జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పమంటే వైకాపా నాయకులు సైతం సంక్షేమ పథకాల గురించే చెబుతారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, ఇంటివద్దకే పెన్షన్ మరియు సరుకులు, రైతు భరోసా కేంద్రాలు, విదేశీ విద్యాదీవెన, వాలంటీర్ల సేవలు.. ఇలాంటివన్నీ చెప్పుకొస్తారు.
సంక్షేమం సరే అభివృద్ధి మాటేమిటి అని అడిగితే ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, పోర్టుల అభివృద్ధి..ఇవన్నీ చెబుతారు.
“అయితే ఇవన్నీ ప్రజాధనంతో చేసే పనులు. మా దృష్టిలో అభివృద్ధి అంటే బయటినుంచి పెట్టుబడులు తీసుకురావడం. అంటే పరిశ్రమలు పెట్టించి, తద్వారా పన్నుల ద్వారా రాబడిని, స్థానిక ప్రజలకి ఉద్యోగావకాశాలని, పర్యవసానంగా చుట్టూ రియల్ ఎస్టేట్ ఎదుగుదల… ఇదీ మాకు తెలిసిన అభివృద్ధంటే. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు తన హయాములో కియా మోటర్స్, జాకీ కంపెనీలని తీసుకొచ్చాడు. అలా మీ జగన్ మోహన్ రెడ్డి చేసింది ఒక్కటైనా ఉందా?” చెప్పమంటే టక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది వైకాపా సపోర్టర్స్ కి.
అలాగని పెట్టుబడులు తేలేదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదా అంటే కాదు. చంద్రబాబుని జగన్ ఈ విషయంలో ఎప్పుడో తలదన్నేసాడు.
చంద్రబాబు హయాములో కియా, జాకీ అనే 2 కంపెనీలొస్తే, జగన్ పాలనలో 50 కి పైగా కంపెనీలొచ్చాయి. అవును, ఇది ఆశ్చర్యంగా అనిపించే విషయమే. చాలామందికి నమ్మడానికి కూడా మనసు రాని పరిస్థితే.
ఎందుకంటే గత ఐదేళ్లుగా వైకాపా శ్రేణులన్నీ సంక్షేమ పథకాల గురించి ఊదరగొట్టాయే తప్ప ఈ పెట్టుబడుల గురించి చెప్పుకోవడంలో ఉత్సాహం చూపించలేదు. ఒక్క కియా మోటర్స్ ని అడ్డుపెట్టుకుని చంద్రబాబుని అభివృద్ధి సారధి అని కొనియాడిన నాటి తెదేపా అనుకూల మీడియా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడుల గురించి నామమాత్రంగా కూడా చెప్పలేదు. వాళ్లు చెప్పరు సరే. సొంత పత్రిక సాక్షి చేసిన పనేంటి? అసలు ప్రభుత్వ పరంగా విడుదల చేసిన ప్రకటనలన్నీ వాళ్లకి ఇంత పంచాం, వీళ్లకి ఇంత ఇచ్చాం అని వితరణ కార్యక్రమాలని ప్రచారం చేసారు తప్ప 50 కి పైగా పెట్టుబడులొస్తే వాటి గురించి ప్రకటించుకోలేదే? జనాల్లోకి వెళ్లే దాకా బాకా ఊదలేదేం?
పెట్టుబడుల గురించి చెప్పుకోవడం చంద్రబాబు అలవాటు తప్ప తమది కాదనుకున్నారో ఏమో! తమ బ్రాండ్ గా సంక్షేమం ఒక్కటీ ఉంటే చాలనుకున్నారేమో. ఇంతకంటే తెలివితక్కువతనం మరొకటి ఉండదు.
ఇక కల్పించిన ఉద్యోగాల విషయం చూద్దాం. 2014-19 మధ్య చంద్రబాబు హయాములో 38,000 ఉద్యోగాలు మాత్రం కల్పించబడితే జగన్ పాలనలో 3.47 లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయి. వీరిలో విలేజ్ వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. అవీ ఉద్యోగాలేగా! కాదనుకుంటే మాకీ ఉద్యోగమొద్దని కంప్లైంట్లో, జీతం పెంచమని గొడవలో ఉండేవిగా!!! పోనీ ప్రతిపక్షాల సానుభూతిపరుల కోసం ఆ ఉద్యోగాలని లెక్కలోంచి తీసేసినా మిగిలిన ఉద్యోగాల సంఖ్య 38,000 కంటే ఎక్కువే ఉంటుంది. ఆ రకంగా ఉద్యోగాల కల్పనలో కూడా జగన్ బాబుని భయంకరంగా బీటౌట్ చేసాడు.
