దేశంలో తీవ్ర‌మ‌వుతున్న ధ‌నిక‌, పేద అంత‌రం!

ఏవైతే నిత్యావ‌స‌రంగా అందుబాటులో ఉండాల్సిందో, అవి ఇప్పుడు లగ్జ‌రీ కేట‌గిరిలోకి వెళ్లాయి. ఆర్థిక అస‌మానత‌ల వ‌ల్ల ఒక వ‌ర్గం వీటి కోసం ఎంతైనా వెచ్చించే స్థాయిలో ఉంది.

ఈ మ‌ధ్య‌నే దేశంలో క‌నీసం కోటి డాల‌ర్లు, అంత‌కు మించిన ఆస్తులు క‌లిగిన భార‌తీయులు 86 వేల మంది వ‌ర‌కూ ఉన్నార‌ని ఒక అధ్య‌య‌నం చెప్పింది. భార‌త‌దేశంలో ఇలాంటి మిలియ‌నీర్ల సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ ఉంద‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది. ప్ర‌స్తుతం మిలియ‌నీర్ల సంఖ్యలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్ ల త‌ర్వాత మిలియ‌నీర్లు అత్య‌ధికంగా ఉన్న దేశం ఇండియానే. అమెరికాలో అటు ఇటుగా తొమ్మిది ల‌క్ష‌ల మంది మిలియ‌నీర్లు ఉన్నార‌ట‌. వీరి మొత్తం సంప‌ద 5.7 ట్రిలియ‌న్ డాల‌ర్లు. క‌మ్యూనిజం అనుకునే చైనాలో ఆ త‌ర్వాత ఏకంగా దాదాపు ఐదు ల‌క్ష‌ల మంది మిలియ‌నీర్లు ఉన్నార‌ట‌. వీరి మొత్తం సంప‌ద 1.34 మిలియ‌న్ డాల‌ర్లు. ఆ త‌ర్వాత జపాన్ లో ల‌క్షా ఇర‌వై రెండు వేల మంది వ‌ర‌కూ మిలియ‌నీర్లు ఉన్నార‌ట‌. వీరి సంప‌ద ఇండియ‌న్ మిలియ‌నీర్ల సంప‌ద క‌న్నా కాస్త త‌క్కువే. ఇండియా క‌న్నా జపాన్ లో ఎక్కువ‌మంది మిలియ‌నీర్ల ఉన్నా వారి మొత్తం సంప‌ద ఇండియ‌న్ మిలియ‌నీర్ల క‌న్నా త‌క్కువే. ఇండియ‌న్ మిలియ‌నీర్ల మొత్తం సంప‌ద అటు ఇటుగా ఒక మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉంది.

ఇందుమూలంగా అర్థం చేసుకోవాల్సిన అంశం.. ఇండియా ధ‌నికుల‌తో కూడుకున్న పేద దేశం అనేది. ఇది చాలా పాత విష‌యమే. ఇండియా ధ‌నికుల‌తో కూడిన పేదదేశం అని ద‌శాబ్దాలుగా చెబుతూ ఉన్నారు ఆర్థిక వేత్త‌లు. అదే ప‌రంప‌ర కొన‌సాగుతూ ఉంది. ఇండియాలో మిలియ‌నీర్ల సంఖ్య రానున్న కాలంలో మ‌రింత‌గా పెర‌గ‌వ‌చ్చ‌ని కూడా ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. రాబోయే మూడేళ్ల‌లో మ‌రో ప‌ది వేల మంది మిలియ‌నీర్ల స్థాయికి ఎద‌గ‌వ‌చ్చ‌ని.. కొంత‌కాలంలో ఇండియాలో ల‌క్ష మందికిపైగా మిలియ‌నీర్ల ఉండ‌బోతార‌ని ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ లెక్క‌లు అన్నీ ఉత్తుత్తివే కావొచ్చు! అధికారికంగా ఇండియాలో అటు ఇటుగా ల‌క్ష‌మంది మిలియ‌నీర్లు ఉండ‌వ‌చ్చేమో కానీ, అన‌ధికారికంగా ఇంకా ఎంత‌మంది ఉంటార‌నేది ప్ర‌శ్నార్థ‌కం!

