జనసేనలో పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నాదెండ్ల మనోహర్. పవన్ తర్వాత మరో పవర్ సెంటర్ గా కూడా ఆయన ఓ వెలుగు వెలుగుతున్నారు. ఏకంగా ఎమ్మెల్యే రాపాకని సైతం పవన్ ముందే గదమాయించే ధైర్యం ఆయనది. పవన్ కల్యాణే ఆ చనువు ఇచ్చారా లేక, తన రాజకీయ చాతుర్యంతో పవన్ ని డమ్మీ చేసేందుకే నాదెండ్ల చొరవ తీసుకున్నారో తెలియదు కానీ, పవన్ ఏం చేసినా, చేస్తున్నా, చేయాలనుకున్నా.. అన్నీ ఆ మాజీ శాసన సభాపతి కనుసన్నల్లోనే జరిగేవి అనేది మాత్రం వాస్తవం.
ముఖ్యంగా బీజేపీతో పొత్తు విషయం నాదెండ్ల పంతమే. తండ్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో ఉండటం, కొడుకు మనోహర్ జనసేనలో ఉండటంతో.. గతంలోనే ఈ పొత్తుపై చాలా ఊహాగానాలున్నాయి. అనుకున్నట్టుగానే జనసేన-బీజేపీ పొత్తు పొడిచింది. అయితే ఆ తర్వాత అకస్మాత్తుగా నాదెండ్ల కనిపించడం మానేశారు.
ఒకటి రెండు కార్యక్రమాలకు, సమీక్షలకు పవన్ వెంటే ఉన్నారు కానీ.. కర్నూలు మీటింగ్ లో కానీ, రాజధాని రైతుల కష్టాలు వినేటప్పుడు కానీ ఆయన ఆచూకీ లేదు. ఇప్పటి వరకూ ఏ ఒక్క కార్యక్రమంలోనూ పవన్ పక్కన మిస్ కాకుండా కనిపించిన మనోహర్.. వరుసగా రెండు కీలక పర్యటనల్లో కనిపించకపోయే సరికి జనసైనికుల్లోనే అనుమానాలు తలెత్తాయి. ఆయన ఎక్కడికి వెళ్లారా అని వెతుక్కుంటున్నారు.
అయితే ఇకపై జనసేన కార్యక్రమాల్లో నాదెండ్ల మునుపటిలా కనిపించకపోవచ్చని అంటున్నారు. మునుపటిలా కాదు, అసలు కనపడడేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. పవన్ ను బీజేపీతో కలిపేంత వరకే ఆయనకు కాంట్రాక్ట్ ఉందని, అందుకే ఆయన సైలెంట్ అయ్యారని టాక్. కీలక నేతలందరూ ఒక్కొక్కరే తప్పుకోవడం, అటు పవన్ కూడా సినిమాల్లోకి వెళ్లిపోవడం, ఇటు నాదెండ్ల మనోహర్ వంటి కాస్తో కూస్తో జనాలకు తెలిసిన మొహం కూడా మొహం చాటేయడం చూస్తుంటే అసలు జనసేనని పూర్తిగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలనుకుంటున్నారని అర్థమవుతోంది.
వచ్చే ఎన్నికలదాకా ఎవరి పనులు వారు చేసుకుని, ఎలక్షన్ హీట్ మొదలయ్యేనాటికి అందరూ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకూ జనసేన సుప్తచేతనావస్థలో ఉంటుందన్నమాట.