రాజకీయ నేతల జాతకాలు రాత్రికి రాత్రే మారిపోతాయి. ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలుగా మారిపోవడం రాజకీయాల్లోనే చూస్తుంటాం! నిన్న మొన్నటి వరకూ అధికార బలంతో కన్నూమిన్నూ కానకుండా, తమ చిత్తానుసారం ఏలిన తెలుగు తమ్ముళ్ళుకు ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయి చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఐదేళ్ళపాటు అన్నింటా తామై చక్రం తిప్పిన పచ్చ సోదరులు నేడు వైకాపా నేతల ప్రాభవాన్ని గుడ్లప్పగించి చూస్తున్నారు. ఐదేళ్ళపాటు గోదావరి జిల్లాల్లో దేశంనేతలు హవా అప్రతిహతంగా సాగింది. ఇదే సమయంలో వైకాపా నేతలు అనేక అవమానాలు, చీత్కారాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
2014 ఎన్నికల్లో ఘోర పరాజయమనంతరం ఉభయ గోదావరి జిల్లాల వైకాపా నేతలు గడ్డు పరిస్థితులను చవిచూశారు. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, పార్టీ కీలక నేతలకు తెలుగుదేశం గేలంవేసింది. ఫలితంగా కొందరు వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచారు. ఇంకోవైపు వివిధ నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారు. చివరకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని సైతం టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలు తీవ్రంగా దూషించిన సందర్భాలున్నాయి.
తుంగలోకి ప్రోటోకాల్…
గత టీడీపీ ప్రభుత్వంలో ప్రోటోకాల్‌ను తుంగలోకి తొక్కారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు అక్కడి తెలుగుదేశం నేతలు గత ఐదేళ్ళలో కనీస మర్యాద ఇవ్వకుండా ప్రోటోకాల్ అనేది అమలుకాకుండా చేశారు. అప్పటికే వరుసగా రెండు పర్యాయాలు యనమల రామకృష్ణుడు సోదరులు తుని అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్ధి దాడిశెట్టి రాజా గెలుపోందగా యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు ఓటమి చెందారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో యనమల రామకృష్ణుడు మంత్రిపదవిని అలంకరించారు. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఆఖరున కూర్చున్నా ఇబ్బందేంటి? అన్నట్టు ఎన్నికల్లో ఓడిన మంత్రి సోదరుడికి తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో ఆ ఐదేళ్ళూ యనమల సోదరులు చెప్పిందే చట్టంగా అమలయ్యింది.
ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు చుక్కలు చూపించారు. స్థానిక కార్యక్రమాల్లో రాజాకు ఏ మాత్రం ప్రాధాన్యతనివ్వకుండా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడినందుకు అట్రాసిటీ కేసులు బనాయించారు. ఇటువంటి అక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఫ్యాన్ సునామీకి యనమల ద్వయం కొట్టుకుపోయింది. మరోసారి దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడంతో పాటు ఏపీ అసెంబ్లీలో విప్‌గా నియమితులయ్యారు. ఇక రామచంద్రపురం నియోజకవర్గంలో పరిస్థితి మరింత ఘోరం! గత ఐదేళ్ళలో రామచంద్రపురం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు స్థానిక వైసీపీనేత, ఎమ్మెల్సీ పిల్లి బోస్‌పై అత్యంత అవమానకరంగా ప్రవర్తించారు.
జిల్లా పరిషత్ సమావేశం సాక్షిగా బోసును త్రిమూర్తులు దుర్భాషలాడారు. అవకాశం దొరికిన ప్రతిసారి బోసును బూతులుతిడుతూ దాడికి దిగేవారు. ఆయా సందర్భాల్లో పంతో సంయమనంతో వ్యవహరించిన బోసుకు నేడు జగన్ అగ్రతాంబూలాన్నిచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2014 ఎన్నికల్లో జగ్గంపేట, ప్రత్తిపాడు, రంపచోడవరం నియోజకవర్గాల నుండి వైసీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరిలు ఆనక టీడీపీ ప్యాకేజీలకు ఆశపడి వైకాపాను వీడారు. అధికార పార్టీలో చేరగానే వైకాపా నేతల పట్ల అత్యంత అవమానకరంగా వ్యవహరించారు.
2019 ఎన్నికల్లో వరుపుల సుబ్బారావుకు టీడీపీ టిక్కెట్ ఇవ్వకుండా జెల్లకొట్టింది. వంతల రాజేశ్వరి అడ్రస్ గల్లంతు కాగా జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఘోర పరాజయం చవిచూశారు. అప్పట్లో జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో జిల్లాకు చెందిన మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు తదితరులు అనేక విమర్శలు చేశారు. జగన్ జీవితంలో సీఎం కాలేడని, జీవితాంతం జైలు ఊచలు లెక్కపెట్టుకోవల్సిందేనని ఎద్దేవా చేసేవారు. తీరా ఎన్నికలు కాగానే జగన్ అధికారాన్ని హస్తగతం చేసుకోగా, నిమ్మకాయల, యనమల ద్వయంను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
టీడీపీ హయాంలో పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యేలు చేసిన భూకబ్జాలు, దందాలు తదితర వ్యవహారాలు వివాదాస్పదమయ్యాయి. ఇపుడవన్నీ బయటకు రావాలంటే అధికార వైకాపా చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంది.