హ‌వ్వా.. న‌వ్విపోదురుగాక‌!

పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు ద‌క్కిందే 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాలు. దీంతో జ‌న‌సేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్ర‌హావేశానికి లోనై వున్నాయి. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా… ఆ పార్టీ అభ్య‌ర్థుల…

పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు ద‌క్కిందే 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాలు. దీంతో జ‌న‌సేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్ర‌హావేశానికి లోనై వున్నాయి. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా… ఆ పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక వ్య‌వ‌హారం త‌యారైంది. పేరుకే జ‌న‌సేన‌కు సీట్ల కేటాయింపు. జ‌న‌సేన గుర్తుపై టీడీపీ అభ్య‌ర్థులు పోటీ చేయ‌డం ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం జ‌న‌సేన‌కు కేటాయించారు. కానీ జ‌న‌సేన‌లో టీడీపీ ఇన్‌చార్జ్ పులిప‌ర్తి ఆంజ‌నేయుల్ని చేర్చుకుని, ఆయ‌న్నే బ‌రిలో నిలిపారు. తాజాగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ‌లోనూ అదే జ‌రుగుతోంది. అవ‌నిగ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జ్ మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ ఇవాళ జ‌న‌సేన‌లో చేరనున్నారు. టికెట్ హామీతోనే ఆయ‌న జ‌న‌సేన‌లో చేరుతున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

ఈ ర‌క‌మైన రాజ‌కీయాల‌పై జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ర‌గిలిపోతున్నారు. అవ‌నిగ‌డ్డ అభ్య‌ర్థి ఎంపిక కోసం కొన్ని రోజులుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు బిల్డ‌ప్ ఇస్తూ వ‌స్తున్నారు. బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకే ప‌వ‌న్ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నార‌ని జ‌న‌సేన శ్రేణులు భావించాయి. కానీ అదంతా బిల్డ‌ప్ మాత్ర‌మే అని, మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌కు టికెట్ ఇస్తామ‌ని ఎప్పుడో మాట్లాడుకున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ సీటును ఉమ్మ‌డి కృష్ణా జిల్లా జ‌న‌సేన అధ్య‌క్షుడు బండ్రెడ్డి రామ‌కృష్ణ‌, ఆ మ‌ధ్య జ‌న‌సేన‌లో చేరిన కాంట్రాక్ట‌ర్ విక్కుర్తి శ్రీ‌ను, అలాగే మ‌చిలీప‌ట్నం ఇన్‌చార్జ్ బండి రామ‌కృష్ణ ఆశించారు. సొంత పార్టీకి చెందిన ఎవ‌రిని ఎంపిక చేసినా బాగుండేది. కానీ జ‌న‌సేన అభ్య‌ర్థుల ఎంపిక ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతిలో లేదు క‌దా? అని సొంత పార్టీ నాయ‌కులు సెటైర్స్ విసురుతున్నారు. క‌నీసం జ‌నం న‌వ్విపోతార‌నే స్పృహ కూడా లేకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీడీపీ అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఖ‌రారు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని జ‌న‌సేన నేత‌లు మండిప‌డుతున్నారు.

ఇలాగైతే జ‌న‌సేనను ఎవ‌రు ఆద‌రిస్తార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మిత్ర‌ప‌క్ష పార్టీల మ‌ధ్యే జంపింగ్‌లు.. కేవ‌లం ఏపీలోనే చూస్తున్నామ‌ని జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. అది కూడా టీడీపీ నుంచి బీజేపీ, జ‌న‌సేన‌లోకి మార‌డం, టికెట్లు ద‌క్కించుకోవ‌డాన్ని ఏ ర‌కంగా అర్థం చేసుకోవాల‌ని ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.