పిల్లల్ని కనగలం కానీ వాళ్ల గుణగణాల్ని కనలేం అంటుంటారు. కానీ పిల్లల పెంపకంలోనే వాళ్ల గుణాలు మారుతాయి. అతిగారాబం అనర్థాలు తెచ్చిపెడుతుందనే విషయానికి ఇది సజీవ సాక్ష్యం. రాజమండ్రిలో జరిగిన ఈ దుర్ఘటనలో కూతురు, తన తల్లిని హతమార్చింది.
రాజమండ్రికి చెందిన మార్గరెట్ జూలియానా ఐదేళ్ల కిందట ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ పొందారు. ఆమెకు పిల్లల్లేవు. అందుకే 13 ఏళ్ల కిందట ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. నెలల వయసులోనే దత్తత తీసుకొని, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఈ క్రమంలో పాపను అతిగా గారాబం చేశారు.
అతిగారాబంతో పెరిగిన ఆ అమ్మాయి 13 ఏళ్లకే దారితప్పింది. ఇష్టానుసారంగా డబ్బు ఖర్చుపెట్టడంతో పాటు, 19 ఏళ్ల యువకుడితో ప్రేమాయణం కూడా సాగిస్తోంది.
అదుపుతప్పిన అమ్మాయిని గమనించిన మార్గరెట్, కూతుర్ని పలుమార్లు హెచ్చరించింది. దీంతో తల్లిపై కక్ష పెంచుకుంది కూతురు. కొన్ని రోజుల కిందట మార్గరెట్ బాత్రూమ్ లో కాలుజారిపడింది. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది. ఇదే అదనుగా భావించిన కూతురు, తల్లిని అడ్డు తొలిగించుకోవాలని భావించింది. తల్లి చనిపోతే ఆస్తి మొత్తం తనకే వస్తుందని ఆశ పడింది.
తన ప్రియుడు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాత్రికిరాత్రి తల్లిని హత్య చేసింది. ఆ తర్వాత ఏం తెలియనట్టు హాస్పిటల్ లో జాయిన్ చేసింది. అయితే వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయిపై పూర్తిస్థాయిలో నిఘాపెట్టారు. అలా 3 రోజుల పాటు నిఘాపెట్టి, పక్కా ఆధారాలతో అమ్మాయిలతో పాటు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. విచారణలో అంతా నేరం అంగీకరించారు.