మిలియ‌నీర్ అంటే.. భార‌త‌ద్ర‌వ్య‌మానంలో చెప్పాలంటే 80 కోట్ల రూపాయ‌లు, అంత‌కు మించిన ఆస్తులు క‌లిగిన వారు అనుకోవాలి! అయితే ఇండియాలో 80 కోట్ల రూపాయ‌ల ఆస్తులు క‌లిగిన వారు కేవ‌లం ల‌క్ష మందే అనుకుంటే అంత‌కు మించిన పొర‌పాటు ఉండ‌క‌పోవ‌చ్చు! అధికారికంగా ఆ మేర‌కు ఆస్తులు చూపిన వారు అంత‌మంది ఉంటారేమో కానీ.. అలాంటి వారి అన‌ధికారిక ఆస్తులు, ఆ ఆస్తుల‌కు మార్కెట్ లెక్క‌లు ఇవ‌న్నీ లెక్క‌లేస్తే మాత్రం.. ఇండియాలో నిస్సందేహంగా ఇలాంటి కోటీశ్వ‌రుల సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంటుంది. విప‌రీతంగా పెరిగిన భూముల ధ‌ర‌లు, న‌గ‌రాల్లో బాగా పెరిగిన రియ‌లెస్టేట్ ఆస్తుల ధ‌ర‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో అయితే వీధికి ఒక బిలియ‌నీర్ ఉన్నా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు.

ఒక వీధిలో సాదాసీదాగా క‌నిపించే వారికి ఎవ‌రో ఒక కుటుంబానికి అయినా క‌నీసం 80 కోట్ల రూపాయ‌లు, అంత‌కు మించిన ఆస్తులు ఉండ‌టం పెద్ద వింత కాదు. అయితే ఇంట్లోనే ఒక్కోరి పేరుతో కొంచెం ఆస్తులు ఉండ‌టం, మార్కెట్ రేట్ల లెక్క‌లు వేరే ఉండ‌టం వ‌ల్ల ఇండియాలో మిలియ‌నీర్లు అంత త్వ‌ర‌గా హైలెట్ కారు! అలాగే బినామీలు, బ్లాక్ మ‌నీల సంగ‌తి స‌రేస‌రి. ఎన్నిక‌ల సమ‌యాల్లో ఖ‌ర్చుల‌ను బ‌ట్టి చూస్తే.. ఇండియాలో ఎన్ని వేల మంది మిలియ‌నీర్లు ఉన్నారో ఈజీగా చెప్పొచ్చు. చాలా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్లో నెగ్గ‌డానికి ఒక్కో ఎమ్మెల్యే త‌ర‌ఫున 40 నుంచి యాభై కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు సునాయాసంగా జ‌రుగుతూ ఉంది. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు ముగ్గురు నేత‌లు ఈ మాత్రం స్థాయి ఖ‌ర్చును అల‌వోక‌గా పెడుతూ ఉన్నారు! మ‌రి ఖ‌ర్చే అంత పెట్ట‌గ‌లుగుతున్నారంటే వారి ఆస్తులు ఏ స్థాయిలో ఉండాలి, వారి ఆస్తుల మాటేంటి, ఇంట్లో వాళ్ల ఆస్తుల మాటేంటి, బినామీలు, అనుచ‌రులు.. ఇలా రాజ‌కీయ నేత‌ల ఆస్తులే లెక్క‌గ‌డితే క‌ళ్లు తిరిగే స్థాయిలో ఉంటాయి. 80 కోట్లు అనేది రాజ‌కీయంలో ఉన్న‌వారికి ఇప్పుడు పీన‌ట్ తో స‌మానం!

