ముప్పయి వేల ఓట్ల మెజారిటీతో అయ్యన్నని ఓడిస్తా!

ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో ముచ్చటగా మూడవసారి ఆ ఇద్దరూ పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వైసీపీ తరఫున పోటీ చేస్తూంటే టీడీపీ నుంచి పదవసారి అయ్యన్నపాత్రుడు రంగంలో…

ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో ముచ్చటగా మూడవసారి ఆ ఇద్దరూ పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వైసీపీ తరఫున పోటీ చేస్తూంటే టీడీపీ నుంచి పదవసారి అయ్యన్నపాత్రుడు రంగంలో ఉన్నారు. ఈ ఇద్దరూ 2014లో మొదటిసారి తలపడ్డారు. అపుడు టీడీపీ తరఫున అయ్యన్నపాత్రుడు రెండు వేల 338 మెజారిటీతో గెలిచారు.

అదే 2019 ఎన్నికల నాటికి వచ్చేసరికి జగన్ వేవ్ కూడా తోడు కావడంతో పెట్ల ఉమా శంకర్ అయ్యన్నను 23,930 ఓట్ల భారీ తేడాతో ఓడించారు. 2024లో ఈ ఇద్దరూ విజయం తమదే అంటున్నారు. తాజాగా పెట్ల ఉమాశంకర్ మీడియాతో మాట్లాడుతూ 2019 కంటే ఈసారి మరింత మెజారిటీ వస్తుందని అన్నారు.

తాను ఈసారి ముప్పయి వేల భారీ ఆధిక్యతతో అయ్యన్నను ఓడిస్తాను అని ధీమా వ్యక్తం చేశారు. అయిదేళ్ల పాటు తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మరోసారి నర్శీపట్నంలో వైసీపీ విజయాన్ని నమోదు చేస్తాయని ఆయన అంటున్నారు.

అయిదేళ్ల జగన్ పాలన అయిదేళ్ల చంద్రబాబు పాలనను బేరీజు వేసుకుని జనాలు ఓటేస్తారు అని ఆయన విశ్లేషించారు. అయ్యన్న హయాంలో చేయని అభివృద్ధి తాము చేసి చూపిస్తున్నామని అన్నారు. నర్శీపట్నానికి మెడికల్ కాలేజీని తాను తీసుకుని వచ్చానని వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులు మొదలవుతాయని పెట్ల చెప్పారు.

అనేక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నాయని ఆయన అంటున్నారు. అయ్యన్నను ఓడించేది మరోసారి తానే అని ఇది రాసి పెట్టుకోవచ్చు అంటున్నారు. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ ని నర్శీపట్నంలో ఎమ్మెల్యేగా తనను మరోసారి చూడబోతున్నారు అని పెట్ల అంటున్నారు. 2019లో విడిగా పోటీ చేసిన జనసేన టీడీపీతో కలుస్తోంది. ఆ పార్టీ ఓట్లు కలిసినా కూడా తమకే లాభం అని వైసీపీ నేతలు అంటున్నారు.

వైసీపీకి అనుకూల ఓటు పెరిగిందని దాంతోనే మరో ఏడు వేల దాకా అదనంగా ఓట్లు తమకే వస్తాయని లెక్క వేస్తున్నామని అంటున్నారు. పెట్ల ఉమాశంకర్ ఎక్కడా తగ్గడం లేదు అని అంటున్నారు. ఈసారి కూడా నాదే విజయం అని చెబుతున్నారు అంటే నర్శీపట్నంలో వెరీ టఫ్ గురూ అనే అంతా అంటున్నారు.