ముందుగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులను టార్గెట్ చేసుకున్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియా వర్గాలు కూడా ధ్రువీకరిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు కీలకనేతలు భారతీయజనతా పార్టీలోకి వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని స్వయంగా తెలుగుదేశం గెజిట్ లాంటి పత్రికలే చెబుతూ ఉన్నాయి.
నలుగురు ఐదుగురు ముఖ్యనేతలు ఇప్పుడు బీజేపీలోకి చేరే అవకాశాలున్నాయని టీడీపీ అనుకూల మీడియానే చెబుతూనే ఉంది. కుల మీడియానే ఇలా ధ్రువీకరిస్తూ ఉండటంతో.. తెలుగుదేశం నుంచి ఎంపీలు ఫిరాయించడం, బీజేపీలోకి చేరడం ఖరారే అని నిర్ధారణ అవుతూ ఉంది.
ఆ జాబితాలో వినిపిస్తున్న పేర్లలో సుజనా చౌదరి, సీఎం రమేశ్ లు ముందున్నారు! వీరు మాత్రమే గాక టీజీ వెంకటేష్, గరికపాటి వంటి చంద్రబాబు భక్తుడు, రామలక్ష్మి.. వీళ్లంతా జంపింగే అని సమాచారం. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి మిగిలేది సింగిల్ సభ్యుడే అని అంటున్నారు. కొన్నినెలల కిందట రాజ్యసభకు టీడీపీ తరఫున నామినేట్ అయిన కనకమేడల రవీంద్రకుమార్ మాత్రమే మిగలవచ్చు.. మిగిలిన అంతా జంపింగే అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆయన అయినా మిగులుతాడా? అనేది సందేహమే అని పరిశీలకులు అంటున్నారు.
రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి బలం తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో వీరిని చేర్చుకుంటారట. అయితే చేరికలు అంటూ మొదలయ్యాకా అంతటితో ఆగకపోవచ్చని స్పష్టం అవుతోంది. లోక్ సభ సభ్యులు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఓడిపోయిన నేతలనూ బీజేపీలోకి చేరడానికి రెడీ కావొచ్చు.