పత్రికారంగం అతి ముఖ్యమైనది. ఒక నాయకుణ్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక ఆలోచనా విధానాన్ని ఆకాశానికి ఎత్తాలన్నా, పాతాళానికి తొక్కాలన్నా వారిదే ముఖ్య భూమిక. క్షేత్రవాస్తవాలను తెలుసుకునే అవకాశం, తీరిక, ఓపిక సాధారణ ప్రజలకు వుండవు. పత్రికల కళ్ల ద్వారానే వాళ్లు ప్రపంచాన్ని చూస్తారు. ఆ బాధ్యత గుర్తెరిగిన జర్నలిస్టులు నిజాయితీగా రిపోర్టు చేస్తారు. నిజాయితీతో పాటు వారికి సామర్థ్యం, రాస్తున్న అంశంపై అవగాహన, పట్టు ఉండాలి. లేకపోతే సమాజానికి హాని కలుగుతుంది.
తొలినాళ్ల పత్రికలలో ప్రబోధాలు, ప్రవచనాలు, సంపాదకీయాలలో ఉపదేశాలు, రాజకీయాలు, సాంఘికనీతి, ఆచారవ్యవహారాలపై చర్చ వీటిపై సంపాదకుని అభిప్రాయాలు ఉండేవి. పత్రికను అమ్ముకోవడం కంటె తను నమ్మినది చెప్పాలనే తాపత్రయం ఎక్కువ కనబడేది. అలస్యమైనా ఖరారైన న్యూస్ వేసేవారు, అందుచేత అచ్చులో వస్తే నమ్మి తీరాల్సిన పద్ధతిలో పత్రికలుండేవి. రాజకీయ ప్రత్యర్థుల గురించిన వార్తలు వేసినా, వార్త యథాతథంగా వేసి తమ వ్యాఖ్యలు జోడించేవారు.
పోను పోను స్పీడు పెరిగింది, త్వరగా వార్తలు చేర్చాలనే తాపత్రయంతో వాస్తవాలను చెక్ చేసుకునే తీరికి లేకపోయింది. ఉదయం 6 గంటల కల్లా పల్లెపల్లెలా పేపరందిస్తున్నామనే హుషారే తప్ప ఏం అందిస్తున్నామనీ, ఎంత ఖచ్చితమైన వార్త అందిస్తున్నామనే స్పృహ లేకుండా పోయింది. ప్రతీ జిల్లాకు, ప్రతీ పల్లెకూ అందించేందుకు వీలుగా, మల్టిపుల్ ఎడిషన్స్ వచ్చాయి. మీ జిల్లా, మీ ఊరు, మీ పేట, మీ వీధి న్యూసు పేపర్లో చూసుకోవాలను కుంటారనుకుని వాటి మీదనే ధ్యాస పెడుతున్నారు పత్రికల వాళ్లు.
అంతర్జాతీయ సమస్యల గురించి ఎన్ని వార్తలు, సంపాదకీయాలు వస్తున్నాయి చెప్పండి? ఇదివరకు తెలుగు పత్రికలు మాత్రమే చదివినా అంతర్జాతీయ వార్తలెన్నో తెలిసేవి. ఈనాడు ఆ న్యూస్‌కి తెలుగు పేపర్లు, టీవీలు కేటాయించేది ఒక ఫ్లాష్ న్యూస్ మాత్రమే. ఎంతసేపూ సెన్సేషనల్‌గా రాద్దామనే తాపత్రయం తప్ప మీ నాలెడ్జ్ పెంచుదామని, మీ పరిజ్ఞానాన్ని విస్తృతం చేద్దామని అనుకోవటం లేదు. మీరు పదేపదే పేర్లు విన్న మీ చుట్టూ ఉన్న ఛోటామోటా నాయకుల ప్రకటనల గురించి రాసి మీదృష్టిని ఆకర్షించడానికి చూస్తున్నారు తెలుగు పత్రికల వాళ్లు. అందుకే జిల్లా జిల్లా కొక ఎడిషన్!
