జ‌గ‌న్ పై రాంగ్ ట్రాక్ నే న‌మ్ముకున్న తెలుగుదేశం పార్టీ!

ఏపీలో అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ కు గ‌ట్టిగా రెండు వారాల స‌మ‌యం ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికీ.. ప్ర‌స్తావిస్తున్న అంశాలు కాస్త ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన…

ఏపీలో అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ కు గ‌ట్టిగా రెండు వారాల స‌మ‌యం ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికీ.. ప్ర‌స్తావిస్తున్న అంశాలు కాస్త ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రీతిలో ఉన్నాయి!

ఒక‌వైపు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను తిరిగి సీఎంను చేస్తే త‌ను చేసేదేంటో సూటిగా చెప్ప‌లేక‌పోతున్నారు! ఎంత‌సేపూ జ‌గ‌న్ పెట్టిన ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తానంటూ చంద్ర‌బాబు నాయుడు చెబుతున్నారు త‌ప్ప‌, త‌న మార్కు పాల‌న తెస్తానంటూ చెప్పుకునే ధైర్య‌మే చంద్ర‌బాబులో లేదు!

ఒక‌వైపు జ‌గ‌న్ అమ‌లు పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల రాష్ట్రం ప‌రిస్థితి దివాళా ద‌శ‌కు చేరుకుంద‌ని, ఏపీ శ్రీలంక అయిపోతోందంటూ రెండు మూడేళ్ల నుంచి గుక్క పెడుతూ ఏడుస్తోంది ప‌చ్చ‌బ్యాచ్! అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి చంద్ర‌బాబు నాయుడు ఇస్తున్న సంక్షేమ హామీలు జ‌గ‌న్ కు మూడు నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉన్నాయి!

జ‌గ‌న్ ఐదు వేల రూపాయ‌ల‌ను ప్ర‌జ‌ల ఖాతాలో వేస్తున్న చోట‌.. తెలుగుదేశం హామీలు 15 నుంచి 20 వేల వ‌ర‌కూ ఉన్నాయి! ఎలాగూ అమ‌లు చేసే హామీలు కాద‌న్న‌ట్టుగా.. చంద్ర‌బాబు నాయుడు ఎడాపెడా హామీల‌ను గుప్పిస్తున్నారు! మ‌రి జ‌గ‌న్ ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంద‌నే బ్యాచ్ కు చంద్ర‌బాబు ఇస్తున్న హామీల విష‌యంలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావ‌డం లేదు!

జ‌గ‌న్ సంక్షేమం త‌ప్పు అయితే.. అందుకు మూడు నాలుగు రెట్ల ఎక్కువ డ‌బ్బులు ఇస్తానంటున్న చంద్ర‌బాబును ఎలా స‌మ‌ర్థిస్తారు! ఇక చంద్ర‌బాబు సంప‌ద‌ను సృష్టించేస్తారంటూ కూడా ప‌చ్చ‌బ్యాచ్ ఒక వాద‌న‌ను లేవ‌దీస్తోంది. అయితే చంద్ర‌బాబు సృష్టించిన సంప‌ద ఏపాటిదో 2014 నుంచి 2019 మ‌ధ్య‌న అంతా చూశారు! ఆయ‌న సృష్టించిన సంపద ప‌చ్చ చొక్కాల జేబుల్లో త‌ప్ప మ‌రోచోట కాదు!

2019లో అధికారం దిగిపోయే నాటికి ఖ‌జానాలో యాభై కోట్ల రూపాయ‌ల డ‌బ్బు కూడా లేద‌ని అప్ప‌టి ఆర్థిక శాఖా మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు బాహాటంగా ప్ర‌క‌టించారు! అయిన‌కాడికి అప్పులు చేశార‌ప్ప‌ట్లోనే! అలా చేసిన అప్పుల‌ను కూడా జన్మ‌భూమి క‌మిటీలు, నీరు చెట్టు అంటూ ప‌చ్చ కాంట్రాక్టర్ల జేబుల‌నే నింపారు, జ‌నాల‌కు తోఫాలు, పండ‌గ‌ కానుక‌లు అంటూ ముష్టి విధిల్చారు! మ‌రి ఆ పాల‌న‌ను తిరిగి తెస్తానంటూ చెప్పుకునే ధైర్యం చంద్ర‌బాబుకు లేదు! అందుకే జ‌గ‌న్ అమ‌ల్లో పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎడాపెడా కొన‌సాగిస్తానంటూ ఆయ‌న ప్ర‌చారం చేసుకుంటూ ఉన్నారు!