వారేనా.. ఆ త‌ర్వాత బ్యూరోక్రాట్లు? వారి క‌ర్మ‌కాలిన రోజున ఏసీబీకి చిక్కిన‌ప్పుడే కొంద‌రు త‌హ‌శీల్దార్లు, రెవెన్యూ ఇన‌స్పెక్ట‌ర్ల ఆస్తులు కోకొల్ల‌లుగా బ‌య‌ట‌పడుతూ ఉంటాయి! దేశంలో బ్యూరోక్రాట్ల ఆస్తుల లెక్క‌లు తీస్తే.. అమెరికా, చైనా బిలియ‌నీర్ల లెక్క‌లు ఏ మూల‌కు వెళ్తాయో! ఇక వ్యాపారాల్లో సంపాదించి, దాచే వారికీ లోటు లేదు! ఇలా అంతా లెక్క‌పెట్టుకుంటూ పోతే.. అధికారికంగా త‌మ ఆస్తుల విలువ 80 కోట్ల రూపాయ‌లు అని చెప్పే వారు కాకుండా.. అన‌ధికారికంగా అంత‌కు మించిన ఆస్తులు క‌లిగిన వారే ఎక్కువ‌మంది ఉంటారు! ఇది నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే!

ఇక రెండో వైపు ఉంది.. ఈ వైపుకూ, ఆ వైపుకూ అంత‌రం కూడా చాలా ఉంది. ఇటీవ‌లే మ‌రో అధ్య‌య‌నం చెప్పిన విష‌యం ఏమిటంటే.. దేశంలో ఎసెన్షియ‌ల్స్ కు కాకుండా, మరో అవ‌స‌రానికి ఖ‌ర్చుల‌కు క‌ట‌క‌ట‌లాడే జ‌నాభా సంఖ్య వంద కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని ఆ అధ్య‌యనం చెప్పింది. అంటే దేశ జ‌నాభా 140 కోట్లు అనుకుంటే, వారిలో తిండి, గుడ్డ‌, గూడు మిన‌హాయిస్తే మ‌రో అవ‌స‌రానికి ఇబ్బందులు ప‌డే జ‌నాభా వంద కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ట‌! ఇది కూడా వాస్త‌వ‌మే కావొచ్చు. కూడు, గుడ్డ‌, గూడు ఇప్పుడు అంద‌రికీ ఉన్నాయేమో కానీ.. అంత‌కు మించి ప్ర‌తీదీ ఇప్పుడు అత్యంత ధ‌ర‌తో కూడుకున్న‌దిగా మారింది.

దేశంలో పోషకాహార లోపం ఉంది కానీ, ఆక‌లి చావులు అయితే లేవు. తిన‌డానికి ఇబ్బంది ప‌డే వ్య‌క్తులు ఇప్పుడు లేర‌నే చెప్పాలి. ఈ విష‌యంలో ఎవ‌రెన్ని చెప్పినా.. యాచ‌కులు కూడా ఇండియాలో ఉన్నా.. ఐక్య‌రాజ్య‌స‌మితి అనుబంధ అధ్య‌య‌న సంస్థ‌లు మ‌రేం చెప్పినా.. ఇండియాలో తిండికి ఇప్పుడు లోటు లేదు. ఆక‌లితో అల‌మ‌టించేవారి సంఖ్య బాగా త‌గ్గిపోయింది. భోజ‌నం అయితే దొరుకుతుంది. ఇక గుడ్డ‌, గూడు కావాలంటే ఏదో ఒక ప‌ని చేసుకోవాలి. ప‌ని చేసే వారికి ఆ మేర‌కు ఉపాధి ల‌భిస్తుంది. మ‌రి ఆ ప‌నికి త‌గ్గ వేత‌నం ఉందా అంటే అది మ‌ళ్లీ ప్ర‌శ్నార్థ‌కం. వేత‌న వత్యాసాలు పెరిగాయి, జీవ‌న శైలి పూర్తి భిన్నంగా మారింది. ఒకే ఇంట్లో పుట్టిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు కూడా వేర్వేరు వృత్తులు చేప‌డితే ఇద్ద‌రి సంపాద‌న‌కూ పొంతన లేదు!

