ట్రంప్ ముంచుతాడా, తేల్చుతాడా!

బీజేపీకి పునాదులు వేసిన వాజ్ పేయి, అద్వానీల పాల‌న‌ను కూడా ఒక పాల‌న‌గా గుర్తించ‌డానికి మోడీ భ‌క్త‌గ‌ణం పెద్ద ఆస‌క్తి చూప‌దు!

‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనేది..’ ట్రంప్ త‌ర‌చూ ఇచ్చే నినాదం! అధికారం కావాల‌నుకునే వాళ్లంతా ఇలాంటి మాట‌లే చెబుతూ ఉంటారు. కాంగ్రెస్ అర‌వై యేళ్ల పాల‌న‌లో దేశం నాశ‌నం అయ్యింద‌ని బీజేపీ వాళ్లంటారు, ఇది ఒక సంద‌ర్భంలో చెప్పే మాట‌! అయితే పాకిస్తాన్ తో పోలిక పెట్టి.. దేశం ప్ర‌గ‌తి సాధించిందంటారు! ఇది మ‌రో సంద‌ర్భంలో చెప్పే మాట‌! అలాగే 2014 త‌ర్వాతే ఇండియాకు స్వ‌తంత్రం వ‌చ్చిందంటారు భ‌క్తులు! మ‌రి 1998 నుంచి 2004 వ‌ర‌కూ క‌మ‌లం పార్టీ పాల‌నే క‌దా, కేంద్రంలో అధికారంలో లేక‌పోయినా రాష్ట్రాలుగా బీజేపీ చాలా సంవ‌త్స‌రాలు పాటు ఏలింది క‌దా.. అంటే ఇవ‌న్నీ లెక్క‌లోకి రావు. బీజేపీకి పునాదులు వేసిన వాజ్ పేయి, అద్వానీల పాల‌న‌ను కూడా ఒక పాల‌న‌గా గుర్తించ‌డానికి మోడీ భ‌క్త‌గ‌ణం పెద్ద ఆస‌క్తి చూప‌దు! 2014 త‌ర్వాతే స్వ‌తంత్రం వ‌చ్చింద‌ని వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు.

మ‌రి ఇలా చూసుకున్నా ప‌దేళ్ల పాల‌న పూర్త‌య్యింది? మ‌రి ప‌దేళ్ల కింద‌ట చెప్పిన క‌బుర్లు ఎన్ని ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చాయంటే మళ్లీ ప్ర‌శ్నార్థ‌కాలే! అప్ప‌ట్లో స్విస్ బ్యాంకుల్లో ల‌క్ష‌ల కోట్ల భార‌తీయ ధ‌నం అని, దాన్ని పంచితే త‌లా కోట్ల రూపాయ‌లు ద‌క్కుతాయ‌ని, నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం అంతా మాయం అని, మాస్ట‌ర్ స్ట్రోక్ అని.. ఇలా ఏదేదో చెప్పారు!

ఇక డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ గురించి గుజ‌రాత్ సీఎం హోదాలో మోడీ మాట‌ల‌కూ.. ఇప్పుడు జ‌రుగుతున్న దానికీ సంబంధం లేదు! పెట్రో ధ‌ర‌ల గురించి అప్ప‌ట్లో మోడీ చాలా మాట్లాడారు! కేంద్రాన్ని నిందించారు! డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ గురించి నిర్మ‌లా సీతారామ‌న్ పాత ప్ర‌సంగాలు కూడా ఇప్పుడు భ‌లే కామెడీ అనిపిస్తాయి! యూపీఏ హ‌యాంలో త‌ర‌చూ ఈ అంశాల గురించి తెగ మాట్లాడేవారు. ఇప్పుడేమో ఈ మారకంలో పాత రికార్డులు బ‌ద్ధ‌లవుతున్నాయి! అయితే ఇప్పుడు అస‌లు అంశాలు ప్రాధాన్య‌త‌తో కూడుకున్న‌వ‌ని ఏలుతున్న వారికి అనిపించ‌వు!

ఇండియా సంగ‌త‌లా ఉంచితే.. అవ‌త‌ల ట్రేడ్ వార్ ప్రారంభించి కూర్చున్నాడు అమెరికా అధ్య‌క్షుడు. మ‌రి ఈ ట్రేడ్ వార్ అమెరికాను ముంచుతుందా, తేల్చుతుందా.. అలాగే ప్ర‌పంచాన్ని మరెలా ప్ర‌భావితం చేస్తుంద‌నేది ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ‌! ట్రేడ్ వార్ ద్వారా ప్ర‌పంచం మొత్తాన్నీ త‌న కాళ్ల వ‌ద్ద‌కు తెచ్చుకోవాల‌నే వ్యూహం ఉంది ట్రంప్ వ‌ద్ద‌. అమెరికా ట్రేడ్ వార్ కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పే వాళ్లు కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. చైనా మాత్ర‌మే మాట్లాడ‌గ‌ల‌దు. అయితే చైనా దిగుమ‌తుల‌పై ట్రంప్ ప‌ది శాత‌మే టారీఫ్ విధించ‌గలిగాడు ఇప్ప‌టి వ‌ర‌కూ. అదే కెన‌డా, మెక్సికో దిగుమ‌తుల‌పై ఇర‌వై ఐదు శాతం టారీఫ్ లు విధించాడు. ఈ టారీఫ్ ల అస‌లు టార్గెట్ చైనా అనే అభిప్రాయాలు మొద‌ట వినిపించినా, ట్రంప్ అంత‌టి సాహ‌సం చేయ‌లేక‌పోయాడు. ఒక‌వేళ నిజంగానే చైనా నుంచి అమెరికా దిగుమ‌తుల‌పై ఈ స్థాయి టారీఫ్ లు విధిస్తే.. అమెరికాలో మ‌రింత అత‌లాకుతం మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే విధించిన టారీఫ్ ల వ‌ల్ల అమెరిక‌న్ ఇన్వెస్ట‌ర్ల సంప‌ద భారీగా ఆవిర‌య్యింది. పెద్ద పెద్ద కంపెనీలు బిలియ‌న్ల కొద్దీ డాల‌ర్ల సంప‌ద‌ను కోల్పోయాయి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, ట్రేడ్ వార్ ను ట్రంప్ ఇక ఏ మాత్రం మోతాదు పెంచినా.. అమెరికా మ‌రో ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవ‌కాశాలు ఉన్నాయ‌నే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి. అయితే క‌చ్చితంగా అన‌డం లేదు నిపుణులు, అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారంతే! అమెరికా మాంద్యంలో కూరుకుంటే.. ఆ ప్రభావం ఇండియాపై ఎలా ప‌డుతుందో కొత్త‌గా వివ‌రించి చెప్ప‌న‌క్క‌ర్లేదు!