వ‌లంటీర్ల విష‌యంలో ఇన్నాళ్లూ అడ్డ‌గోలుగా చండాల‌పు మాట‌లు మాట్లాడి, ఇప్పుడేమో వారికీ జీతాలు పెంచుతార‌ట‌! జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను తిరిగి తెస్తానంటూ చెప్పుకునే ధైర్యం లేదు! దీంతో జ‌గ‌న్ పెట్టిన వ్య‌వ‌స్థ‌ను కొనసాగిస్తానంటూ చెప్పుకోవాల్సి వ‌స్తోంది! ఇక భ‌విష్య‌త్తుకు గ్యారెంటీ చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి ఏవేవో హామీలు ఇచ్చారు. అయితే చంద్ర‌బాబు నాయుడు ఇచ్చే హామీలు గాలి మూట‌ల‌నే సంగ‌తి ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌నిది కాదు! ఇప్ప‌టికే చంద్ర‌బాబును వారు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో 23 సీట్ల‌కు పరిమితం చేశారు.

ఇప్పుడు చంద్ర‌బాబు కొత్త గార‌డీలు చేసినా ఉప‌యోగం అయితే ఉండేలా లేదు! ఇక పొత్తుల‌ను పెట్టుకున్నాం ఓట్లేయండి అని ఒక‌వైపు అడుక్కొంటున్నారు. ఆ పొత్తుల వ‌ల్ల లాభం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ‌గా ఉండేలా ఉంది. జ‌న‌సేన‌తో పొత్తూతో ప్ర‌యోజ‌నం ఉండేలా లేదు, ఇక బీజేపీతో పొత్తు వ‌ల్ల భారీగా ఓట్ల‌కు చిల్లు ప‌డుతోంది!

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏతావాతా.. తెలుగుదేశం పార్టీకి మిగిలిన అస్త్రం ష‌ర్మిల‌! ష‌ర్మిల‌కు జ‌గ‌న్ అన్యాయం చేసేశాడ‌ని.. అందుకు గానూ అత‌డిని మ‌ళ్లీ ఎన్నుకోకూడ‌దంటూ తెలుగుదేశం పార్టీ బృందం వాదిస్తూ ఉంది! సోష‌ల్ మీడియాలో చూసినా.. తెలుగుదేశం టీ కొట్టు వాద‌న‌ల్లో అయినా.. ష‌ర్మిలే బ్ర‌హ్మాస్త్రంగా మారింది! ఆమె సంగ‌తి స‌రేస‌రి! ఆమె మాట్లాడుతుంటేనే జ‌నాలు న‌వ్వుకుంటూ ఉన్నారు!

తెలంగాణ‌లో ఆమె చాలా మాట్లాడారు, ప్ర‌హ‌స‌నంగా అక్క‌డ రాజ‌కీయ బిచాణ ఎత్తేసి ఏపీలో తేలారు! ష‌ర్మిల‌కు జ‌గ‌న్ అన్యాయం చేశాడ‌ని, ష‌ర్మిల చీర రంగు గురించి జ‌గ‌న్ కామెంట్ చేశాడ‌ని.. ఇలాంటి లేకి వాద‌న‌తో చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని తెలుగుదేశం స్పందిస్తూ ఉంది! ఇలా ఎంత‌కు దిగ‌జార‌వ‌చ్చో.. అంత‌కు ప‌దిరెట్ల కింద‌కు దిగ‌జారి తెలుగుదేశం పార్టీ త‌న ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంది!

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా టీడీపీ అయిన కాడికి వాడుకుంది. వివేక‌ను జ‌గ‌నే హ‌త్య చేయించాడ‌ని, సానుభూతి కోసం ఆ ప‌ని చేయించాడంటూ అప్పుడు పోలింగ్ కు నెల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలు విప‌రీతంగా ప్ర‌చారం చేయించుకున్నాయి! ఆ నెల రోజుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ కేసును భ్ర‌ష్టు పట్టించ‌డంలో తెలుగుదేశం విజ‌య‌వంతం అయ్యింది. అయితే అప్పుడు టీడీపీకి ద‌క్కింది 23 సీట్లే!

ఇప్పుడు తాము ఏం చేస్తామో, ఏం చేయ‌గ‌ల‌మో చెప్పుకోలేక‌.. జ‌గ‌న్ బాట‌నే అనుస‌రిస్తానంటూ చంద్ర‌బాబు నాయుడు చెప్పుకుంటూ ఉండ‌టంతో ప‌చ్చ బ్యాచ్ ప‌రువు పోతోంది. దాన్ని క‌వ‌ర్ చేసుకోవ‌డానికి ష‌ర్మిల ను న‌మ్ముకుని టీడీపీ పోలింగ్ కు ప‌క్షం రోజుల ముందు కూడా ఆమె జ‌పం చేస్తోంది! ఇదీ తెలుగుదేశం పార్టీ ధీనావ‌స్థ‌కు ప్ర‌తీక‌!

-హిమ‌