కాంగ్రెస్ తో జోడీ వద్దనుకుంటున్న ఆప్!

ఇండియా కూటమి ఢిల్లీ ఎన్నికల సాక్షిగా కుదుపులకు లోనవుతున్న మాట వాస్తవం.

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వారందరూ కొంచెం ఐక్యంగానే ఉన్నట్టు కనిపించారు. అప్పటికీ లుకలుకలు వేర్వేరు ప్రాంతాల్లో బయటపడుతూనే ఉన్నాయి గానీ.. లేదు అంతా ఒక్కటే.. మమ్మల్ని గెలిపిస్తే.. మోడీకి ప్రత్యామ్నాయంగా దృఢంగా నిలబడతాం అని ప్రజల్ని భ్రమ పెట్టడానికి ప్రయత్నించారు. అన్ని ప్రయత్నాలు చేసినా ఇండియా కూటమి లోక్ సభ ఎన్నికల్లో గట్టెక్కలేకపోయింది.

మోడీ మూడోసారి విజయఢంకా మోగించారు. కాగా, ఎన్నికల్లో పరాజయం తర్వాత.. ఇండియా కూటమిలో లుకలుకలు ఇంకా బాగా బయటపడుతున్నాయి. ఎవరికి వారు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకోవడం, తాము మరింతగా బలపడాలని కోరుకునే స్థితిలో ఉండడం వెరసి ఇండియా కూటమి ఐక్యతకు, ప్రస్థానానికి ముప్పుగా మారుతున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ఈమేరకు పార్టీ సారథి అరవింద్ కేజ్రీవాల్ అధికారికంగా ప్రకటించారు. ఇండియా కూటమిలో ఆప్ భాగం కావడం వలన.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగానే పోటీచేస్తారనే విషయంలో చాలా కాలంగా రకరకాల పుకార్లున్నాయి. కాంగ్రెసుతో ఆప్ సీట్లు పంచుకుంటుందనే వాదన బలంగా ఉంది. నిజానికి ఈ వాదనను కాంగ్రెసు బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. అయితే ఇలాంటి ప్రచారాలను అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా తోసిపుచ్చారు. కాంగ్రెసుతో పొత్తు అనే మాటే లేదని, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అన్ని స్థానాలకు పోటీచేస్తుందని ఆయన వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో ఆప్ ను మరింత బలంగా మార్చుకోడమే లక్ష్యంగా ఇలా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇండియా కూటమి మీద పెత్తనం తనకు కావాలంటూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవలే తన కోరికను వ్యక్తం చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది అనే సంగతి అర్థమయ్యేసరికి.. ఇండియా కూటమి పార్టీలన్నీ కాంగ్రెసును ఖాతరు చేయడం మానేసినట్టుగా కనిపిస్తోంది.

దానికి తోడు ఇటీవలి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు కూడా కూటమిపై ప్రతికూల ప్రభావం చూపించాయి. మహారాష్ట్రాలో కాంగ్రెస్ సారథ్యంలో దారుణంగా ఓడిపోవడం వల్ల.. ఆ పార్టీ బలం గురించి మిగిలిన వారికి నమ్మకం పోయింది. జార్ఖండ్ లో విజయం గురించి కాంగ్రెస్ ను అభినందించే పరిస్థితి ఏమాత్రమూ లేదు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఢిల్లీ ఎన్నికల సాక్షిగా కుదుపులకు లోనవుతున్న మాట వాస్తవం.