మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారా? 

అల్లు అర్జున్ ను అడ్డం పెట్టుకొని ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అల్లు అర్జున్ ఉదంతం కారణంగా హైదరాబాదులో కొందరు మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ అంటూ చీలికలు తేవడానికి, చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలా చేస్తున్నవారు పెద్ద పెద్ద నాయకులు కాదు. చోటా మోటా లీడర్లు. అయినప్పటికీ ఆ ఆలోచన పెరిగి పెద్దదైతే ఇబ్బందులే. అల్లు అర్జున్ గురించి ఎవరూ మాట్లాడవద్దని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను ఆదేశించినా కొందరు పట్టించుకోవడంలేదు. హద్దు మీరి ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా మాట్లాడుతున్నారు. కొందరు తెలంగాణవాదులు రెచ్చిపోతున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అల్లు అర్జున్ ను ఉద్దేశించి నువ్వు ఆంధ్రోడివి కాబట్టి ఆంధ్రకు వెళ్లిపోవాలని అన్నాడు. బన్నీని పగటి వేషగాడు అన్నాడు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా చెబుతున్నానని, అల్లు అర్జున్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని అన్నాడు. ఇంకా చాలా చాలా పరుషంగా మాట్లాడాడు.

బతకడానికి తెలంగాణకు వచ్చావన్నాడు. దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, మరికొందరు తెలంగాణవాదులు మీడియా సమావేశం పెట్టి ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్ వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సినిమా పరిశ్రమని ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేసి కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు.

రాష్ట్రం విడిపోయి దశాబ్దం దాటినా ఇంకా ఇక్కడే తిష్టవేశారని అన్నారు. ఏపీ సీఎం, డిప్యూటీ ఆంధ్రకు వచ్చేయాలని కోరుతున్నా పోకుండా ఇక్కడే ఉన్నారని అన్నారు. ఆంధ్ర నటుడి కారణంగానే సంధ్యా థియేటర్ లో రేవతి చనిపోయిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడిన తరువాత అప్పటి సీఎం కేసీఆర్ ఆంధ్ర వాళ్ళ భద్రతకు భరోసా ఇచ్చారు.

దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న ఏపీ ప్రజలు తెలంగాణా వాళ్లేనని అన్నాడు. గత పదేళ్లుగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎలాంటి గొడవలు లేవు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ను అడ్డం పెట్టుకొని ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

4 Replies to “మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారా? ”

  1. ప్రాంతీయ విధ్వెషాలు శ్రుష్టిన్స్తుంది మన జగన్, బులుగు మీడియాలె!

    అంద్రలొ రాజదాని కడితె రాయలసీమకి నష్టం ని, రాయసీమ బాగుపడితె మరొకరికి నష్టం అని సొల్లు రాస్తుంది బులుగు మీడియా నె.

Comments are closed.