ఇది సెన్సేషనలైజేషన్ యుగం. వార్తలకు మసాలా జోడించి పేపరు అమ్ముకుందామనే తాపత్రయం అడుగడుగునా కనబడుతోంది. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఏవో ఆరోపణలు చేస్తూ గాలి వార్తలు సృష్టించడం, ‘రిపోర్టెడ్‌లీ’ అనో, పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి చెప్పారనో, ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని రాసి పారేయడం. అది నిజం కాదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆరోపణలకు గురైన వాడిదే! పత్రికల వాళ్లది కాదు. అదీ తమాషా! ‘తప్పుడారోపణ చేసాం, క్షమించండి’ అని పత్రికల చేత ఒప్పించాలంటే మన పనులు మానుకుని కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసినదే!
పాఠకుల దృష్టి ఆకర్షించడంపై వెర్రి ఎంతవరకూ పోయిందంటే ఆకర్షణీయంగా కాప్షన్లు పెట్టడానికి వేరే ఒక డిపార్ట్‌మెంట్ నడుపుతున్నారు. అందువల్లనే చాలా సందర్భాలలో కాప్షన్‌లో ఒకటి ఉంటోంది, లోపల మేటరు వేరేలా ఉంటోంది. రాజకీయపరమైన వార్తలకు సంబంధించినంత వరకు అరోపణలు, ప్రత్యారోపణలు సహజం. ప్రజలకు అది ఓ కాలక్షేపం. వీటి నిజానిజాలు కోర్టులు తీరిగ్గా తేలుస్తాయి. ఆ తీర్పూ లక్ష్యపెట్టక ప్రజాకోర్టు తీర్పే శిరోధార్యం అంటూ దాని కొరకు వేచి ఉండే నాయకులున్నారు.
లలిత కళలపై రిపోర్టింగు – దురదృష్ట మేమిటంటే తెలుగు జర్నలిజంలో ఎటు చూసినా పొలిటికల్ జర్నలిస్టులు కనబడుతున్నారు తప్ప తక్కిన విషయాల్లో ప్రొఫెషనల్ జర్నలిస్టులు కనబడటం లేదు. సైన్సు, ఆరోగ్యం, ఆర్థికం, లలిత కళలు – వీటిపై సాధికారికంగా వ్యాఖ్యానించే వాళ్లే కనబడటం లేదు. కళల్లో సాహిత్యం గురించి ఐతే వారానికి రెండు, మూడు పుస్తకాలపై పది లైన్ల పుస్తక సమీక్షలు (వారు పత్రికా సిబ్బంది కానక్కరలేదు) వేసి చాల్లే అంటున్నారు. మరో ఏడెనిమిదింటిని ‘స్వీకారం’, అనో ‘ఇవీ వచ్చాయి…‘ అనో పేర్లు వేసేసి చేతులు దులుపు కుంటున్నారు. కొన్ని పత్రికలు సోమవారం సాహిత్యానుబంధం పేజీ అంటూ పాతకాలపు గురజాడ గురించో, మనం పేరైనా వినని అర్జంటీనా రచయిత గురించో ఒక వ్యాసం, అదీ ఎవరైనా పంపినది వేస్తారు తప్ప, యీనాటి సాహిత్యపు పోకడల గురించి పత్రికాపరంగా ఏ అభిప్రాయమూ తెలుపరు.
ఇక సినిమా సమీక్షకులు ఎల్లెడలా కనబడతారు కానీ సంగీత, నృత్య కార్యక్రమాల గురించి, ఒక కచ్చేరీకో, నాట్యప్రదర్శనకో వెళ్లి తప్పొప్పులు చెప్పగలిగే జర్నలిస్టు (‘‘సాగర సంగమం’’లో కమలహాసన్‌లా) ఒక్కరూ కానరారు. ఆ కార్యక్రమానికి వచ్చిన మంత్రి గారితో ఆర్టిస్టులు దిగిన ఫోటో ఒకటి వేసి ‘మన ముఖ్యమంత్రి హయాంలో మన ప్రభుత్వం లలిత కళలకు అండగా ఉంటుంది’ అనే మంత్రి గారి స్టేటుమెంటు కాప్షన్‌గా పెట్టి న్యూస్ యిస్తారు. ఇలాటి రిపోర్టింగు చేయకపోయినా ఫర్వాలేదు.
