అసలు విషయాలు చెప్పని అపోలో ఛైర్మన్‌…!

'అమ్మ' జయలలిత కన్నుమూసి నెల రోజులు కావొస్తున్న దశలో ఆమెకు 75 రోజులు వైద్యం చేసిన చెన్నయ్‌ అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి నోరు విప్పారు. ఇప్పటివరకు ఆయన మీడియాతో మాట్లాడిన దాఖలాలు…

'అమ్మ' జయలలిత కన్నుమూసి నెల రోజులు కావొస్తున్న దశలో ఆమెకు 75 రోజులు వైద్యం చేసిన చెన్నయ్‌ అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి నోరు విప్పారు. ఇప్పటివరకు ఆయన మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. కాని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలితకు గుండెపోటు వస్తుందని ఊహించలేకపోయామని చెప్పారు. మధ్యలో రెండు రోజులు తప్ప తాను రెండు నెలలపాటు చెన్నయ్‌ వదిలి వెళ్లలేదని, జయకు జరిగిన అన్ని చికిత్సలను దగ్గరుండి పర్యవేక్షించానని చెప్పారు. వైద్యానికి సంబంధించిన పలు విషయాలు వివరించారు.

కాని ఆమెకు కలిగిన అనారోగ్యం ఏమిటి? ఏ జబ్బుకు చికిత్స చేశారు? ఆమె అనారోగ్యం వివరాలు ఎందుకు బయటకు చెప్పలేదు? ఆమె కోలుకుందని, ఇష్టమొచ్చినప్పుడు ఇంటికి వెళ్లవచ్చునని చెప్పాక కూడా ఫోటోలు ఎందుకు విడుదల చేయలేదు? ఆమెను చూడటానికి ప్రముఖులను కూడా ఎందుకు అనుమతించలేదు?….ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అపోలో ఛైర్మన్‌ జవాబులు చెప్పలేదు. ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన పత్రిక ఆ ప్రశ్నలు అడిగిందా? లేదా? ఒకవేళ అడిగినా ఆయన జవాబులు చెప్పలేదా? తెలియదు. ఆ ప్రశ్నలన్నీ జనం ఎప్పటినుంచో అడుగుతున్నారు. 

జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై దర్యాప్తు చేయాలని మద్రాసు హైకోర్టులో, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొన్ని ఆంగ్ల పత్రికలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు ప్రచురించాయి. ప్రతాప్‌ రెడ్డి కీలకమైన విషయాలు చెప్పకుండా గుండెపోటును ఊహించలేకపోయామంటూ అదేదో ఆశ్చర్యకరమైన విషయంలా చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నవారే ఒక్కోసారి గుండెపోటుతో హఠాత్తుగా పోతుంటారు. అనారోగ్యంతో ఉన్న జయలలితకు గుండెపోటు రావడం వింతేమీ కాదు. సెప్టెంబరు 22న జ్వరం, డీహైడ్రేషన్‌తో జయ అపోలో ఆస్పత్రిలో చేరారు. 75 రోజుల వైద్యం తరువాత చనిపోయారు. జనాలకు అంతవరకే తెలుసు. కాని మరణానికి మూల కారణమేమిటో తెలియదు. గుండెపోటు కారణంగా చనిపోయివుండొచ్చుగాని ఆమెకు వైద్యం చేసింది ఏ జబ్బుకు అనేది తెలియదు. ప్రతాప్‌ రెడ్డి ఈ విషయాలు చెప్పకపోవడానికి  అన్నాడీఎంకే నాయకుల ఒత్తిళ్లు కారణమైవుండొచ్చు. 

ఈమధ్య డీఎంకే అధినేత కరుణానిధి (93) అనారోగ్యం పాలై కావేరి ఆస్పత్రిలో  చేరారు. ఆయన వాడుతున్న మందుల సైడ్‌ఎఫెక్స్ట్‌ కారణంగా అనారోగ్యం కలిగింది. చికిత్స తరువాత ఆయన కోలుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఆయన టీవీ చూస్తున్న, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆ ఫొటోలు చూశాక డీఎంకే నాయకులు, కార్యకర్తలు హ్యాపీగా ఫీలయ్యారు. జయలలిత కోలుకున్నారని, ఇంటికి కూడా వెళ్లొచ్చని ప్రతాప్‌ రెడ్డి ప్రకటించాక కూడా ఫొటోలు ఎందుకు విడదల చేయలేదో అర్థం కావడంలేదు. తన ఫొటోలు మీడియాకు విడుదల చేయాలని జయ లలిత చెప్పారని, కాని ఆమె ఫ్రెండు శశికళ నటరాజన్‌ వద్దని  ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పారని మీడియాలో వార్తలొచ్చాయి. దీన్నిబట్టి చూస్తే ఆమె మరణం వెనక 'ఏదో జరిగింది' అని అర్థమవుతోంది. 

జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది అపోలో ఆస్పత్రిగాని, అన్నాడీఎంకే నాయకులుగాని, ప్రభుత్వంగాని  తెలియచేయకపోవడంతో ఇంటా బయట (సామాజిక మాధ్యమాల్లో) పుకార్లు, అనుమానాలు హోరెత్తాయి.  ఆమె బతికుండగానే 'జయలలిత ఇక లేరు' అని కూడా కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అమ్మ తుది శ్వాస విడిచారంటూ కొందరు వికీపీడియా పేజీని ఎడిట్‌ చేశారు. డెత్‌ కాలమ్‌లో ఆమె మరణాన్ని ధ్రువీకరించారని, సెప్టెంబరు 30న కన్నుమూశారని వికీపీడియాలో రాశారని అప్పట్లో ఓ ఆంగ్ల పత్రిక రాసింది.   జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా డీఎంకే తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేసింది.

ఆమె క్షేమంగా ఉన్నట్లు ఫోటోలు, వీడియోల కోసం పట్టుబట్టిన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 'అసలు విషయం' తెలియచేయాలని గవర్నరుకు లేఖ రాశారు. అయినా అన్నాడీఎంకే ఖాతరు చేయలేదు. హైకోర్టుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. మొత్తంమీద తమ ప్రియతమ ముఖ్యమంత్రి, పురట్చితలైవి జయలలిత ఏ జబ్బుతో చనిపోయారో తమిళనాడు ప్రజలకు తెలియలేదు. ఇంక ఎప్పుడూ తెలియదు కూడా. మరి న్యాయస్థానాలు ఏం చేస్తాయో చూడాలి.