తెలంగాణలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్‌ను విమర్శిస్తూనే ఉన్నాడు. తన పదవి ముగిసిన తరువాత గుత్తా బీఆర్ఎస్‌లో ఉండదలచుకోలేదని అర్థమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఉత్కంఠభరితం చేస్తున్న ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై గుత్తా కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్ అధికారంలో ఉండగా ఎస్ఎల్బీసీని పట్టించుకోకపోవడంవల్లనే ఇప్పుడు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధలో ఇరవై శాతం ఎస్ఎల్బీసీపై పెట్టినా అది పూర్తయ్యేదని అన్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అడ్వాన్స్లు ఎస్ఎల్బీసీకి ఇస్తే ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. టన్నెల్ ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలని, రాజకీయం చేయకూడదని అన్నారు.
గతంలో శ్రీశైలం పవర్ హౌజ్లో ప్రమాదం జరగలేదా? కాళేశ్వరంలో పంప్‌హౌజ్‌లు మునిగి జనాలు చనిపోలేదా? అని గుత్తా ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ఎందుకు అలస్యం అయిందనేది హరీష్ రావుకు తెలుసునని, ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని గుత్తా అన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ప్రమాదం జరిగిన రెండు గంటల్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నారని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా టన్నెల్ పనులు ముందుకు పోవలిసిందేనన్నారు.
ప్రమాదాలు జరగడం సహజమని, ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాజెక్టులను పక్కకు పెట్టరన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదకరమైన ప్రాజెక్టు కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టేసిందని గుత్తా అన్నారు.
Correct ga chepparu