సైన్సు రిపోర్టింగు – కానీ సైన్సు విషయాల సంగతి మాత్రం అలా కాదు. ముఖ్యంగా ఆరోగ్యవిషయాల గురించి రాసే తప్పుడు వార్తలు ప్రజలకు ఎంతో హాని చేస్తాయి. ప్రజలను ప్రమత్తులను చేస్తాం. ప్రమాదాలకు లోను చేస్తాయి. దేని గురించైనా వార్త కానీ వ్యాఖ్య గానీ రాసేందుకు దాని గురించి అవగాహన, కనీస జ్ఞానం ఉండాలి కదా! రిపోర్టర్లలో నూటికి ఐదు శాతం మందికైనా ఈ విషయంలో పరిజ్ఞానం ఉన్నట్టు తోచదు. అందునా సైన్సు అనేక రంగాలుగా విస్తరించి ఉంది. దినదినం డైవర్సిఫై అవుతూ ఉంది. సైన్సు గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన అన్ని డిసిప్లిన్స్ తెలియాలని లేదు. అది అసాధ్యం. మరి సైన్సు పురోగతికి తగిన నిష్పత్తిలో సైన్సు గురించి సాధికారంగా రాయగలిగిన విలేఖరులు ఉన్నారా చెప్పండి… లేరు!
అందుకనే తెలుగు పత్రికలలో ఇంగ్లీషు నుంచి అనువదించి వేసే సైన్సు వ్యాసాలలో చాలా తప్పులు కనబడతాయి. ఒక విలేఖరికి ప్రజారోగ్య సమస్య ఒకదాని గురించి రాయవలసిన పనిబడిందనుకోండి. ఏం చేస్తాడు? తన మిడిమిడి జ్ఞానం తనకే తెలుసు కాబట్టి, ఆ అంశానికి సంబంధించిన వారో, సంబంధం లేనివారో, ఎవరో ఒకర్ని పట్టుకుని ‘దీనిపై వాళ్లు ఇలా అన్నారు, అలా అన్నారు..’ అని రాసేసి దానికి తనకు తోచిన మెరుగులు దిద్దేసి, సెన్సేషనల్ రంగు పులిమేసి ప్రజల్లోకి వదిలేస్తాడు. అంతే తప్ప తను దాని గురించి కాస్త చదువుకుని అవగాహన పెంచుకుని, వ్యాఖ్యానించడు. ఇది సమాజం పట్ల బాధ్యాతారాహిత్యం, ఒక విధంగా దేశద్రోహం.
ఈ విషమ పరిస్థితిని సరిదిద్దే మార్గం ఏమిటి? ఎడిటోరియల్ బోర్డులో సైన్సు గురించి అవగాహన గలిగిన ఒక వ్యక్తి ఉండి, అతడు సామాజిక స్పృహతో సత్యాసత్యాలు విచారించి, ఆ రిపోర్టును సరిదిద్దాలి. ప్రజలకు నిజనిజాలు చెప్పాలి. కానీ అలా జరుగుతోందా? లేదు. రేప్పొద్దున్న సిగరెట్లు అమ్మేవాడు ‘సిగరెట్టు తాగితే క్యాన్సర్ రాద’ని చెపితే కూడా తన వివేకం, విచక్షణ ఉపయోగించకుండా ‘వారు యిలా అన్నారు..’ అని వేసేసి, కరక్టు రిపోర్టింగు చేశా అని భుజాలెగరేసే పరిస్థితి నేడు ఉంది.
కారణం? ప్రధానమైనది మల్టిపుల్ ఎడిషన్స్! ఏ జిల్లా ఎడిషన్‌కు ఆ జిల్లా ఇన్ చార్జే రాజా! ఆయన రాసినదే వేదం! ఒక జిల్లా ఎడిషన్ హెపటైటిస్-బి మహారోగం అంటుంది, పక్క జిల్లా ఎడిషన్ మాత్రం ‘అబ్బే, అది ఉత్తుత్తిది. మందుల కంపెనీలు కల్పించిన మాయ రోగం, ప్రచారసాధనాల సహాయంతో చేసిన సృష్టి’ అంటుంది, చూడబోతే రెండు ఎడిషన్లూ ఒక పత్రికవే! ఒక సెంట్రలైజ్‌డ్ పాలసీ అంటూ లేదు. దీని వల్ల ప్రజలంతా ఎంతటి అయోమయానికి గురవుతున్నారో ఎవరైనా లెక్కలు వేస్తున్నారా?