సంక్షేమం గురించి ఊకదంపుడు ప్రచారం అవసరం లేదు. ఎందుకంటే అందుకున్న వాడికి తెలుస్తుంది… తానేమి అందుకున్నది! “నా వల్ల మీ కుటుంబానికి మేలు జరిగింది అంటేనే ఓటేయండి. లేకపోతే వద్దు” అని ధీమాగా ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డికి ఆ విషయం తెలియక కాదు. అయినప్పటికీ ఎందుకో గత ఐదేళ్లుగా ఎ.పి డిజిటల్ కార్పోరేషన్ గానీ, వైకాపా సోషల్ మీడియా విభాగం కానీ సంస్ఖేమ పథకాలకి కల్పించిన ప్రచారం పరిశ్రమల పెట్టుబడుల విషయాన్ని పట్టించుకోలేదు.
విశాఖలో ఆ మధ్యన పెట్టుబడుల సదస్సు జరిగింది. ఆ వార్త తెలుసు కదా! 13.11 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిలో ఇప్పటి వరకు 2.46 లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి.
అలాగే జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడుల కోసం దావోస్ సదస్సుకి వెళ్లిన సంగతి గుర్తుంది కదా! తత్ఫలితంగా 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిలో ప్రస్తుతానికి 0.86 లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి.
అంటే కేవలం కార్యరూపాం దాల్చిన పెట్టుబడులే లెక్కేసుకున్నా 3.32 లక్షల కోట్ల పెట్టుబడులు 2019-2024 మధ్య వచ్చాయన్నమాట. దాంట్లో కూడా 2023 జూన్ వరకు లెక్క తీస్తే 1 లక్షా 103 కోట్ల రూపాయల పెట్టుబడులు జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ కి వచ్చి చేరినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ఇచ్చిన సమాచారం. ఇదే “డిపార్ట్మెంట్ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటెర్నల్ ట్రేడ్” వారు ఇచ్చిన సమాచారం ప్రకారం 2014-2019 మధ్యన ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన పెట్టుబడుల మొత్తం 32.8 వేల కోట్లు మాత్రమే. అంటే చంద్రబాబు హాయాములో కన్నా జగన్ హయాములో మూడు రెట్లుకు పైగా పెట్టుబడులొచ్చాయన్నది కేంద్ర వర్గాల సమాచారం. ఇదేదో వైకాపా పక్షాన కల్పించి చెబుతున్నది కాదు.
ఇంత పెద్ద వార్తని, ఇంత గొప్ప ఘనతని చాటుకోవడంలో వైకాపా పూర్తిగా విఫలమయ్యింది.
జగన్ అంటే చంద్రబాబు కంటే సంక్షేమంలోనే కాదు పెట్టుబడులు తీసుకురావడంలో కూడా చాలా పెద్దవాడు అనేది కేంద్ర స్థాయి డిపార్ట్మెంట్లు చెబుతున్న సత్యం. మరెందుకు.. జగన్ పాలనలో అభివృద్ధే లేదన్నట్టుగా ప్రతిపక్షాలు అరుస్తుంటే వీళ్ళు బలమైన సమాధనం చెప్పలేదు?
మొన్నటికి మొన్న అంబటి రాంబాబుని ఒక టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేస్తూ రాష్ట్రంలో పరిశ్రమల పెట్టుబడుల గురించి అడిగితే 50 పైచిలుకు కంపెనీల్లో కనీసం నాలుగైదు కూడా చెప్పలేకపోయాడు. ఇదేం చోద్యం? అసలీ పాటికి వైకాపా నాయకులంతా ఈ కంపెనీల పేర్లు, అవి ఉన్న ప్రాంతాలు బట్టీ కొట్టి నాలుక కొసన ఉంచుకోవాలి కదా! అడిగినా అడక్కపోయినా పదే పదే ఈ అభివృద్ధి గురించి చెప్పాలి కదా!
ఇంతకీ జగన్ మోహన్ రెడ్డి హయాములో వచ్చిన ఆ కంపెనీల వివరాలు చూద్దాం…
– ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బి.ఈ.ఎల్, రాడ్ స్టాండ్, టెక్ మహీంద్ర, ఎటిజి టైర్స్, యోకోహామ టైర్స్, ఎక్స్.టి గ్లోబల్, రహేజా ఇనార్బిట్, ఆదిత్య డేటా సెంటర్, మేఫెయిర్, అదిత్య బిర్లా కంపీనీలు వైజాగులో పెట్టుబడులు పెట్టాయి.