సామాన్య కుటుంబాల్లో పుట్టి వ‌చ్చిన వారికి ఐటీ వ‌రంగా మారింది. మంచి వేత‌నాలు పొందుతున్నారు నూటికి ముప్పై శాతం మంది ఐటీ ఉద్యోగులు కూడా. వీరి వేత‌నం మంచి స్థాయిలో ఉంది. మిగ‌తా వారు వ‌చ్చే వేత‌నాల‌తో మ‌హానగ‌రాల్లో జ‌స్ట్ జీవించగ‌లుగుతూ ఉన్నారు. ముప్పై శాతం మంది ఈ వేత‌నాల ద్వారానే ఆస్తుల‌ను కొన‌గ‌లుగుతూ ఉన్నారు! అయితే ఐటీ వ‌దిలితే ఇత‌ర రంగాల్లో మాత్రం వేత‌నాల స్థాయి చాలా త‌క్కువ‌గా ఉంది. మార్కెటింగ్ లో క‌ష్ట‌ప‌డే వారికి లోటులేదు.

ఇక ఇత‌ర ఉద్యోగాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌రిస్థితి కూడా మెరుగ్గా ఉంది. వారికి పైనా, కింద ఆదాయాలు. వృత్తి విద్య‌లు చ‌దివి వ‌చ్చి, ఆ కోర్ రంగంలో ప‌ని చేయ‌గ‌ల ప్ర‌తిభావంతుల ప‌రిస్థితీ బాగానే ఉంది. మెకానిక్ లు, పంబ్ల‌ర్లకు తిరుగులేదు. కాస్త శారీర‌క శ్ర‌మ‌తో కూడుకున్న ప‌నులే అయినా ఒక ద‌శ‌లో చాలా మంది అటు వైపుకు వెళ్ల‌క‌పోవ‌డంతో.. ఉన్న వారికి అవ‌కాశాలు ల‌భిస్తూ ఉన్నాయి. అయితే ఇలా ఎంత చెప్పుకున్నా.. వ్యత్యాసం అయితే ఉంది. ప్రత్యేకించి వ్య‌వ‌సాయాన్ని న‌మ్ముకున్న వాళ్ల ఆదాయాలు అంతంత మాత్రంగా మారాయి. పెట్టుబ‌డి వ్య‌యాలు పెరిగిపోవ‌డం, మార్కెట్ ఒడిదుడుకుల‌తో వ్య‌వ‌సాయం క‌త్తి మీద సాముగానే కొన‌సాగుతూ ఉంది. పాలు, పౌల్ట్రీ వంటివి అద‌న‌పు ఆదాయంగా ఉన్నా.. ఇంకా వ్య‌వసాయం అంత తేలిక‌గా చేయ‌గలుగుతున్న‌ది కాదు. ఆరుగాలం క‌ష్ట‌ప‌డినా.. ఫ‌లితం ద‌క్క‌డం ప్ర‌శ్నార్థ‌కంగానే కొన‌సాగుతూ ఉంది.

ఉద్యోగ‌స్తులు ఎన్ని ర‌కాలుగా జ‌వాబుదారీగా ఉన్నా, వారి ఉద్యోగానికి గ్యారెంటీ లేక‌పోయినా.. ఇప్ప‌టికీ వ్య‌వ‌సాయ‌దారుడి క‌న్నా ఉద్యోగ‌స్తుడే మెరుగైన జీవితాన్ని అనుభ‌విస్తూ ఉన్నాడు. ఖ‌ర్చుల విష‌యంలో న‌గ‌రాల‌కూ, ప‌ట్ట‌ణాల‌కూ, ప‌ల్లెల‌కూ కూడా పెద్ద తేడా లేకుండా పోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. తిండి, బ‌ట్ట, గూడు త‌ప్ప మిగ‌తావ‌న్నీ కాస్ట్లీగా మార‌డం! ఇప్పుడు ఇండియాలో విద్య‌ను ఎసెన్షియ‌ల్ గా ప‌రిగ‌ణించ‌లేం! మంచి స్కూల్లో పిల్ల‌ల‌ను చ‌దివించ‌డం ల‌గ్జ‌రీ కిందే లెక్క‌!