నా విన్నపం ఏమిటంటే కనీసం ప్రజాహిత సమస్యల వరకైనా రాజకీయాలు పక్కన పెట్టండి. సైన్సు, ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణం, ఇలాటి టెక్నికల్ మేటర్స్‌లో నిపుణులను సంప్రదించి, ఒక ఎటిటోరియల్ పాలసీ ఏర్పరచుకోండి. ఆ నిపుణుడు చెప్పినది అర్థం చేసుకుని, ప్రజలకు అర్థమయ్యే సాధారణ భాషలో పాఠకులకు అందించ గలిగే, వారి సందేహాలు తీర్చగలిగే టెక్నికల్లీ, సైంటిఫికల్లీ ఎన్‌లైటెన్‌డ్, ఎక్విప్‌డ్ స్టాఫ్‌ను నియమించుకోండి. ప్రజల పట్ల పత్రికల బాధ్యతను అతను అనుక్షణం గుర్తెరిగి ఉండాలి.
ఆర్థిక విషయాలపై రిపోర్టింగు – ఇక ఆర్థిక పరమైన విషయాల గురించి చేసే రిపోర్టింగు గురించి చెప్పాలంటే, దేశవాసుల మనుగడ, భవిష్యత్తు వాణిజ్యం, పరిశ్రమల చుట్టూ పరిభ్రమిస్తున్నాయని నా నమ్మకం. మనకు మూలాధారమైన వ్యవసాయం సైతం వ్యాపారంతో ముడిపడినదే కదా! మార్కెట్‌ని అధ్యయనం చేసి సరైన పంటను వేసుకునే ముందుచూపు, పండిన పంటను అమ్ముకోగలిగిన సామర్థ్యం రైతు అలవర్చుకున్నపుడు ఆత్మహత్యలే వుండవు. అందుకే నిరుద్యోగులు, చిరుద్యోగులు, మాజీ ఉద్యోగులు, చేవ కలిగిన ధీమంతులు – అందరి చూపూ ఉపాధి కల్పనపై, వ్యాపారావకాశాలపై వుండాలని నాయకుల నుండి పత్రికా సంపాదకులదాకా అందరూ ఘోషిస్తూంటారు.
అయితే వారికి ఆ యా రంగాలపై సమాచారం, ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం, రాబోయే అవకాశాలపై అంచనా, యితర రాష్ట్రాలకు, దేశాలకు విస్తరించే సాధ్యాసాధ్యాలు.. తెలిసే అవకాశాలు ఎక్కడున్నాయి? కొన్ని వాణిజ్య పత్రికలున్నా అవి నిర్వహించే భూమిక చాలా, చాలా పరిమితం. సాధారణంగా అందరూ చదివేవి మాతృభాషలో వెలువడే ‘జనరల్’ దినపత్రికలే! వ్యాపారావకాశాలు అన్వేషించేవారు, వారికి అనువైన ప్రణాళికలు రచించ వలసిన ప్రభుత్వాధికారులు, ఋణాలిచ్చి ఆదుకోవలసిన బ్యాంకు తదితర ఆర్థికసంస్థల అధికారులు, యీ అంశాలపై చైతన్యం తెచ్చి, పోరాడ వలసిన రాజకీయ నాయకులు – వీరందరూ ప్రధానంగా చదివేది తెలుగు దినపత్రికలే! వారి జ్ఞానాన్ని పెంచి, వ్యక్తిగత భవిష్యత్తును, దేశభవిష్యత్తును తీర్చిదిద్ద గలిగిన యీ పత్రికలు వాటి పాత్రను సజావుగా పోషించినప్పుడు దేశ ఆర్థిక చిత్రపటం రూపురేఖలు మారిపోతాయి.
ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? – ఈనాటి దినపత్రికలు యీ బాధ్యతను పూర్తిగా విస్మరించాయి. అవి రాజకీయాలకు, స్థానిక వార్తలకు, ఫీచర్లకు పెద్దపీట వేసి తక్కిన వాటిని పక్కకు నెట్టేశాయి. పాఠకులు తమకు ఫలానా తరహా వార్తలే కావాలని అడగలేదు. దేశరాజకీయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయలేని ఒక ఉపయెన్నికపై 45 రోజులపాటు కౌంట్‌డౌన్ అంటూ పత్రిక పేజీ పూరా కథనాలు ప్రచురించినా 45 శాతం ప్రజలు కూడా ఓటింగుకి రాని అనాసక్తత వారిలో చోటు చేసుకుంది. రాజకీయాలు పొట్ట నింపవని వారికి తెలుసు. ఏ స్వపక్ష, ప్రతిపక్ష నాయకుడు ఏ సందర్భంలో ఎటువంటి ప్రకటన యిస్తాడో వారికి కంఠోపాఠం. అయినా మన పత్రికలలో వాటికే ప్రాధాన్యం.
జిల్లా ఎడిషన్సులో ఆ జిల్లాలో నడిచే వ్యాపారం గురించి కథనాలుండవు. గృహిణి మానభంగానికి గురై ఒక కుటుంబం విచ్ఛిన్నమైతే అది వార్త. పది కుటుంబాలకు అన్నం పెట్టే దుకాణమో, పరిశ్రమో ప్రారంభించబడితే వార్త కాదు. ఊరూరా వున్న రిపోర్టర్లు ఛోటామోటా రాజకీయ నాయకుల ప్రకటనలు సేకరించడం, ప్రభుత్వాఫీసుల లంచగొండితనం బయటపెట్టడం తప్ప వేరేమీ చేయరా? ఆ జిల్లాలో కొత్తగా తెరుస్తున్న, మూతపడుతున్న వ్యాపారసంస్థలు వారి కంటికి అనవా?
ఈనాటి పత్రికలకు బిజినెస్ అంటే షేర్‌మార్కెట్ అనే అర్థం. సగం పేజీ షేరు ధరవరలకే కేటాయింపు. కాలమిస్టు పని ఏ షేరు కొనాలో సలహా యివ్వడం! షేరు మార్కెటు వల్ల ఉత్పత్తి పెరగదు, ఉపాధి పెరగదు. మధ్యతరగతికి చెందిన యిన్వెస్టర్లకు షేరు ధర తెలుపడం తప్ప వారికి ఏ పరిశ్రమ గురించీ లోతైన అవగాహన ఏర్పడేట్లా చేయటం లేదు.
బిజినెస్ కాలమ్ – బిజినెస్ కాలమ్‌లో కనబడేవి పొడి పొడి వాక్యాల వార్తలు మాత్రమే. ఒక కంపెనీ ఆర్థిక సంవత్సర ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పరచిన సమావేశంలో వాళ్లందించిన అంకెలే మనకు వార్తలు! ఏదైనా ఒక రంగం గురించి ఓపాటి వ్యాసం కనబడిందంటే దాని అర్థం ఆ రంగానికి సంబంధించిన ఓ ప్రముఖ సంస్థ త్వరలో పబ్లిక్ యిస్యూకి వెళ్లబోతోందని! ఎవరైనా పారిశ్రామికవేత్తతో యింటర్వ్యూ వేస్తే ఆయన చెప్పినది తూచ తప్పకుండా ప్రచురించడం తప్ప వాటిని క్రాస్‌చెక్ చేసుకోవడం కానీ, దానికి భిన్నమైన వెర్షన్‌ను ప్రచురించడం కానీ జరగదు. అప్పుడప్పుడు కనబడే దీర్ఘవ్యాసాలు ఇంగ్లీషు పత్రికల నుండి యథాతథంగా తర్జుమా చేయబడినవే తప్ప స్వంతంగా విశ్లేషించి రాసినవి కావు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రాజకీయాలకూ, ప్రభుత్వ కార్యకలాపాలకు పరిమితమైనట్టు తోస్తుంది.
కావలెను – విశ్లేషణ: రాజకీయాల విషయంలో వార్తలు, వ్యాఖ్యలు, రెండూ కలగలపిన కథనాలు కనబడతాయి. బిజినెస్ రంగానికి వచ్చేసరికి వార్తలే తప్ప వ్యాఖ్యలు, విశ్లేషణలు, మార్గదర్శనాలు, జోస్యాలు ఏమీ వుండవు. ఏదైనా ఒక పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినపుడు ఆ రంగం గురించి ప్రభుత్వమో, సంబంధిత వ్యాపార సంస్థో అందజేసిన గణాంకాలు పాఠకులకు చేరవేస్తారు. వాటిని ఆసక్తికరంగా విశదీకరించడం కానీ, వేరే కోణంలో లేదా దృక్కోణంలో విశ్లేషించడం గానీ జరగదు.