– వైజాగ్ సమీపంలోని పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో లారస్ సింథెసిస్, యూజీ స్టెరైల్ అనే రెండు ఫార్మా కంపెనీలు వెలసాయి.
– బ్లూ స్టార్, డైకిన్, పానాసోనిక్, హావెల్స్, అంబర్, కింబర్లీ క్లార్క్, మండలైజ్ ఎక్స్పాన్షన్ కంపెనీలు చిత్తూరు జిల్లా శ్రీసిటీ వద్ద పెట్టుబడులు పెట్టాయి.
– కడపలో డిక్సన్, అపాచీ ఫుట్వేర్, సెంచురీ ప్లై, ఎయిల్ డిక్సన్, ఎలిస్తా, జె.ఎస్.డబ్ల్యూ స్టీల్స్, లిఫియస్ ఫార్మా వెలిసాయి.
– తిరుపతి మరియు సమీప పరిధిలో మునోత్ లీథియం సెల్, ఫాక్స్ లింక్, పి.ఓ.టి.పి.ఎల్, సి.సి.ఎల్, పిప్పర్ మోషన్ కంపెనీలు వచ్చాయి. శ్రీకాళహస్తికి సన్నీ ఓపోటెక్ అనే కంపెనీ వచ్చింది.
– బిలకలగూడూరు (కర్నూల్) వద్ద జె.ఎస్.డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుబడి పెట్టింది.
– నంద్యాల మరియు కర్నూల్ ప్రాంతాలకు మూడు రిన్యూవెబుల్ ఎనెర్జీ ఫ్యాక్టరీలు దిగాయి. అవి గ్రీన్ కో, గ్రీన్ సోలార్ మరియు ఎకోరన్.
– నెల్లూరు ప్రాంతానికి విశ్వసముద్ర, రిలయన్స్ పవర్, విశ్వసముద్ర బయో ఎనెర్జీ, జె.ఎస్.డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ (ఎస్.కోట వద్ద), కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ వారి గ్రీన్ హైడ్రోజెన్, గ్రీన్ అమోనియా యూనిట్ (కృష్ణపట్నం వద్ద) వచ్చాయి.
– గుంటూరులో శ్రీ సిమెంట్, ఐటీసీ గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.
– తూర్పుగోదావరి జిల్లా గుమ్మలదొడ్డి వద్దకి అసాగో, బిబిపురానికి గ్రాసిం ఇండస్ట్రీస్ రాగా, ఏలూరు దగ్గర చింతలపూడికి గాద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ వచ్చింది.
– కడప, విశాఖ, తిరుపతి నగరాల్లో మూడు 7-స్టార్ హొటల్స్ నిర్మించడానికి ఓబెరాయ్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది.
చెప్పడంలో ఇక్కడ కొన్ని మిస్సయ్యుండొచ్చు కూడా! ఇక్కడ చెప్పినవి 50 కి పై చిలుకు కంపెనీలు, పరిశ్రమలు. ఇవన్నీ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన వైజాగ్ సదస్సు, తాను వెళ్లిన దావోస్ సదస్సుల ఫలితం.
అయితే చంద్రబాబు హయాములో సాంక్షన్ చేయబడి కార్యరూపం దాల్చని 6 కంపెనీలు జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అవి దివీస్ ల్యాబ్, టి.సి.ఎల్, సెయింట్ గోబైన్ గ్లాస్ యూనిట్, పిడిలైట్, త్రివేణి రెన్యూవెబుల్స్, హెచ్.సి.ఎల్. ఈ క్రెడిట్ లో సగభాగం చంద్రబాబుకే ఇద్దాం.
అంటే స్థూలంగా చూస్తే 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో కియా, జాకీ కార్యరూపం దాల్చగా మరొక 6 కంపెనీలు మాత్రమే సాంక్షన్ చేయబడి ఊరుకున్నాయి.
అదే జగన్ పాలనలో అయితే 50 కి పై చిలుకు పరిశ్రమలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.
ఎంత తేడా? చీమకి, ఏనుగుకి ఉన్నంత తేడా కనిపించట్లేదు!!
