సంధ్యాకాలం రోజులో రెండు సార్లు వస్తుంది. ఉదయపు సంధ్యాసమయంలో సూర్యుడు ప్రభవిస్తూ ఉంటాడు, చంద్రుడు అస్తమిస్తూ ఉంటాడు. సాయంసంధ్యలో సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, చంద్రుడు ప్రభవిస్తూ ఉంటాడు. జనజీవితంలోనూ అంతే! ఒకే కాలంలో, ఒకే చోట ఒక తరం కనుమరుగవుతూ ఉంటుంది, మరొక తరం పైపైకి వద్దామని ఉరకలు వేస్తూ ఉంటుంది. రెండు తరాలూ కలిసి జీవిస్తాయి. కానీ రెండిటిలో వైరుధ్యం ఉంటుంది, అంతరం ఉంటుంది. అనేక విషయాల్లో భిన్నమైన దృక్కోణం ఉంటుంది.
కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా మార్పు వస్తూంటుంది. ఆ మార్పు పాత తరానికి నచ్చకపోతే మొహం చిట్లిస్తుంది. కొన్ని విషయాల్లో మార్పు మంచిదా కాదా అనే దానిపై వ్యక్తిగతమైన అభిప్రాయాలుంటాయి. కానీ మార్పులను గుర్తించవలసిన అవసరమైతే కచ్చితంగా ఉంది. గుర్తించాక, సవరణలు అవసరమని నవతరం భావిస్తే, సవరణలూ చేయవచ్చు. వారికి తోచకపోతే వారి తర్వాతి తరమూ చేయవచ్చు. కొన్ని అంశాలపై నా అభిప్రాయాలు చెప్పి, వీటిపై దృష్టి సారించమని నవతరాన్ని కోరుతున్నాను.
కుటుంబ వ్యవస్థ – సమిష్టి కుటుంబ వ్యవస్థకు మంగళం పాడేశాం. నేనూ, నా భార్యా, నా పిల్లలూ అంతే! సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ చాలు. అంతకంటె పెద్దదయితే తలిదండ్రులు వచ్చి ఉంటానంటారేమోనని భయం. పిల్లలకు తాతా, అవ్వా వద్ద గారాబం చేయించుకునే ఛాన్సు లేదు. ర్యాంకుల గురించి పిల్లల్ని హాస్టల్లో పడేయడం, వాళ్లు పెద్దయ్యాక – బదులు తీర్చుకోవడానికై- తలిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పడేయడం! దీనివల్ల పిల్లలకు ఎమోషనల్ ఔట్‌లెట్ లేకుండా పోయింది. కష్టాలు వచ్చినపుడు ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి ఇంట్లో పెద్దదిక్కు అంటూ లేకుండా పోయింది. క్రితం తరం వాళ్లలా ఆటుపోట్లు తట్టుకునే శక్తి కరువైపోయి, బెంబేలు పడడం ఎక్కువై పోయింది. దానివల్ల మానసిక వ్యాధులు, ఒక్కోప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
సమ్యక్ దృష్టి, సమగ్ర విద్యావిధానం లోపించడం – ఇదివరకు తరపు చదువుల్లో జనరలైజేషన్ ఉండేది. ఏదో ఒక డిగ్రీ చేతబట్టేవారు. ఇది కాకపోతే అది ఏదో ఒక ఉద్యోగం చేసేవారు. ఎమ్మెస్సీ చదివితే అయితే లెక్చరర్ కావచ్చు, లేదా బ్యాంక్ ఉద్యోగి కావచ్చు, ఏదీ కలిసి రాకపోతే టైపిస్టూ కావచ్చు, అనుకునేవారు. ఇప్పుడు స్పెషలైజేషన్ ఎక్కువై పోయింది. బియస్సీ బయోటెక్‌ను నమ్ముకుంటే బయోటెక్ లోనే ఉద్యోగం చేయాలి. బయోటెక్ కంపెనీలు చాలినన్ని లేకపోతే ఉద్యోగం రాక, పస్తులుండాలి.
డాక్టర్లు కూడా ఇదివరకు జనరల్ ఫిజిషియన్లు ఉండేవారు. ప్రతివారికీ ఎంతో కొంత ప్రాక్టీసు ఉండేది. ఇప్పుడున్న వారందరూ స్పెషలిస్టులే! శరీరంపై పూర్తి అవగాహన ఏ డాక్టరుకూ ఉండదు. స్పెషలిస్టులందరికీ ప్రాక్టీసు బాగుంటుందని చెప్పలేం. వస్తే పేషంట్లు ముమ్మరంగా వస్తారు, లేకపోతే ఎవరూ రారు. జనరల్ ప్రాక్టీషనర్ అయితే పరిస్థితి ఇంత ఘోరంగా ఉండదు. ఏదో ఒక జబ్బుతోనైనా వస్తారు.