అసలు తమంతట తాము యినీషియేటివ్ తీసుకుని స్వంతంగా విషయసేకరణ జరిపి, పరిశోధించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు అనిపించదు. పన్నులు ఎగ్గొట్టే, కార్మిక హక్కులు నేలరాసే వ్యాపారస్తులను ఎండగట్టడం కానీ, కార్మికులకు వాటాలిచ్చి, దేశఖజానాకు మేలు కూర్చి, సమాజహితం కోరి పనిచేసే పారిశ్రామిక వేత్తలను శభాషనడం కానీ జరగదు. అవార్డు లిచ్చినపుడో, అరెస్టు చేసినపుడో మాత్రమే వీటి గురించి మాట్లాడే వారిని వార్తాహరులు అంటారు తప్ప పాత్రికేయులనరు. న్యూస్ ఛానెల్ టీవీలు వచ్చి నిమిషాల్లో వార్తలు అందిస్తున్న యీ యుగంలో పాఠకులు దినపత్రికలకై ఎదురు చూసేది వ్యాఖ్యాకథనాల కోసమే!
అంతర్జాతీయ వార్తలా? అవేమిటి? – ట్రాఫిక్ జామ్, దొమ్మీ, దోపిడీ వంటి స్థానికవార్తలతో నింపే దినపత్రికల్లో వీటికి స్థలమెక్కడ? ‘‘గోళ్లు తీసుకోవడం ఎలా?’’ ‘‘ఖాళీ సీసాతో ఫ్లవర్‌వేజ్ చేయడం ఎలా?’’ వంటి వారపత్రికల్లో కనబడవలసిన ఫీచర్లతో పేజీలు నింపుతున్న దినపత్రికల్లో వీటికి చోటెక్కడ? వీటికే కాదు అంతర్జాతీయ వార్తలకు కూడా జాగా కరువే! ప్రపంచీకరణ నేపథ్యంలో ఎవరైనా వ్యాపారస్తుడు యితర దేశాలకు విస్తరిద్దామనుకున్నా, వలస పోదామన్నా అతడికి ఆ దేశపు ఆర్థిక వాతావరణం, దానిని సానుకూల పరిచే రాజకీయవాతావరణం తెలిసి వుండాలి. కానీ మన పత్రికల్లో అమెరికా తప్ప తక్కిన దేశాల వార్తలు చోటు చేసుకునేది రెండే సందర్భాల్లో – శాకాహారాన్నో, జంతుప్రేమనో ప్రచారం చేస్తూ నగ్నప్రదర్శన నిర్వహించినపుడు లేదా సైనిక తిరుగుబాటు జరిగి, అధికారంలో వున్నవాళ్ల పదవి వూడినప్పుడు!
ఏదైనా ఒక దేశంలో వ్యాపారావకాశాల గురించి విస్తారంగా వ్యాసాలు వెలువడ్డాయంటే దాని అర్థం ఆ దేశాధినేత పర్యటనకు వచ్చాడని! ఇతర దేశాల మాట దేవుడెరుగు, పొరుగు రాష్ట్రాల ఆర్థికరంగం గురించి మనకేమైనా తెలుస్తోందా? ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ విధ్వంసం గురించి తెలిసినంతగా అక్కడున్న ఖనిజాల గురించి తెలుస్తోందా? కరుణానిధి వారసత్వ పోరు గురించి తెలిసినంతగా తమిళనాడులో ఆటోమొబైల్ రంగం విశేషాల గురించి తెలుస్తోందా?
