కేంద్రం బీఆర్​ఎస్​ను రాజకీయ పార్టీగా గుర్తించడం లేదా?

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కదా. కాని దానికి ఆహ్వానం అందలేదు. అంటే కేంద్రం బీఆర్​ఎస్​ ను రాజకీయ పార్టీగా గుర్తించడం లేదనుకోవాలా?

దేశంలోగాని, రాష్ట్రంలోగాని క్లిష్ట పరిస్థితి, విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి? ఏం చేయాలి? అనేది చర్చించడానికి ప్రభుత్వాలు అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రతిపక్షాలు కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్​ చేస్తుంటాయి. అయితే నిర్వహించడం, నిర్వహించకపోవడం ప్రభుత్వం ఇష్టం. ఏదిఏమైనా సమస్య తీవ్రతను బట్టి ఉంటుంది.

తాజాగా కశ్మీర్​లో పర్యాటకులపై జరిగిన కిరాతక ఉగ్రదాడి గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అఖిలపక్ష సమావేశమంటే గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను పిలవాలి. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఆహ్వానించాలి. అప్పుడే కదా దాన్ని అఖిలపక్ష సమావేశమని అంటారు. రాజకీయ కారణాలో, మరో విధమైన కారణాలతోనో కొన్ని పార్టీలను పిలవకుండా ఉండకూడదు. కీలకమైన అంశంపై చర్చించేటప్పుడు ద్వేషాలు, కోపతాపాలు పనికిరావు. దేశ, ప్రజాప్రయోజనాలే ముఖ్యంగా పరగణించాలి. కాని కశ్మీర్​లో ఉగ్రదాడిపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కేంద్రం బీఆర్​ఎస్​ ను ఆహ్వానించలేదు.

మామూలుగానే బీజేపీ అన్నా, ప్రధాని మోదీ అన్నా బీఆర్​ఎస్​ మండిపడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై బీఆర్​ఎస్​ నాయకులు రచ్చ చేయడంలేదుగాని ఎందుకు ఆహ్వానించలేదన్న ప్రశ్న తలెత్తింది. అసలు అఖిలపక్ష సమావేశానికి రాజకీయ పార్టీలను ఏ ప్రాతిపదికన ఆహ్వానిస్తారు? పార్లమెంటులో ఇంతమంది సభ్యులుండాలని రూలేమైనా ఉందా? పార్లమెంటులో ఒక్క ఎంపీ ఉన్న పార్టీలను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఒకే ఎంపీ ఉన్న ఎంఐఎం పార్టీని ఆహ్వానించారు.

నిజానికి బీఆర్​ఎస్​ కు లోక్‌సభలో సభ్యులు లేరు. రాజ్యసభలో నలుగురు ఎంపీలున్నారు. అంటే ఏదో ఒక సభలో ఎంపీ లైతే ఉన్నారు కదా. అలాంటప్పుడు ఆ పార్టీని ఆహ్వానించవచ్చు కదా. బీఆర్​ఎస్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయి ఉండొచ్చు. లోకసభ ఎన్నికల్లో ఒక్క సీటూ సాధించకపోయి ఉండొచ్చు. కాని అది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీయే కదా.

తెలంగాణలో పెద్ద రాజకీయ పార్టీయే కదా. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కదా. కాని దానికి ఆహ్వానం అందలేదు. అంటే కేంద్రం బీఆర్​ఎస్​ ను రాజకీయ పార్టీగా గుర్తించడం లేదనుకోవాలా? అయితే అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించకపోయినా ఉగ్రవాదం నిర్మూలనకు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని బీఆర్​ఎస్​ ప్రకటించింది. ఈ క్లిష్ట పరిస్థితిలో తాము రాజకీయాలు చేయబోమని చెప్పింది.

ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహణపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ మండిపడ్డాడు. కొన్ని రాజకీయపార్టీలను ఆహ్వానించలేదన్నాడు. ఇది బీజేపీ అంతర్గత సమావేశం కాదని ఘాటుగా విమర్శించాడు. పార్టీ సైజుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఎంపీకి ఈ సమస్యపై మాట్లాడే హక్కు ఉందన్నాడు. దీన్నిబట్టి చూస్తే లోక్‌సభలో బీఆర్​ఎస్​ కు సభ్యులు లేరు కాబట్టి పిలవలేదేమో…!

7 Replies to “కేంద్రం బీఆర్​ఎస్​ను రాజకీయ పార్టీగా గుర్తించడం లేదా?”

  1. దయచేసి 11 జగన్ రెడ్డి ని పిలవకండి .దేశం మొత్తం బాధ పడుతుంటే వీడు మాత్రం ఢిల్లీ వెళ్లి  వెకిలి నవ్వులు తో పాటు కూటమి తన బోరుగడ్డ అనిల్ జైల్ లో వేసింది గురుంచి చెపుతాడు, కూటమి కంటే నేనే ఎక్కువ కంపెనీ లు తెచ్చా అని చెపుతాడు, కడప లో చికెన్, ఫిష్, ప్రాన్ షాప్స్ పెట్టిచా అని చెపుతాడు.

Comments are closed.