విజయశాంతి.. రాజకీయంగా ఆమెకు వ్యక్తిగతంగా ఉన్న సత్తా ఏమిటో కాంగ్రెస్ లో పని చేసిన ఆరేళ్లలో తేలిపోయింది! అప్పటికే టీఆర్ఎస్ లో పొందలేక ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన ఊపులో ఆ పార్టీలోకి చేరిన విజయశాంతి అప్పట్లోనే కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఒక దశలో తన బక్కన్న కేసీఆర్ అని ప్రకటించిన విజయశాంతి ఆ తర్వాత ఆయనను తీవ్రంగా విమర్శించారు. తనకు దేవుడిచ్చిన చెల్లి విజయశాంతి అని ప్రకటించిన కేసీఆర్ మాత్రం ఆమెనెప్పుడూ విమర్శించిన దాఖలాలు లేవు. అసలు విజయశాంతిని టీఆర్ఎస్ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు!
ఆమె కూడా టీఆర్ఎస్ ఊపు మీద ఉన్నప్పుడు విజయం సాధించారు కానీ, అప్పుడెప్పుడో బీజేపీలో పని చేసినప్పుడు కానీ, సొంత పార్టీ పెట్టినప్పుడు కానీ.. కాంగ్రెస్ లో పని చేసినప్పుడు కానీ.. గెలిచిన దాఖాలు లేవు! అదీ విజయశాంతి పొలిటికల్ స్టామినా.
సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చలామణి కావడమే విజయశాంతి రాజకీయాల్లో ఉనికిని కలిగి ఉండటానికి కారణం. ఈ జనరేషన్ సినిమా ప్రియులు కూడా ఆమె స్టార్ హీరోయిన్ అనే విషయం మరిచిపోయారు! ఇప్పుడు ఆమెను చేర్చుకున్న బీజేపీ.. ఆమె సినీ గ్లామర్ ను ఏ మేరకు ఉపయోగించుకుంటుందో, ఆమె తెలంగాణ బీజేపీకి అదనపు భారంగా మారుతుందో చూడాల్సి ఉంది!
ఆ సంగతలా ఉంటే.. అలా బీజేపీ తీర్థం పుచ్చుకుందో లేదో.. విజయశాంతికి బీజేపీ అధిష్టానం పెద్దల దర్శనం దక్కింది. నడ్డా ఆధ్వర్యంలో కాషాయ కండువా, ఆ వెంటనే అమిత్ షా తో మీటింగ్! ఇదీ విజయశాంతి కి కమలం పార్టీలో దక్కుతున్న ట్రీట్ మెంట్.
ఆమెను దగ్గరుండి అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లారట టీబీజేపీ నేతలు. ఆమెతో పాటు అప్పుడెప్పుడో బీజేపీలో చేరిన వెంకటస్వామి తనయుడు వివేక్ కు కూడా అమిత్ షా దర్శనం దక్కిందని తెలుస్తోంది.
ఈ మీటింగ్ పవన్ కల్యాణ్ కు దెప్పి పొడుపుగా మారుతోంది! పవన్ కల్యాణ్ బీజేపీకి అనుకూలంగా మారి ఏడాది గడిచిపోయినట్టుగా ఉంది. విజయశాంతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయితే పవన్ కల్యాణ్ ఇప్పుడూ స్టార్ హీరోనే! అయితే ఢిల్లీలో మాత్రం విజయశాంతి పాలిటి విలువ దక్కుతున్నట్టుగా లేదు పవన్ కల్యాణ్ కు!
విజయశాంతిని ఇంటికి వెళ్లి మరీ చేర్చుకున్నారు కమలం వాళ్లు. పవన్ కల్యాణ్ మాత్రం తనే వెళ్లారు పల్లకి మోయడానికి. అయినా.. బీజేపీ వాళ్లకు పవన్ పట్టడం లేదు. ఢిల్లీ వెళ్లి మూడ్రోజులు కూర్చుంటే కానీ.. నడ్డా దర్శనం దొరకలేదు. అదే తాజా లడ్డూలతో సమానంగా భావించి తిరిగొచ్చారు పవన్ కల్యాణుడు.
ఇదంతా చూస్తుంటే.. చంద్రబాబుతో సావాసమే పవన్ కల్యాణ్ ను అన్ని రకాలుగానూ దిగజారుస్తున్నట్టుగా ఉంది. అయితే ఇప్పటికీ చంద్రబాబుతో రహస్య సహవాసాన్ని పవన్ కల్యాణ్ అస్సలు వదులుకున్నట్టుగా, వదులుకునేట్టుగా లేడు. చంద్రబాబుతో రాజకీయంగా అక్రమ సంబంధమో, సక్రమ సంబంధమో పెట్టుకుని.. బాగుపడిన వారెవరూ లేరనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఇలానే పుచ్చిపోవడాన్ని ఇష్టపడుతున్నట్టుగా ఉన్నారు!