ఇదివరకు సిలబస్‌లో క్రాఫ్ట్, మోరల్ టీచింగ్, డ్రిల్, సోషల్ సర్వీసు విధిగా ఉండేవి. ఇప్పుడవన్నీ పోయాయి. ఈ కాలంలో నీడ్-బేస్‌డ్‌గా ఆలోచిస్తున్నారు. అది కూడా యీ రోజుకి కావలసిన అవసరానికే పరిమితమవుతున్నారు. టెక్నాలజీ అతి త్వరగా మారిపోతున్న యీ రోజుల్లో రాబోయే పదేళ్లలో ఏది అవసరం పడుతుందో, ఫలానాది కూడా నేర్చుకుంటే రేపు దేనికైనా పనికి వస్తుందేమో అనే ఆలోచనే లేదు. తక్షణం మంచి ఉద్యోగం తెచ్చి పెట్టలేని విద్య జోలికి వెళ్లడం అనవసరం అనే దృష్టిలో ఉన్నారు. ఆ ఉద్యోగం పోతే మరొక వృత్తిలోకి వెళ్లలేని స్థితిలో పడుతున్నారు. ఇదివరకు సైన్సు డిగ్రీ విద్యార్థికి కూడా హ్యుమానిటీస్ ఓ లెవెల్లో నైనా ఉండేవి. ఇప్పుడు అవి తీసిపారేశారు. హ్యుమానిటీసూ లేవు, హ్యుమానిటీనూ లేదు. ఇంకొన్నాళ్లు పోతే కింది క్లాసుల్లో కూడా హిస్టరీ, జాగ్రఫీ అన్నీ తీసిపారేసి అమెరికా మ్యాప్ ఒక్కటీ నేర్పిస్తారేమో! మన అల్టిమేట్ డెస్టినేషన్ అమెరికాయే కదా!
ఆబ్సెన్స్ ఆఫ్ మిడిల్ రోడ్ – తక్కిన వృత్తి విద్యలు వదిలేసి అందరూ చదువులకు ఎగబాకుతున్నారు. మనకు బోల్డుమంది ఎలక్ట్రికల్ ఇంజనీర్లు దొరుకుతారు కానీ మంచి ఎలక్ట్రీషియన్ దొరకడు. ఈ చదువుల్లో కూడా ప్రతీవాడికీ టాప్ రాంక్ రావాలని తాపత్రయం. ఉంటే టాప్‌గా ఉండాలి, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి. ఇదీ ఈనాటి ధోరణి! మధ్యేమార్గం ఒకటి ఉంటుంది అన్న మాటే మర్చిపోయారు. మనకన్నీ భారీవాటి మీదనే మోజు. ‘భారీ తారాగణంతో సినిమా. దేనికీ కాంప్రమైజ్ కాకుండా తీశాం’ అంటారు. సినిమా హిట్టయితే నిర్మాత తర్వాతి సినిమాను మరింత భారీగా తీస్తాడు, లేకపోతే హుస్సేన్ సాగర్‌లో దూకుతాడు. లో బజెట్‌లో సంసారపక్షంగా, తక్కువ రిస్కుతో, ఫలితం ఎలా ఉన్నా ముప్పు రాకుండా తట్టుకునేట్లా సినిమా తీద్దామన్న ఆలోచనే లేదు.
అలాగే ఈనాటి తలిదండ్రుల్లో కూడా ‘మేం కాంప్రమైజ్ అవ్వం. అప్పు తెచ్చయినా ఎంతైనా డబ్బు కుమ్మరిస్తాం. మా వాడికి ఫస్టు ర్యాంకు రావలసిందే!’ అంటారు. పిల్లవాడికి అంత స్టాండర్డ్ ఉందా లేదా, వాడికి అభిరుచి ఉందా లేదా అనేది పరిగణించరు. డబ్బు ఖర్చు పెడితే చాలు, చదువులు వచ్చేస్తాయి అనే భ్రమలో ఉంటారు. ఇదివరకు ‘పోన్లే. ఏదో ఒకటి, ఎలాగోలా బతుకుతాడు’ అని వదిలేసే వారు. ఇప్పుడలా వదిలేసే సమస్యే లేదు. అందువల్లనే ర్యాంకులు రాకపోతే తలిదండ్రులను నిరాశ పరిచామన్న దిగులుతో స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
అన్నిటితోనూ జూదమాడే స్వభావం పెరిగింది. ఇదివరలో రైతులకు చాలా ఓపిక ఉండేది. మంచిరోజుల కోసం కాచుకునేవారు. ఇప్పుడా ఓపిక లేదు. రొయ్యల చెరువు వేయడం, లేదా లాభాలు వస్తాయని పత్తి పంట వేయడం. నష్టం వస్తే ఎండ్రిన్ ఎలానూ ఉంది అనుకోవడం! నేను పోతే నా కుటుంబానికి ప్రభుత్వం డబ్బు యిస్తుందిలే అనే ధీమాతో భారతీయ రైతు మౌలిక స్వభావమే మారిపోతోంది. ఇది అత్యంత దురదృష్టమైన విషయం.