అయితే ట్రంప్ కు ఈ భ‌యం లేదా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌శ్న‌! ఒక‌వేళ ఈ నిర్ణ‌యాల వ‌ల్ల దేశం ఆర్థిక‌మాంద్యంలో చిక్కితే అప్పుడు మొద‌టికే మోసం వ‌స్తుంది. అప్పుడు అన్ని టారీఫ్ లు ఎత్తివేయ‌డంతో పాటు.. చేసిన ప‌నికి జ‌రిగిన న‌ష్టం కూడా కౌంట్ అవుతుంది! అయితే తెగించినోడికి తెడ్డే లింగం అన్న‌ట్టుగా.. ట్రంప్ అయితే మాంద్యం గురించి భ‌య‌ప‌డుతున్న‌ట్టుగా లేదు. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఇది ట్రాన్సిష‌న్ ఫేజ్ అన్న‌ట్టుగా ఉంది ట్రంప్ స్పంద‌న‌!

మ‌రి ఈ ట్రాన్సిష‌న్ ఎన్నాళ్లు? ఈ స్థితి ఎలాంటి ప‌రిస్థితుల‌ను క్రియేట్ చేస్తుంది అనేది రానున్న కాలంలో క్లారిటీ వ‌చ్చే అంశం. ఒక‌వేళ మాంద్యం వ‌చ్చినా భ‌రించాల్సిందే, అది కూడా ఒకందుకు మంచిదే అనే థియ‌రీని ట్రంప్ చెప్ప‌గ‌ల‌డు! నోట్ల ర‌ద్దుతో అద్భుతాలు జ‌రుగుతాయ‌ని భ‌క్తులు చెప్పారు, అయితే దాని వ‌ల్ల సామాన్యులే బాధ్యులు అయ్యారు, బ‌జారులో వ‌చ్చి నిలుచున్నారు! అలాగే ట్రంప్ వ‌ద్ద కూడా ఒక ప‌దునైన అస్త్రం ఉంది. అదే జాతీయ‌వాదం.

ఒక జ‌ర్మ‌న్ వ‌ల‌స కుటుంబంలో జ‌న్మించిన ట్రంప్ అమెరికా పాలిట అతి పెద్ద జాతీయ‌వాది అయ్యాడు. ఈ నిర్ణ‌యాల‌న్నీ తేడా కొట్టినా.. జాతీయ వాదాన్ని వినిపించి త‌ప్పించుకోగ‌ల ఘ‌నాపాటి ట్రంప్. అలాగే అమెరికా నుంచి ఎగుమ‌తులు, అమెరిక‌న్ కంపెనీల విదేశీ వ్యాపారాల‌కు ట్రంప్ గ‌ట్టిగానే స‌హ‌కారం అందిస్తున్నాడు. టెస్లా విష‌యంలో ఇండియా కూడా కిక్కురుమ‌నే ప‌రిస్థితి లేకుండా పోయింది. బైడెన్ ప్ర‌భుత్వ హ‌యాంలో టెస్లా విష‌యంలో ఇండియా పంతం ద‌క్కింది. ట్రంప్ వ‌చ్చాకా మోడీ వెళ్లి మౌనంగా తిరిగి వ‌చ్చారు!

టెస్లా ఇండియన్ మార్కెట్ లోకి రానుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలోనే.. కొన్ని దేశీయ కార్ల కంపెనీల షేర్లు ప‌త‌నం అయ్యాయి పాపం! మ‌హీంద్రా ఆరు షేర్లు ఆరు శాతం ప‌త‌నం అయ్యాయి! ఇలా చూస్తే.. త‌న దేశంలోకి వ‌చ్చే వాటిపై టారీఫ్ లు విధించ‌డ‌మే కాకుండా, త‌న వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి స్వేచ్ఛా వాణిజ్యానికి ట్రంప్ పంతం నెగ్గించుకుంటున్నాడు!

7 Replies to “ట్రంప్ ముంచుతాడా, తేల్చుతాడా!”

  1. ట్రంప్ వ‌చ్చాకా మోడీ వెళ్లి మౌనంగా తిరిగి వ‌చ్చారు , టెస్లా విష‌యంలో మోడీ కూడా కిక్కురుమ‌నే ప‌రిస్థితి లేకుండా పోయింది

Comments are closed.