. ఆ తయారుచేస్తున్న వ్యక్తి/ అమ్ముతున్న వ్యక్తి స్వయంగా నాయకుడు అయితే ఆ రాజీనామా అడిగితే ఓకేగానీ.. లేపోతే ఇలాంటి డిమాండ్ కామెడీ అవుతుంది. 

దీని సంగతి పక్కన పెడదాం.. చినబాబు గారి బాబు గారు చంద్రబాబు గారి వీడియో షూటింగుల పిచ్చి కారణంగా.. గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29మంది అన్యాయంగా చచ్చిపోయారు. అచ్చంగా చంద్రాబాబు వీడియోగ్రఫీ ప్రచార పిచ్చి తప్ప.. వారి చావులకు మరొక కారణం లేదు. ప్రపంచం యావత్తూ చంద్రబాబు వైఖరిని చీదరించుకున్న దుర్ఘటన అది. కాస్త తీవ్రంగా చెప్పాలంటే.. చంద్రబాబు చేసిన హత్యలు అవి!

అంత జరిగితేనే చంద్రబాబు సిగ్గు పడలేదు. రాజీనామా చేయలేదు. నిస్సిగ్గుగా తన పదవీకాలం పూర్తయ్యేదాకా తర్వాత నాలుగేళ్లు పాలన సాగించాడు. అలాంటిది.. ఒకవేళ నాటుసారా వలన మరణాలు అనే నిజమే అనుకుందాం.. ఆ సంగతి తేలితే తప్పుడు పనులు చేసేవారిని శిక్షించేలా జగన్ చర్యలు తీసుకోవాలి గానీ.. రాజీనామా చేయాలా? చినబాబు చిన్నమెదడులో ఉన్న జ్ఞానం రేంజి అంతే అని.. ఆయన ఇలాంటి కామెడీ డిమాండ్లే చేస్తుంటారని సరిపెట్టుకోవాలా?