కన్స్యూమరిజం – పాతతరానికి, ఇప్పటి తరానికి కొట్టవచ్చినట్టు కనబడే తేడా సేవింగ్స్ హేబిట్‌లో కనబడుతుంది. ఇదివరలో 300 రూ॥ల జీతగాడు కూడా అందులోనే కాస్త కూడబెట్టి కాస్త బంగారం కొనేవాడు, చిన్న జాగా కొనేవాడు. పిల్లలకు కాస్తో, కూస్తో చదువులు చెప్పించేవాడు, పెళ్లీ పేరంటం చేసేవాడు. రిటైరయ్యాక కృష్ణారామా అంటూ కాలం వెళ్లబుచ్చి తృప్తిగా వెళ్లిపోయేవాడు.
ఇప్పుడు దాచుకుని భవిష్యత్తుకై ప్లాను చేసే పద్ధతే పోయింది. అడగనివాడిది పాపం అని క్రెడిట్ కార్డులు వెంటబడి మరీ ఇస్తున్నారు. ‘నాకు ఓడంత బంగళా ఉంది, పడవంత కారుంది’ అని అంటారే కానీ వాటి వెనుక వాటిని ముంచేసేటంత అప్పులున్నాయని చెప్పరే! అవసరం ఉన్నా లేకపోయినా ప్రతీవాడు ప్రతి వస్తువూ కొంటున్నాడు. వాయిదాల పద్ధతిలో ఇస్తానంటే ఏనుగునైనా కొంటారు మనవాళ్లు. చివరికి అప్పులు పెరిగి క్రెడిట్ కార్డుల వాళ్లు జబర్దస్తీగా వసూలు చేయబోతే చేతులెత్తేసి, ఈ లోకం నుండి జండా ఎత్తేస్తున్నాడు. అవసరాలు పెంచుకుపోయిన కొద్దీ ధనార్జనకు వేర్వేరు మార్గాలు పడుతున్నారు. అందుకే ఈ తరం నైతిక స్థాయిలో కూడా దిగజారుడుతనం కనబడుతోంది.
ఇది 2005 జూన్‌లో ఈటీవీ 2 వారు నిర్వహించిన ‘‘తరాలు-అంతరాలు‘‘ చర్చలో పాల్గొన్నప్పుడు నేను వెలువర్చిన అభిప్రాయాలు. గత 20 ఏళ్లలో పైన చెప్పిన పరిస్థితులు తీవ్రమయ్యాయి. కుటుంబ వ్యవస్థ మరింతగా విచ్ఛిన్నమైంది. మధ్యతరగతిలో, ఉన్నత వర్గాలలో అనేకమంది స్త్రీలు అత్తమామల ఉనికి కూడా సహించలేని స్థితికి వచ్చారు. చాలామంది ‘ఇద్దరు అక్కరలేదు, ఒక పిల్లో, పిల్లాడో ఉంటే చాలు’ అనుకుంటున్నారు. మరి కొందరు పిల్లలే వద్దనుకుంటున్నారు. ‘డింక్’ (డబుల్ ఇన్‌కమ్-నో కిడ్స్) ఫార్ములా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చివరకు భార్యాభర్తా కలిసి ఉన్నా అబ్బురమనే దిశగా పయనిస్తున్నాం. వైవాహిక వ్యవస్థపై నమ్మకం పోయి, సహజీవనంపై మోజు పెరుగుతోంది. వివాహేతర సంబంధం, స్వలింగ వివాహం.. ఏదీ తప్పు కాదంటోంది సుప్రీం కోర్టు.