మూడు ద‌శాబ్దాల కింద‌ట వ‌ర‌కూ.. ప్ర‌భుత్వ‌,ప్రైవేట్ స్కూళ్ల మ‌ధ్య‌న వ్య‌య వ్య‌త్యాసం త‌క్కువ‌! మ‌హా అంటే నెల‌క వందో, రెండు వంద‌ల ఫీజు చెల్లిస్తే మెరుగైన స్కూల‌కు పంపుతున్నామ‌నే భావ‌న ఉండేది. డిగ్రీకి, పీజీకి కూడా అప్పుడు ఫీజులు వేల రూపాయ‌ల్లోనే! అయితే.. ఇప్పుడ న‌గ‌రాల్లోనే కాదు, ప‌ట్ట‌ణాల్లో కూడా ఎల్ కేజీకే ల‌క్ష రూపాయ‌ల ఫీజు వ‌సూలు చేస్తున్నారు. ల‌క్ష‌తో మొద‌లుపెడితే.. అది ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో చెప్ప‌డం కూడా క‌ష్టం. ఈ నేప‌థ్యంలో ఇండియాలో విద్య ల‌గ్జ‌రీ మెటీరియ‌ల్ గా మారింది. కొంద‌రే అనుభ‌వించ‌గ‌ల ల‌గ్జ‌రీ అది. వైద్యం కూడా ఆ స్థాయికి తీసిపోవ‌డం లేదు. హాస్పిటల్ కు వెళితే వేల‌ల్లోనే! ఇంకో మాట లేదు.

ఏవైతే నిత్యావ‌స‌రంగా అందుబాటులో ఉండాల్సిందో, అవి ఇప్పుడు లగ్జ‌రీ కేట‌గిరిలోకి వెళ్లాయి. ఆర్థిక అస‌మానత‌ల వ‌ల్ల ఒక వ‌ర్గం వీటి కోసం ఎంతైనా వెచ్చించే స్థాయిలో ఉంది. మ‌రో వర్గం వాటిని అందుకోలేని స్థాయిలో ఉంది! ఇలా అస‌మాన‌త‌లు దేశంలో వ‌ర్ధిల్లుతూ ఉన్నాయి. ఇంకా పెరుగుతున్నాయి కూడా!

8 Replies to “దేశంలో తీవ్ర‌మ‌వుతున్న ధ‌నిక‌, పేద అంత‌రం!”

  1. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులకు వారు పదవులు పొందేనాటి ఆస్తులకు మరణించి వారసులకు ఆస్తులు పంచె నాటికీ తేడా ఎక్కువ ఉంటే వాళ్ళ మీద 90 % వారసత్వ పన్ను విధించాలి లేకపోతె వైస్సార్ నొక్కేసిన ఆస్తులు కేసు లు లాగా ఎప్పటికి తేలవు మనం చూడం న్యాయం గ వ్యాపారం చేసుకొని కచ్చితం గ పన్నులు కట్టేవాళ్లకు పన్నులు తగ్గించి వెసులు బాటు కల్పించాలి పారిశ్రామిక వేత్తలు మీద తప్పుడు కేసు లు పెట్టె అధికారులను తోలు తీసేయాలి ఉపాధి కల్పించే వాళ్ళను కాపాడ వలసిన బాధ్యత ప్రజల మీద కూడా వుంది

  2. Baaga sampaadinche vaallemo … okaru ledhaa iddarinee kantunaaru. Emi leni vaallemo padhi mandhi ni kantunaaru.

    mundhu aa freebies aapandi … annee set avtaayi.

  3. అక్రమాస్తులు కోర్టులో రుజువు చేయలేరని జగన్ గారి కేసు చూసేక తేలిపోయింది రాజకీయనాయకులకు ప్రభుత్వోద్యోగులకు పదవిలో చేరిన నాటి ఆస్తులు మరణించేనాటి ఆస్తులకు పొంతన కుదరకపోతే వాళ్ళ మీద 90 % వారసత్వపన్ను విధించాలి

  4. అక్రమాస్తులు కోర్టులో రుజువు చేయలేరని జగన్ గారి కేసు చూసేక తేలిపోయింది రాజకీయనాయకులకు ప్రభుత్వోద్యోగులకు పదవిలో చేరిన నాటి ఆస్తులు మరణించేనాటి ఆస్తులకు పొంతన కుదరకపోతే వాళ్ళ మీద 90 % వారసత్వపన్ను విధించాలి

Comments are closed.