ఆ సంస్థ కాంగ్రెసుకు శత్రువు.. కాని దానిలా పనిచేయాలట!

కాంగ్రెసు పనితీరు పట్ల ఆమె చాలా అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె చేస్తున్న సమీక్షల్లో అర్థమవుతోంది.

ఆర్​ఎస్​ఎస్, బీజేపీ.. ఈ రెండూ కాంగ్రెసుకు బద్ధ శత్రువులు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కేవలం కాంగ్రెసుకే కాదు. దేశంలోని చాలా పార్టీలకు శత్రువులే కదా. ఆ పార్టీల సంగతి ఇక్కడ అనవసరం. బీజేపీని కూడా కాస్త పక్కకు పెడదాం. ఆర్​ఎస్​ఎస్​(రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​) స్వభావం ఎటువంటిదనే చర్చ కూడా అనవసరం. మరి ఆర్​ఎస్​ఎస్​ గురించి ఇప్పుడు చెప్పుకోవలసిన అవసరం ఏముందని అంటారా?

అవసరం కలిగింది తెలంగాణ కాంగ్రెసు ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్‌కు. కాంగ్రెసు పనితీరు పట్ల ఆమె చాలా అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె చేస్తున్న సమీక్షల్లో అర్థమవుతోంది. ప్రస్తుతం ఆమె పార్లమెంటు నియోజకవర్గాలవారీగా సమీక్షలు చేస్తోంది. కాని చాలా అసంతృప్తి వెలిబుచ్చుతోంది. పార్టీ పనితీరు సరిగా లేదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. పార్టీ పనితీరు ఎలా ఉండాలో ఆర్​ఎస్​ఎస్​ను చూసి నేర్చుకోవాలని అన్నది. ఆ సంస్థ సభ్యుల తరహాలో పార్టీ నాయకులు పనిచేయాలని చెప్పింది. అంటే పనితీరు ఎలా ఉండాలో శత్రువునే ఉదాహరణగా చూపించింది.

‘ఆర్​ఎస్​ఎస్​సభ్యలు ప్రతి మనిషిని కలుస్తుంటారు. అదే మాదిరిగా కాంగ్రెసు నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలి’ అని మీనాక్షి నటరాజన్​ క్లాసు తీసుకుంది. మీడియానో, సోషల్‌ మీడియానో నమ్ముకుంటే చాలదని చెప్పింది. జనంతో మమేకమవుతేనే పార్టీ ప్రజల్లోకి వెళుతుందని చెప్పింది. వారితో ముఖాముఖి మాట్లాడితేనే వారు ప్రభుత్వానికి దగ్గరవుతారని అన్నది. అంటే కాంగ్రెసు నాయకులు జనంతో కలవడంలేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఆర్​ఎస్​ఎస్​ స్వభావం, అభిప్రాయాలు ఎలాగైనా ఉండనివ్వండి. కాని ఆ సంస్థ సభ్యులు మాత్రం చాలా కమిట్​మెంట్​తో పనిచేస్తారు. తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. మీనాక్షి చెప్పినట్లుగా ప్రతి మనిషిని కలుసుకుంటారు. అందుకే ఆమె ఆ సంస్థను ఉదాహరణగా చూపించింది. ఆర్​ఎస్​ఎస్​ సంస్థ కాంగ్రెసుకు శత్రువే. కాని దాంట్లో ఉన్న మంచి లక్షణాన్ని మీనాక్షి గుర్తించింది. మరి ఆమె చెప్పింది కాంగ్రెసు నాయకులకు ఎంతవరకు ఎక్కుతుందో చెప్పలేం.

ఇక ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారని నాయకులను ప్రశ్నించింది. అంటే ప్రభుత్వ పథకాలపై ప్రచారం సరిగా జరగడంలేదన్నది ఆమె అభిప్రాయం. నాయకులు ప్రభుత్వ పథకాల ప్రచారంపై దృష్టి పెట్టడంలేదని అర్థమవుతోంది. సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యత లేదని కొందరు ఆమెకు ఫిర్యాదు చేశారు. ఇలాగైతే పార్టీకి కష్టాలు వస్తాయని చెప్పారు.

తమకు పదవులు లేకుండా ప్రజల్లోకి ఎలా పోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వ పదవులో, పార్టీ పదవులో ఉండాలని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్​ గౌడ్​ పథకాల ప్రచారంలో వెనకబడ్డామని మీనాక్షి సమక్షంలో ఒప్పుకున్నాడు. మొత్తం మీద మీనాక్షికి మాత్రం పార్టీ పనితీరు అంత సంతృప్తికరంగా లేదనే విషయం స్పష్టమైంది.

2 Replies to “ఆ సంస్థ కాంగ్రెసుకు శత్రువు.. కాని దానిలా పనిచేయాలట!”

  1. RSS is not only am organisation it’s an emotion& ideology so they worked voluntarily it’s indirectly benfitted to bjp. How she expected same commitment from family based power hungry party????

Comments are closed.