కాంగ్రెస్ పార్టీకి మోదీ బద్ధ శత్రువు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ బద్ధ శత్రువు. మోదీ ఆలోచనలను, నిర్ణయాలను వ్యతిరేకించడమే కాంగ్రెస్ విధానం. ఇదే తరహాలో మోదీ కూడా వ్యవహరిస్తుంటారు. వాళ్ల విమర్శల్లో కొన్నిటికి లాజిక్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు.
తెలంగాణ విషయానికొస్తే, మోదీ విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మాదిరిగానే వ్యవహరిస్తున్నాడని అనిపిస్తోంది. మోదీని బద్ధ శత్రువుగా చూస్తున్నాడు. మోదీతో పాటు అదానీ పట్ల కూడా ఆయన విమర్శాత్మకంగా వ్యవహరిస్తున్నారు. “పెద్ద అవినీతిపరుడైన అదానీని మోదీ రక్షిస్తున్నాడు” అని రేవంత్ రెడ్డి అంటున్నారు.
టీపీసీసీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రాజ్ భవన్‌కి వెళ్లారు. వారి ర్యాలీని పోలీసులు ఆపేశారు. రాజ్ భవన్‌లోకి ప్రవేశానికి అనుమతి ఇవ్వలేదు. అదానీ అవినీతిని నిరసించే హక్కు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు ఉందని తాము కాదనలేము.
కానీ, బాధ్యత గల సీఎం మంత్రులను తీసుకుని రాజ్ భవన్‌కు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనేది ప్రశ్న. ఇప్పుడు అంత అవసరం ఎందుకొచ్చింది? నిరసన తెలియజేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా. సహజంగానే బీజేపీ నాయకులు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు.
ఈ సందర్భంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సరైన ప్రశ్న అడిగారు. “అదానీని అవినీతిపరుడని అంటున్న రేవంత్ రెడ్డి, స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల సాయం ఎందుకు అడిగారు? ఆయన అవినీతిపరుడని తెలుసు కదా?” అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఆ తరువాత ఆ వంద కోట్లు వెనక్కి ఇచ్చేశాడనుకోండి. అది వేరే విషయం. కానీ, అదానీ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలడా? ఆ సాయాన్ని ఎలా సమర్థించుకుంటారు?
Telangana government is surviving only because of the blessings from Kootami. Over chesthe ratriki ki ratri Congress change ayipoyi vere government ravatam guarantee.