వంద ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించకపోతే జైలుకే..!

కంచ గచ్చిబౌలి భూముల కొరివితో తల గోక్కున్న రేవంత్​ రెడ్డి ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు తలంటు పోసింది.

కంచ గచ్చిబౌలి భూముల కొరివితో తల గోక్కున్న రేవంత్​ రెడ్డి ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు తలంటు పోసింది. హెచ్​సీయూకు సంబంధించిన కంచ గచ్చి బౌలి భూముల కేసులో విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రభుత్వానికి తల బొప్పి కట్టేలా అక్షింతలు వేసింది. కంచ గచ్చి బౌలి భూముల్లో చెట్లు కొట్టేయడంపై సుప్రీం కోర్టు సీరియస్​ అయింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ వాదనలను విన్న న్యాయస్థానం భూములను పరిశీలించిన ఎంపవర్డ్​ కమిటీ సమర్పించిన నివేదికను అధ్యయనం చేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇష్టానుసారం చెట్లను నరకడమే కాకుండా పైగా దాన్ని సమర్థించుకోవడం ఏమిటని ప్రభుత్వంపై మండిపడింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వంద ఎకరాల్లో నరికిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలంది.

ఒకవేళ చెట్ల పునరుద్ధరణను ప్రభుత్వ అధికారులు వ్యతిరేకిస్తే.. ఆ భూముల్లోనే టెంపరరీ జైలును కట్టి వారిని అందులోకి పంపుతామని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమ నోటీసులో లేకుండా వివాదాస్పద భూమిలో ఒక్క చెట్టు కూడా నరకొద్దని.. తాము తీర్పు ఇచ్చాక కూడా ఆ ప్రాంతంలో ఇంకా బుల్డోజర్లు ఎందుకున్నాయంటూ కోర్టు ఆక్షేపించింది. ఏఐతో రూపొందించిన ఫేక్ వీడియోలతో విపక్షాలు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేశాయన్న ప్రభుత్వ న్యాయవాది వాదనలను కోర్టు అంగీకరించలేదు.

చెట్ల నరికివేత విషయంలో రాష్ట్ర సీఎస్‌తో సహా సంబంధిత అధికారులందరూ జైలుకు వెళ్తారని.. ఒకవేళ వారిని కాపాడాలనుకుంటే విధ్వంసం చేసిన 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ… కోర్టు ఆదేశాల మేరకు ప్రతిదీ నిలిపివేశామని చెప్పారు. చెట్లను నరికివేయడానికి ప్రభుత్వానికి సంబంధిత అధికారుల నుంచి అనుమతి ఉందా? అని కోర్టు ప్రశ్నించింది.

అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్‌ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జడ్జిలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. 1996 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు.

అమికస్ క్యూరీగా హాజరైన సీనియర్ న్యాయవాది కె పరమేశ్వర్… వాదనలు వినిపిస్తూ భూమిని ప్రైవేట్ పార్టీకి తనఖా పెట్టారని తెలిపారు. ‘‘మొత్తం భూమిని ఇప్పుడు ఒక ప్రైవేట్ పార్టీకి తనఖా పెట్టారు. ప్రధాన కార్యదర్శికి కూడా ఆ విషయం తెలుసు’ అన్నారు. అయితే ఈ కేసులో తన దృష్టి చెట్ల నరికివేత, అటవీ రక్షణపైనే ఉందని… తనఖాపై కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘‘మేము తనఖా, అన్నింటిపై దృష్టి పెట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎన్ని చెట్లు నరికారనేది మాత్రమే మేము పరిశీలిస్తున్నాము.

వందల ఎకరాల అడవులు నాశనం అవుతున్నాయన్న విషయం మాత్రమే మేము పరిశీలిస్తున్నాము. మీరు ఏదైనా చేయాలనుకుంటే అందుకు సరైన అనుమతులు తీసుకొని ఉండాలి’’ అని పేర్కొంది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. అయితే అప్పటివరకు స్టేటస్ కో కొనసాగించాలని, ప్రస్తుతానికి ఒక్క చెట్టును కూడా నరికివేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. మొత్తం మీద రేవంత్‌​ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద చిక్కే వచ్చి పడింది.

10 Replies to “వంద ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించకపోతే జైలుకే..!”

  1. మరి కొండను గొరిగేస్తున్నప్పుడు వీళ్లంతా ఏమి చేస్తున్నట్టో?

    1. Already వున్న పాత buildings ను తొలగించి కొత్తగా భవనాలు కట్టారు. ఇంకా ఎక్కువ greenary కోసం అనేక మొక్కలు నాటారు. Both are not Same😀😀

  2. ప్రకృతి విధ్వంసం తీవ్రమైన ఆవేదన కలిగిస్తోంది. అభివృద్ధి పేరుతో నేరుగా నరకానికి రహదారి వేస్తున్నట్టుంది. భూటాన్ లాంటి దేశం ప్రకృతి ఒడిలో హాయిగా జీవిస్తోంది. కాలుష్య కోరల్లో మన సనాతన దేశం .

  3. తిక్క కుదిరింది శిష్యుడు కు. ఇలాగే మూడు పంటలు పండే భూముల ను ఇంకా 40k ఎకరాలు కావాలనంట గురువు గారికి

Comments are closed.