ప్రకటనలతో సంబంధం లేదు – రాజకీయపరమైన కోణం లేకపోతే వ్యాపార కార్యకలాపాలపై పత్రికల దృష్టి పడటం లేదు. రాజకీయ నాయకులతో ముడిపడి వుండకపోతే బ్రాహ్మణి స్టీల్స్ గురించి యిన్ని కథనాలు ప్రచురించే వారా? వ్యాపారవేత్తలు రాజకీయాల్లో ప్రవేశిస్తే తప్ప వార్తల కెక్కరంటే అందరూ అదే బాట పట్టవలసి వుంటుందేమో! వ్యాపారస్తుల అక్రమాలపై పెన్ను ఎక్కుపెట్టక పోవడానికి పత్రికలకు ప్రకటనలపై వచ్చే ఆదాయానికి లింకు వుంటుందని నేననుకోవటం లేదు. పత్రికల సర్క్యులేషన్ బట్టి ప్రకటనలు వస్తాయి కానీ, వ్యాపారస్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కాదు. ఒక పారిశ్రామికవేత్త ఒక చెంప ఉపాధి కల్పిస్తూ, మరొక చెంప వాతావరణ కాలుష్యానికి తెగబడితే అతనిలోని రెండు పార్శ్వాలను పాఠకులకు అందించవలసిన బాధ్యత పత్రికలదే! స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్న రాజకీయ నాయకులను ‘హైలైట్’ చేసినట్టే సాంఘిక ప్రయోజనంతో వ్యాపారం చేస్తున్న పారిశ్రామికవేత్తను ‘హైలైట్’ చేసి యితరులకు ఆదర్శంగా నిలపవచ్చు. ఈ సామాజిక బాధ్యతకు, యాడ్స్‌కు ముడి పెట్టకూడదు.
పాత్రికేయులకు శిక్షణ – ఈ గురుతర బాధ్యతను నిర్వహించడానికి పత్రికలు సరైన సాధనసంపత్తులు సమకూర్చుకోవాలి. ముఖ్యంగా ఆ విభాగం చూసే పాత్రికేయులకు నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ యిచ్చి ఒక కంపెనీ నిర్వహణను సరిగ్గా అంచనా వేయగల నైపుణ్యాన్ని అలవర్చాలి. దేశదేశాలలో జరుగుతున్న సాంకేతిక, శాస్త్ర ప్రగతిని అవగాహన చేసుకోగలిగిన శక్తి సమకూర్చాలి. మన భవిష్యత్ పారిశ్రామిక రంగంపై వాటి ప్రభావాన్ని అంచనా వేయగలగాలి. గ్యాట్ ఒప్పందం, క్యోటో ఒప్పందం వంటి వాటిల్లో గల సున్నితమైన అంశాలను సైతం అవగతం చేసుకునే కౌశలం గరపాలి.
ఈ పని చేయకుండా సులభమైన మార్గం కదాని ఏ కాలమిస్టునో ఆశ్రయించకూడదు. ఎందుకంటే గణాంకాలతో, సాంకేతిక అంశాలతో కూడిన యీ విషయాలను ఒక పాత్రికేయుడు మాత్రమే తెలుగు నుడికారంతో, ఆసక్తికరంగా, సృజనాత్మకతో జనరంజకంగా పాఠకులకు అందించగలడు. అలా అందించిన రోజున తమ జీవితాలను అనునిత్యం ప్రభావితం చేసే ఆర్థిక నేరాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది, వాటి స్వరూప స్వభావాలను అర్థం చేసుకునే శక్తి లభిస్తుంది. విద్యావంతులు యీ థీమ్‌లపై కథలు రాస్తారు. సినిమాలు తీస్తారు. నిరక్షరాస్యులు సైతం తాము ఏ విధమైన దోపిడీకి గురవుతున్నామో, దాన్ని ఎలా ఎదిరించాలో తెలుసుకుంటారు. సమాజంలో క్రాంతి వస్తుంది.
ఈ మార్పు మాతృభాషలో వెలువడే పత్రికల వల్లనే సాధ్యం. నేనూ రోజూ మొదట చదివే పేపరు తెలుగు దినపత్రికే! మాతృభాషాభిమానంతో బాటు, సమయం కలిసివస్తుందనే ఆలోచన కూడా వుంటుంది. ఉపయోగకరమైన విషయాలతో పత్రిక వెలువడుతోందని, దానివల్ల ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోందని తెలిసినపుడు చిన్నా, పెద్దా పారిశ్రామికవేత్తలందరూ ప్రాంతీయ మీడియాతో స్నేహపూర్వకంగా మెలగుతారు. మార్కెట్‌ను శాసించగల మధ్యతరగతిని ప్రాంతీయ మీడియానే ప్రభావితం చేయగలదని వారికీ తెలుసు.
