జీవన్ రెడ్డి పాఠం వద్దు.. వలసలే ముద్దు!

కాంగ్రెస్ పార్టీ పాఠం నేర్చుకునే ఉద్దేశంతో ఎంత మాత్రమూ ఉన్నట్టు లేదు. భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి తమ పార్టీలో చేర్చుకుంటున్న నాయకుల కారణంగా.. స్థానికంగా నియోజకవర్గాల్లో గందరగోళం ఏర్పడితే.. ఆ…

కాంగ్రెస్ పార్టీ పాఠం నేర్చుకునే ఉద్దేశంతో ఎంత మాత్రమూ ఉన్నట్టు లేదు. భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి తమ పార్టీలో చేర్చుకుంటున్న నాయకుల కారణంగా.. స్థానికంగా నియోజకవర్గాల్లో గందరగోళం ఏర్పడితే.. ఆ పరిస్థితుల్ని సర్దుబాటు చేసుకోవడమే చాలా కష్టం. అలాంటిది కాంగ్రెసులో శృతిమించి ఏకంగా సొంత పార్టీ కార్యకర్తల్ని హత్య చేసే వరకు పరిణామాలు విషమిస్తూ ఉండగా.. కాంగ్రెసు పార్టీ పాఠం నేర్చుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలకు అర్థం కావడం లేదు.

పార్టీకి పెద్దదిక్కులాంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య కేసు కాంగ్రెసు పార్టీని ఇంకా కుదిపేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న పార్టీ గనుక.. ఎవ్వరూ పెద్దగా బయటపడడం లేదు గానీ.. నిజానికి పార్టీలో రెండు చీలికవర్గాలు ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. జీవన్ రెడ్డి ఆవేదనకు మద్దతిస్తున్న నాయకులు.. దానిని పట్టించుకోని నాయకులు అన్నట్టుగా పరిస్థితి తయారవుతోంది.

జీవన్ రెడ్డికి మద్దతు ఇస్తున్న వారు పెద్దసంఖ్యలోనే ఉంటున్నారు గానీ.. వారిలో కొందరు అతివాదులు.. అసలు ఫిరాయింపులకు ఫుల్ స్టాపులు పెట్టాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. వలస నేతల వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా అయిదేళ్లు కొనసాగగల మెజారిటీతోనే ఉన్నప్పటికీ.. భారాసను మరింత బలహీన పరిచే వ్యూహంతో.. ఆ పార్టీనుంచి నాయకుల వలసలను ఆశిస్తూ ఉండడం విశేషం. ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలను కలిసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తమ పార్టీలోకి భారాస నుంచి వలసలు ఉంటాయని చెబుతున్నారు. కేటీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలగుతున్న నాయకులు అనేకమంది తమతో టచ్ లో ఉన్నారని, వారంతా త్వరలోనే కాంగ్రెసు తీర్థం పుచ్చుకుంటారని కూడా ఆయన చెబుతున్నారు.

ఇదంతా కేటీఆర్ కోటరీలో వ్యక్తుల మీద భారాస అధిష్ఠానానికి అనుమానం కలిగించే వక్ర ప్రయత్నమా? లేదా, నిజంగానే కేటీఆర్ సన్నిహితులు వలసలు రాబోతున్నారా? అనేది ప్రశ్న. ఇంకా వలసలకోసం ఎదురుచూస్తుండడం అనేది కాంగ్రెసు పార్టీ అత్యాశ అవుతుందేమోనని.. అది పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా కష్టపడుతున్న కార్యకర్తలను మరింత అయోమయానికి గందరగోళానికి గురిచేస్తుందని పలువురు భావిస్తున్నారు.

5 Replies to “జీవన్ రెడ్డి పాఠం వద్దు.. వలసలే ముద్దు!”

  1. Congress gone in Telangana.

    Next time it is trs only.

    People are panicky and terribly afraid of Congress rule..

    Congress misused the golden chance given in 2023.

Comments are closed.