కడప లోక్‌సభ స్థానం నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయనున్నారు. ఇవాళ అధికారిక ప్రకటన వెలువడనుంది. కడప నుంచి షర్మిల పోటీ చేయడం అంటే … రాజకీయ అంతాన్ని కోరి తెచ్చుకోవడమే. కడపలో తన సోదరుడైన వైఎస్ అవినాష్‌రెడ్డిపై షర్మిల పోటీ.. మీడియాకు బ్యానర్ హెడ్డింగ్‌లకు మినహాయించి, మరే రకమైన ప్రయోజనం వుండదు. ఇప్పటికే షర్మిల ఎక్కువగా మాట్లాడి, వైఎస్సార్ తనయగా అభిమానించే వారికి సైతం కోపం తెప్పించారు. వారి అభిమానాన్ని కూడా పోగొట్టుకున్నారు.
నిజానికి కడపతో షర్మిలకు ఎలాంటి అనుబంధం లేదు. వైఎస్సార్ కుమార్తెగా తండ్రితో పాటు జిల్లాకు వస్తూపోతూ వుండేవారు. ఇడుపులపాయలో ఉండేవారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు షర్మిల వెళ్లిపోయేవారు. తండ్రి చనిపోయిన తర్వాత అన్న అయిన వైఎస్ జగన్ కోసం పాదయాత్ర, ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్సార్ తనయగా, జగన్ చెల్లిగా మాత్రమే షర్మిలకు గుర్తింపు, గౌరవం. ఏదైనా సంఖ్యకు కుడి వైపు సున్నా వుంటే విలువ. అదే సున్నా సంఖ్యకు ఎడమ వైపు వుంటే, ఎలాంటి విలువ వుండదు. షర్మిలకు కడపలో విలువ సున్నాలాంటిదే.
కడప జిల్లా వ్యాప్తంగా షర్మిలకు ప్రజలకు ఎలాంటి అనుబంధం లేదు. కడప పార్లమెంట్ పరిధిలో ఏజెంట్లను కూడా పెట్టుకునే పరిస్థితి షర్మిలకు లేదు. కడప పార్లమెంట్ పరిధిలో కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బద్వేలులో కూటమి తరపున బీజేపీ బరిలో వుంది. మిగిలిన చోట్ల టీడీపీ, వైసీపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. కాంగ్రెస్‌కు కనీసం అభ్యర్థులు లేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసి, డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసేందుకు ఓటరు ఆసక్తి చూపరు. వైసీపీ, టీడీపీలలో ఏదో ఒక పార్టీని మాత్రమే ఎంచుకుంటారు. షర్మిల పార్టీ గురించి ఆలోచించే పరిస్థితే వుండదు. కడప జిల్లాలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోకపోతే, రాజకీయంగా, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రస్థానం శాశ్వతంగా ముగిసినట్టే.
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నోరు పారేసుకున్నోళ్ల పరిస్థితి ఏమైందో ఆమె ఒకసారి తెలుసుకుంటే మంచిది. కడప నుంచి ఆమెను పోటీ పెట్టాలనే నిర్ణయంలోనే, షర్మిల రాజకీయ జీవితానికి శాశ్వత సమాధి కట్టాలనే ఎత్తుగడ కనిపిస్తోంది. షర్మిలకు కూడా వేరే ప్రత్యామ్నాయం లేదు. సమరమా, రాజకీయ మరణమా? అనే రెండు ఆప్షన్లు మాత్రమే ఆమె ఎదుట ఉన్నాయి. కడపలో ఎన్నికలు జరగాల్సిన పనిలేకుండానే, ఫలితం ఎలా వుంటుందో షర్మిలతో సహా అందరికీ ముందే తెలుసు.