తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. కొత్త పేర్లు ప్రతిరోజూ తెరమీదకు వస్తున్నాయి. పోలీసులు ఈ విషయంలో చాలా చురుగ్గా దర్యాప్తు సాగిస్తున్నారు. ధ్వంసంచేసిన హార్డ్ డిస్కులను ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు అండ్ కో తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేస్తే, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పోలీసులు, మూసీ బ్రిడ్జి కిందనుంచి వాటిని వెతికి మరీ తీసుకువచ్చారు.
ఇంకా ముందు ముందు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి రానున్నాయి. అయితే.. ఇప్పుడు ట్యాపింగ్ ను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కల్వకుంట్ల తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమేనని ఆరోపిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి.. కేటీఆర్ ఎంత ఎక్కువగా మాట్లాడితే.. అంతగా వారి పార్టీ అందులో కూరుకుపోతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది.. గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఏమాత్రం తప్పించుకోలేనట్టుగా రోజురోజుకూ తయారవుతోంది. ప్రణీత్ రావుతో మొదలైన ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా పలువురు పోలీసులు ఉన్నాధికారులు ఇరుక్కుపోయారు. వారు చెప్పిన విషయాలను బట్టి పోలీసులు వివరాలను కూడా చాలా పక్కాగా సేకరిస్తున్నారు. అయితే అధికారులు విచారణలో కొందరు భారాస నాయకుల పేర్లను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తోంది.
ట్యాపింగ్ ద్వారా సేకరించిన ఫోన్ కాల్స్ సమాచారం మొత్తం ఇద్దరు పెద్ద నేతలకు చేరవేసేవారమని వారు చెప్పినట్టుగా బయటకు వస్తోంది. అప్పటి డీజీపీ ని కూడా కేసులో చేర్చాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. బిజెపి నాయకులైతే కేసీఆర్ ను ట్యాపింగ్ కేసులో మొదటి నిందితుడిగా చేర్చాలని అంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ట్యాపింగ్ గురించి కేటీఆర్ చెబుతున్న మాటలు చిత్రంగా ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయిందని, రైతులకు రుణమాఫీ చేయలేకపోయిందని, అందుకే ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రతిరోజూ లీకులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో బయటకు వస్తున్న వివరాలు అన్నీ రేవంత్ రెడ్డి ఇస్తున్న లీకులే తప్ప వాస్తవాలు కాదని నిందిస్తున్నారు.
కాంగ్రెసు పార్టీలో కీలక నాయకులు ఎవ్వరూ ట్యాపింగ్ గురించి ఇంకా పెదవి విప్పడం ప్రారంభం కాలేదు. పూర్తిగా గులాబీనేతల పేర్లు ఆధారాల సహా బయటకువచ్చిన తర్వాత మాత్రమే పెదవివిప్పాలని వారు యోచిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడేదో ఎన్నికల అవసరం గనుక.. కాంగ్రెసును నిందించడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తానే వాడుకుంటూ కేటీఆర్ రెచ్చిపోతుండవచ్చు గానీ.. ముందుముందు పూర్తిగా చిక్కుల్లో పడక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.