జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అంటే ఆ పార్టీలో చాలా మందికి అసలు గిట్టదు. నాదెండ్లను జనసేనాని పవన్‌కల్యాణ్ నమ్ముకోవడంపై పార్టీలో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది.
కేవలం పవన్‌కు నాదెండ్ల దగ్గరగా ఉన్నారనే కారణంగానే ఆ పార్టీకి చెందిన చిన్నోగొప్పో నాయకులు కూడా దూరమయ్యారనేది వాస్తవం. జనసేనలో పవన్‌కల్యాణ్ తర్వాత వినిపించే ప్రధాన పేరు నాదెండ్ల.
ప్రస్తుతం అసలు విషయానికి వస్తే నాదెండ్లను ఓ పథకం ప్రకారం పవన్‌కల్యాణ్ బకరా చేస్తున్నారనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. కీలక విషయాలపై జనసేన నుంచి వెలువడే రాజకీయ ప్రకటనలే ఇందుకు నిదర్శనమని వారి అభిప్రాయాలు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజావ్యతిరేక నిర్ణయాలపై మాత్రం జనసేనాని పవన్‌కల్యాణ్ పేరుతో ప్రకటనలు వెలువడుతాయని, అదే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టాల్సి వస్తే మాత్రం నాదెండ్ల పేరుతో వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని తప్పు పట్టాల్సి వచ్చే సరికి పవన్‌ను కాదని నాదెండ్లను ఆ పార్టీ ముందుకు తోయడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. నాదెండ్ల పేరుతో వెల్లడైన ఆ ప్రకటనలో ఏమున్నదంటే…
“తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరం. వేల ఎకరాల్లో విస్తరించి 17 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు సుమారు లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న స్టీలు ప్లాంటు ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లడం జనసేన అభీష్టానికి వ్యతిరేకం.
ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరించాలని ప్రధాని మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను మా పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కోరుతున్నారు” అని నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాను పవన్ కోరుతున్నారని నాదెండ్ల చెప్పడం ఏంటి? ఆ మాటేదో నేరుగా పవన్ పేరుతోనే ప్రకటన ఇవ్వొచ్చు కదా? ఇదే ఏపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాత్రం విమర్శలు చేయడానికి పవన్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
లక్షలాది మందికి ఉపాధి, ఆంధ్రుల సెంటిమెంట్‌కు సంబంధించిన అతి పెద్ద ఉక్కు పరిశ్రమపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు పవన్ ఎంతగా భయపడుతున్నారో చెప్పేందుకు నాదెండ్ల పేరుతో ప్రకటన ఇవ్వడమే నిదర్శనమే అభిప్రాయాలు బలపడుతున్నాయి.