ఏ పార్టీలో లేని గ్రూపు తగాదాలు కాంగ్రెస్ లో ఉంటాయని, వర్గ రాజకీయాలు ఎక్కువని అంటుంటారు. అన్ని పార్టీల్లో గ్రూపు రాజకీయాలు ఉన్నప్పటికీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వార్తల్లో హైలైట్ అవుతుంటుంది. ఇతర పార్టీల్లో కంటే కాంగ్రెస్ లో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి నాయకులు తమ అసమ్మతిని బహిరంగంగానే బయటపెడుతుంటారు. మీడియాకు ఎక్కుతుంటారు. దీంతో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల పార్టీ అనే పేరుపడింది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్ష పదవి కోసం, సీఎం పదవి కోసం నాయకుల మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఢిల్లీ పెద్దల దగ్గర పంచాయతీ జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో సాధారణమే.
అసెంబ్లీ ఎన్నికలు వస్తే పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదుగానీ ఎన్నికలు జరుగుతున్నప్పుడే పార్టీ గెలిస్తే సీఎం ఎవరు అనే చర్చ జరుగుతూ ఉంటుంది. సీఎం పదవి నాకంటే నాకు అని పోటీ పడుతుంటారు. అధిష్టానం దగ్గర జోరుగా పైరవీలు చేస్తుంటారు. ఒకళ్ళను ఒకళ్ళు తిట్టుకుంటారు. సీనియారిటీ గురించి ఏకరువు పెట్టుకుంటారు.
ఇలాంటి ప్రహసనాలు కాంగ్రెస్ కు కొత్తకాదు. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ప్రజలు కాంగ్రెసును గెలిపించారు. అనేకమంది పోటీని తట్టుకొని అధిష్టానం ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. వాస్తవానికి రేవంత్ పార్టీలో చాలా జూనియర్. మిగతావాళ్ళతో కంపార్ చేస్తే ఈయన బచ్చా అని చెప్పుకోవచ్చు.
కానీ పదేళ్లలో ఎవరూ చేయలేని పని (అంటే పార్టీని అధికారంలోకి తేవడమన్న మాట) రేవంత్ చేశాడని మంచి అభిప్రాయం హై కమాండ్ కు కలిగింది. అతని టాలెంట్ ను మెచ్చుకుంది. సీఎం పదవి కట్టబెట్టింది. ఈ పదవి కోసం చాలామంది పోటీబడ్డారు. అలిగారు. గింజుకున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నదనే సంకేతాలు రాగానే సీనియర్లంతా సీఎం పదవిపై కర్చీఫ్ వేసేశారు. రేవంత్ రెడ్డిని ఎవరూ ఒప్పుకోలేదు.
రేవంత్ కాంగ్రెస్ లో చేరినప్పుడు కూడా ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు కూడా సీనియర్ల చీత్కారాలను ఎదుర్కొన్నాడు. ఒక దశలో ఆయన్ని గాంధీ భవనంలోకి రానివ్వని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన కొంతకాలం గాంధీ భవన్ కు వెళ్ళలేదు. అప్పట్లో ఆయన పార్టీ బలోపేతం కోసం పాదయాత్ర చేస్తానంటే పడనివ్వలేదు. రేవంత్ రెడ్డి నిర్వహించిన కొన్ని బహిరంగ సభలకు కొందరు నాయకులు సహకరించలేదు. పీసీసీ అధ్యక్ష పదవి డబ్బులిచ్చి కొనుక్కున్నాడని కొందరు ఆరోపించారు. ఇలా… చాలా అడ్డంకులు కలిగించారు.
అన్నింటిని దాటుకొని చివరకు సీఎం అయ్యాడు. అసమ్మతి నేతల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నాడు. ఎన్నికల వరకు ఆయన ఎంపీ అనే సంగతి తెలిసిందే కదా. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ ను నానా తిట్లు తిట్టి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేశాడు. అప్పుడు వెంకట్ రెడ్డి పార్టీకి, రేవంత్ కు సహాయ నిరాకరణ చేశాడు.
ప్రచారం చేయకుండా విదేశాలకు వెళ్ళిపోయాడు. తమ్ముడిని గెలిపించాలని స్టేట్మెంట్లు ఇచ్చాడు. పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులూ ఇచ్చింది. ఇలాంటి వెంకట్ రెడ్డి, సీఎం రేసులో ఉన్నానని చెప్పుకున్న నాయకుడు ఇప్పుడు మరో పదేళ్ళపాటు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటాడని అంటున్నాడు. పార్టీలో ఏక్ నాథ్ షిండేలు (తిరుగుబాటుదారులు) లేరని చెబుతున్నాడు.
పార్టీలో గ్రూపు తగాదాలు లేవంటున్నాడు. ఇలా చెబుతున్నాడంటే ఈ అసమ్మతి నేత మారు మనసు పొందాడని అనుకోవాలా? లేదా ఏదైనా అవకాశం వస్తే దాన్ని యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాడా? కాంగ్రెస్ లో షిండేలు ఉన్నారని అపోజిషన్ లీడర్లు పదేపదే అంటున్నారు. ఆ లిస్టులో వెంకట్ రెడ్డి కూడా ఉంటాడా?