ఇప్పటికే ఓసారి తొక్కిసలాట జరిగింది. రేపు మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో కుంభమేళా పరిసర ప్రాంతాల్లో హై-అలర్ట్ జారీ చేశారు. దీనికి కారణం రేపు మాఘ పౌర్ణమి.
మాఘ పౌర్ణమి రోజున త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు కోట్లాది మంది భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్నిరోజుల కిందట తొక్కిసలాట జరిగిన రోజు కూడా పర్వదినమే. ఆ ఘటన తర్వాత వస్తున్న మరో మంచి రోజు కావడంతో ఈసారి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.
ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ఎల్లుండి వరకు మొత్తం కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్’ జోన్ గా ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఉండేందుకు మరో 52 మంది కొత్త అధికారుల్ని, అదనపు బలగాల్ని ఏర్పాటుచేసింది.
బుధవారం జరగనున్న నాలుగో అమృత స్నానాన్ని జయప్రదం చేసేందుకు భక్తులంతా సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. నిన్నటివరకు నెలకొన్న వంద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ను ఈరోజు క్రమబద్దీకరించారు. దాదాపు 24 గంటల పాటు ట్రాఫిక్ లోనే నిలిచిపోయిన భక్తులు ఈరోజు ఘాట్స్ వరకు చేరుకోగలిగారు.
జనవరి 13 నుంచి జరుగుతున్న ఈ కుంభమేళాలో ఇప్పటివరకు 45 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్టు ఓ అంచనా. రేపు ఒక్క రోజే 80 లక్షల నుంచి కోటి మంది స్నానాలు చేసే అవకాశం ఉంది.
రేపు ఒక్కరోజు గడిస్తే, తిరిగి రద్దీ ఎక్కువగా ఉండే రోజు శివరాత్రి మాత్రమే. అందుకే అధికార యాంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దని, స్నానాలు చేసే ప్రాంతాల వద్ద తొందర పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు,
Om