ఇండియాపై ట్విట్టర్ దెబ్బ.. లక్షల్లో ఖాతాలు గల్లంతు

ఎప్పుడైతే ట్విట్టర్ సంస్థ మస్క్ చేతిలోకి వెళ్లిందో, అప్పట్నుంచి ఈ కంపెనీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వేలల్లో ఉద్యోగాలు తొలిగించడంతో పాటు, ఏకంగా ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చేశాడు మస్క్. దీంతో…

ఎప్పుడైతే ట్విట్టర్ సంస్థ మస్క్ చేతిలోకి వెళ్లిందో, అప్పట్నుంచి ఈ కంపెనీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వేలల్లో ఉద్యోగాలు తొలిగించడంతో పాటు, ఏకంగా ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చేశాడు మస్క్. దీంతో పాటు సాంకేతికంగా చాలా మార్పులు తీసుకొచ్చాడు.

ఈ క్రమంలో ఫేక్ ఎకౌంట్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది ఎక్స్-కంపెనీ. ఆయా దేశాల్లో ఉన్న పాలసీలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ట్విట్టర్ ఖాతాల్ని సస్పెండ్ చేస్తోంది. ఆ సెగ ఇండియాకు కూడా గట్టిగానే తగిలింది. నెల రోజుల్లో ఇండియా నుంచి ఏకంగా 2,34,584 ఎకౌంట్లను సస్పెండ్ చేసింది ట్విట్టర్.
 
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 25 మధ్య ఈ ఎకౌంట్లను సస్పెండ్ చేసినట్టు ట్విట్టర్ ప్రకటించింది. ఏఏ కేటగిరీల్లో ఈ ఎకౌంట్లను సస్పెండ్ చేసిందో కూడా సదరు కంపెనీ వెల్లడించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఆధారంగా తన మంత్లీ రిపోర్ట్ ప్రకటించింది ట్విట్టర్. ఇందులో ఇండియా నుంచి 3వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపింది. ద్వేషపూరిత పోస్టులకు సంబంధించి అత్యథికంగా 1424 రిపోర్టులు వచ్చాయని, వీటి తర్వాత స్థానాల్లో ఖాతా దుర్వినియోగం/వేధింపులు (917), పిల్లలపై లైంగిక వేధింపులు (366), అడల్ట్ కంటెంట్ (231)కు సంబంధించి రిపోర్టులు వచ్చాయని తెలిపింది

ఈ రిపోర్టులతో పాటు.. ఉగ్రవాద చర్యలు, మతహింసకు సంబంధించిన కొన్ని ఎకౌంట్లపై ట్విట్టర్ స్వయంగా చర్యలు తీసుకుంది. తద్వారా 2 లక్షలకు పైగా ఎకౌంట్లను సస్పెండ్ చేసింది. అయితే ట్విట్టర్ ఇలా కొరడా ఝులిపించడం ఇదే తొలిసారి కాదు. ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 25 మధ్య ఏకంగా 5 లక్షల 57వేల ఖాతాల్ని నిషేధించింది.అంతకంటే ముందు జులై 26 నుంచి ఆగస్ట్ 25 మధ్య ఏకంగా 12 లక్షల 80వేలకు పైగా ట్విట్టర్ ఖాతాల్ని సస్పెండ్  చేసింది. 

ఇలా ఇండియాపై కాస్త గట్టిగానే దృష్టిపెట్టింది ట్విట్టర్. సీఈవోగా లిండా ఎపాయింట్ అయిన తర్వాత ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇకపై ట్విట్టర్ ఖాతాదారులంతా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదేమో.