కూల్చ‌వేత‌ల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

కొత్త‌గా తీసుకున్న అనుమ‌తుల్ని ప‌రిశీలిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. పేద‌ల జోలికి ఎప్పుడూ వెళ్లే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని ఆయ‌న అన్నారు.

హైద‌రాబాద్‌లో హైడ్రా పేరు వింటే వణికిపోయే ప‌రిస్థితి. ఎప్పుడు, ఏ బిల్డింగ్ కూల్చివేస్తారో అని నిద్ర‌లేని రాత్రులు గడుపుతున్న వాళ్లెంద‌రో ఉన్నారు. అందుకే హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. కూల్చివేత‌ల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పే ప్ర‌తి మాట‌ను తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసులు జాగ్ర‌త్త‌గా వింటూ వ‌స్తున్నారు.

తాజాగా అక్ర‌మ నిర్మాణాలు, కూల్చివేత‌ల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ కీల‌క కామెంట్స్ చేశారు. ఈ ఏడాది జూలై నెల త‌ర్వాత చేప‌ట్టిన అక్ర‌మ నిర్మాణాల్ని కూల్చివేస్తామ‌ని రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. హైడ్రా ఏర్ప‌డ‌క ముందు ఉన్న నిర్మాణాలపైకి వెళ్లడం లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

అలాగే ప్ర‌భుత్వం నుంచి గ‌తంలో అనుమ‌తులు తీసుకుని ఇపుడు నిర్మిస్తున్న వాటి వైపు క‌న్నెత్తి చూడ‌మ‌ని ఆయ‌న చెప్పారు. కొత్త‌గా తీసుకున్న అనుమ‌తుల్ని ప‌రిశీలిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. పేద‌ల జోలికి ఎప్పుడూ వెళ్లే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని ఆయ‌న అన్నారు. పేద‌ల ఇళ్ల‌ను కూలుస్తామ‌నే ప్ర‌చారాన్ని ఆయ‌న కొట్టి పారేశారు.

చెరువుల్ని ప‌రిర‌క్షించాల‌నే ప్ర‌భుత్వ ఆశ‌యానికి అనుగుణంగా తాము ప‌ని చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు. హైద‌రాబాద్‌లో ఆక్ర‌మ‌ణ‌ల కార‌ణంగా చెరువులు క్ర‌మంగా క‌న‌మ‌రుగు అవుతున్నాయ‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ భావించ‌డం, వాటిని ప‌రిర‌క్షించే క్ర‌మంలో హైడ్రాను తీసుకొచ్చారు. తాజాగా హైడ్రా క‌మిష‌న‌ర్ ఇచ్చిన క్లారిటీ చాలా మందికి ఊర‌ట ఇచ్చేలా వుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

4 Replies to “కూల్చ‌వేత‌ల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌”

Comments are closed.