సాంకేతిక పదజాలం – ఇక యీ వార్తలను అందించే సాంకేతిక పదజాలం గురించి రెండు మాటలు – డు,ము,వు,లు చేర్చి సంస్కృతపదాలను మన స్వంతం చేసుకున్నాం. అజంతం చేసి ఫార్సీ, ఆంగ్లపదాలను ఆంధ్రీకరించుకున్నాం. వాణిజ్యపదాలను అనువదించడానికి కష్టపడి పదకోశాన్ని తయారుచేసే బదులు, ఆ యా మాటలను అజంతాలు చేసేద్దాం, లేదా యథాతథంగా వాడినా ముప్పురాదు. మనం కొత్త పదాలు సృష్టిస్తే తెలుగేతరులతో వ్యాపారబంధాలను ఏర్పరచు కునేటప్పుడు యీ సాంకేతిక పదాలు భావప్రకటనకు అవరోధమవుతాయి. సాంకేతికంగా ఎంతో ప్రగతి సాధించిన తెలుగు పత్రికారంగం తమ సిబ్బందిలో ప్రొఫెషనల్ జర్నలిస్టులను చేర్చుకుని, తర్ఫీదు యిచ్చి తద్వారా తెలుగు ప్రజల్లో యీ విషయాలపై అవగాహన పెంచాలని ఆశిస్తున్నాను.
ఇది ‘‘ఈనాడు’’ హౌస్ మ్యాగజైన్‌కై 2007 అక్టోబరులో రాసిన వ్యాసం. దానికి ముందు 2000 అక్టోబరులో ‘తెలుగు మీడియాలో సైన్స్ రిపోర్టింగ్’ అంశంపై ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’ నిర్వహించిన సమావేశంలోనూ యివే విషయాలు చెప్పాను. 2007 నాటికి మరో మారు చెప్పవలసిన అవసరం పడింది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ రాయాల్సిన అవసరం పడింది. అదీ దురదృష్టం.
– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)
వరప్రసాద్ రెడ్డి గారు,
తమరు ఇలాంటి 3rd గ్రేడ్ సైట్లలొ రాస్తు… మిమ్మలిని మీరు తిగ్గించుకొవాద్దు! అంతగా పని లెక పొతె రామ కొటి రాసుకొంది పుణ్యం అయినా వస్తుంది!
That is because almost all the publications are owned by political parties. This trend is common in almost all the countries. I think even a larger stake of Eenadu is owned by a foreign holding. This GA is owned by YCP party. Independent journalism is not viable.
2000 ki 2004 ki 2007 ki ippatiki theda gamanincha galaru
Oka paper loni page lu baga thaggincha baddayi
b/w nunchi white ki marayi
meru cheppinavi savivaram ga ivvali ante page lu penchali .. karchu peruthundi..rate peruguthundi…rate perigithe ammakalu thagguthayi
annitikante mukhyam ga chadivevaru baga thaggaru
Super analysis, sir.
I think in the era of youtube and ahort videos’s news papers and the long form content is a lost cause.
రోజూ రోజూ కి పడిపోతున్న స
ర్క్యలేషన్ ని దృష్టిలో పెట్టుకుని మీ సలహాలు ఎవడూ పాటించడు…
ajantham ante emiti?
అసలు తెలుగే వద్దు అని ఏకంగా ప్రభుత్వమే తెలుగు మీడియం యొక్క గొంతు పట్టి నొక్కి చంపడానికి ట్రై చేస్తే కిక్కురు మనని మేధావి వర్గం మనది.
పత్రికలు, రిపొర్టింగ్, విలువలు అంటూ….ఎ విలువలూ లెని…నిత్యం కులాల గురించి రాస్తూ ..ఒక పార్టికి కొమ్ము కాస్తూ..విద్వంసాలు సుస్టించె ఇలాంటి చొట రాయటం…
మద్యం దుకాణం ముందు నుంచొని సీసాలొ మజ్జిగ తాగటం లాంటిది.
konchem lenfthy…but nice one