ఇక స్పెషలిస్టులు మరీ పెరిగిపోయారు. కుడి పాదం సమస్యకు ఒక డాక్టర్ని, ఎడమ పాదం సమస్యకు మరో డాక్టర్ని చూడవలసి వస్తోంది. చేతిలో పట్టా పెట్టుకుని ఉద్యోగాలకై వెతికే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. నిరుద్యోగిత ప్రధానమైన ఎన్నికల అంశంగా మారింది. ఉద్యోగాలు ఎడాపెడా పోతున్నాయి. జీవనోపాధికి ఏం చేయాలో తెలియక నేరాల వైపు మళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఉన్నత విద్య పేరుతో చౌక లేబరుగా పని చేయడానికి అమెరికాకు, యితర దేశాలకు వెళ్లేవారి సంఖ్య ఏటేటికి పెరుగుతోంది. పిల్లల చదువులకై ఖర్చుకు వెనకాడని రోజుల్నుంచి, పిల్లల్ని అమెరికా పంపడానికి ఏ రిస్కు తీసుకోవడానికైనా సిద్ధపడే తల్లిదండ్రులు పెరిగారు. ప్రస్తుతమైతే 50 లక్షల ఖర్చు పెట్టి స్టూడెంటు వీసాలపై పంపిన పిల్లలు అక్కడ ఏ అవస్థలు పడుతున్నారో అని అమ్మానాన్న బెంగ, నా మీద పెట్టిన పెట్టుబడి యావత్తుని వృథా చేసిన నేను తిరిగి వెళ్లి వాళ్లకు మొహమెలా చూపించగలను? అని పిల్లల వర్రీ!
అప్పులు చేసి వస్తువులు సమకూర్చుకోవడం మరీ పెరిగింది. కాల్ మనీ రాకెట్, లోన్ యాప్స్ దుర్మార్గం.. యిలాటి వాటి గురించి పేపర్లలో ఎన్ని వార్తలు వస్తున్నా ప్రజలు వెనక్కి తగ్గటం లేదు. స్తోమతకు మించి అప్పులు చేయడం, చెల్లించాల్సిన సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యులతో సహా సామూహిక ఆత్మహత్య.. యిది బాగా నేర్చారు. స్థాయికి మించి ఆలోచించమని, రిస్కు చేయమనీ సినిమాలు ప్రేరేపిస్తున్నాయి. బెట్టింగులు విపరీతంగా పెరిగాయి. కోళ్ల పందాలు, క్రికెట్ పోటీలు, ఎన్నికలు..
కాదేదీ జూదానికి అనర్హం.. అన్నట్లు సాగుతోంది లోకపు తీరు! ఆర్థిక అసమానతలు పెరిగిన యీ రోజుల్లో మధ్య, క్రింది తరగతి జీవితం అస్తవ్యస్తమౌతోంది.
– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Excellent !!!
Excellent !!!
real gaa chepparu sir
చాలా కరెక్ట్ గా చెప్పారు సార్
చాలా బాగా విశ్లేషించారు.
Chandrudu astaminchatam enti GA ? Janalu antha verri vengalppaila kanipistunnara enti
Wow
పక్కన వాళ్ళతో పోల్చుకోవడం,
చివరకి సొంత ఇంట్లో వ్యక్తుల మధ్య కూడా ఎక్కువ అయింది.
ఆఖరికి 4 తరగతి చదివే చిన్న పిల్లల్లా అభిప్రాయం ప్రకారం పెద్ద వాళ్ళు నడుచు కుంటున్నారు ఇంకా ఆ పిల్లల కి ప్రపంచం మొత్తం తాము చెప్పినట్లే నడవాలి అని ఆలోచన తో పెరుగుతారు.
గంజా*యి వనంలో తులసి మొక్క లాంటివి మీ వ్యాసాలు.
Excellent article a mirror of present day scenario.
Too much expectations,
Unrealistic hopes,
Freedom without responsibility..
సమస్య గుర్తించారు కానీ పరిష్కారాలు ఎవరికీ తోచట్లేదే .. ఒకవేళ ఉన్నా ఎవరు చెబితే ఎవరు వింటారు .. ఎవరి ఖర్మాన వాళ్లు పోవలసిందే
ఈ సమస్య ఉందీ అని ఎత్తి చూపించే వారే లేరు. ఎవరైనా చూపించినా వాడినో చేతకాని వాడికింద జమకట్టేస్తున్నారు, ఇంట్లో వాళ్ళే. ముందర ఎలక్ట్రీషియన్లకీ, ప్లంబర్లనీ, గౌరవంగా చూడడం నేర్చుకుంటే రేపు మనబిడ్డ ఆ పని చేసినా గౌరవం దొరుకుతుంది.
మనకి రోడ్డుపక్క హోటల్ వంటచేస్తే అతను వంటవాడు. అదే స్టార్ హోటల్ అయితే షెఫ్. చిన్న సెలూన్ లో మంగలి. పెద్ద సెలూన్ లో స్టైలిస్ట్. ఈ వ్యత్యాసాలు మానుకోవాలి మనం.