ఇంత జరిగినా పచ్చ మీడియా జర్నలిస్టుల నుంచి, స్వపక్షం వారు కూడా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రికి, స్వపక్షం వారికి ప్రచారం చేసే ఆలోచన రాకపోవడం, ప్రతిపక్షం వారికి చెప్పాల్సిన అవసరం లేకపోవడం.
ఇప్పటికన్నా కళ్లు తెరిచి చూస్తే జగన్ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎన్ని పెట్టుబడులొచ్చాయో, రాష్ట్ర ఆదయం ఎంత పెరిగిందో తెలుస్తుంది. మరి అంత ఆదాయమొస్తుంటే అప్పులెందుకు చేస్తున్నట్టో అని తెదేపా సానుభూతిపరులు తమ అజ్ఞానం చాటుకోవచ్చు.
వాళ్లకీ సమాధానముంది…
జగనైనా, బాబైనా అప్పులు తేవాల్సిందే. అప్పులు తీసుకురాకుండా రాష్ట్ర పాలన, ఏ దేశ పాలన జరగదు. ఆ మాటకొస్తే ముఖ్యమంత్రులు చేసే అప్పు విదేశాలనుంచి కాదు..కేంద్ర ప్రభుత్వం నుంచే…!! అంటే దేశంలోని అంతర్గత విషయమే.
ఇక దేశానికి ఎంత విదేశీ అప్పు ఉందో చెప్పక్కర్లేదు. మోదీ పాలన కాబట్టి భయంతో దేశం అప్పు గురించి పచ్చ మీడియా సౌండ్ చేయలేదు. అమెరికా లాంటి అగ్రదేశానికి కూడా అప్పులున్నాయి. ఆ అగ్రదేశం అప్పుతో ఏ దేశం పోటీ పడలేదు కూడా! అభివృద్ధి చెందితే అప్పెందుకు అని అన్నాడంటే వాడు ఎకనామిక్స్ లో నిరక్షరాశ్యుడని అర్ధం. దేశాల మధ్యన అప్పుని, వ్యక్తుల మధ్య అప్పుతో సమానం చేసేసి చూడకూడదు.
నిజం వేరు, తెలిసిన నిజం వేరు, అబద్ధాన్ని నిజమనుకోవడం వేరు… ఈ మూడు మీడియా వల్లే జరుగుతాయి. రాష్ట్రంలో ఏ వ్యక్తైనా, ఏ పాత్రికేయుడైనా సగటు మనిషే. తాను చూసిన వార్తల్నే విశ్లేషించుకుంటాడు. పనిగట్టుకుని డాక్యుమెంటరీ మేకర్ లాగ, రీసెర్చ్ స్కాలర్ లాగ ఊరూరా తిరిగి ఏం జరుగుతోందో స్వచ్ఛందంగా తెలుసుకునే పని పెట్టుకోరు. ఎందుకంటే పాత్రికేయం ఒక వృత్తి. పై బాసులు చెప్పిన పని చెయ్యాలి. అంతవరకే. ఆ బాసులకి ఆలోచన ఉంటే తప్ప విషయాలు, వాస్తవాలు విపులంగా తెలియవు. అప్పటివరకూ అందరూ అసత్యాలని, అర్ధసత్యాలని పూర్ణసత్యాలుగా నమ్ముతుంటారు.
ఇక్కడ చెప్పేది ఒక్కటే. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎలా లెక్క చూసుకున్నా చంద్రబాబు ఐదేళ్ల పాలన కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయి రాష్ట్రానికి. తేడా అల్లా చెప్పుకోవడం, చెప్పుకోలేకపోవడంలోనే ఉంది!!!
ఇక ఇప్పటికైనా వైకాపా నాయకులు ఈ పరిశ్రమల వివరాలు, లెక్కలు కంఠోపాఠం చేసి ప్రజలకి చెప్పాల్సిన అవసరముంది. కళ్లకు కట్టేలా వీడియోలు చూపాల్సిన పరిస్థితి కూడా ఉంది. లేకపోతే ఇన్నాళ్లూ పచ్చ మీడియా, తెదేపా, జనసేన సారధులు నమ్మించాలని చూసిన అబద్ధమే నిజంగా స్థిరపడిపోయే ప్రమాదముంది. చేయనివి చెప్పడం అన్యాయం. చేసినవి కూడా చెప్పుకోకపోవడం అవివేకం. ఇకనైనా వైకాపా శ్రేణులు కళ్లు తెరిచి రానున్న 20 రోజుల్లో తమ ప్రచారంలో ఈ నిజాలు కూడా చెప్పుకుంటారేమో చూడాలి.
– శ్రీనివాసమూర్తి