సీట్ల సంఖ్య త‌గ్గిపోతాయా, త‌మిళుల తెగువ‌, తెలుగునాట ఎప్పుడు?

సౌత్ రాష్ట్రాల‌కు ఎలా సున్నం రాసినా.. ఉత్తరాది ఓట్లే కేంద్రంలో ఎవ‌రు అధికారంలో ఉండాల‌నేది నిర్ణ‌యిస్తాయి. మా మీదే ఆధార‌ప‌డి ఉన్నారు.. అనే మాట‌ను చెప్పుకోవ‌డానికి కూడా ఏమీ ఉండ‌దు!

మ‌రో ముప్పై సంవ‌త్స‌రాల పాటు.. జ‌నాభా ప్రాతిప‌దిక‌న లోక్ స‌భ సీట్ల సంఖ్య‌ను మార్చే ప‌ని పెట్టుకోకూడ‌దు అని త‌మిళ‌నాడు అఖిల‌ప‌క్షం ప్ర‌తిపాద‌న‌ను పెట్టి ఆమోదించింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను డీఎంకే అధినేత‌, సీఎం ఎంకే స్టాలిన్ ప్ర‌వేశ పెట్ట‌గా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అన్నాడీఎంకే దానికి మ‌ద్ద‌తు ప‌లికింది. దీనికి త‌మిళ‌నాడులోని ఇత‌ర ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా మ‌ద్ద‌తు ప‌లికాయి. అన్నీ క‌లిపి యాభై పార్టీలు ఈ మేర‌కు అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించి.. లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య మ‌రో ముప్పై సంవ‌త్స‌రాల పాటు య‌థాత‌థంగా కొన‌సాగాలి త‌ప్ప‌, జ‌నాభా ప్రాతిప‌దిక‌న అంటూ పెంచ‌డానికి వీల్లేద‌ని తీర్మానం పెట్టి, దాన్ని ఆమోదించి, ఢిల్లీకి పంపించాయి!

జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఎంపీ సీట్ల సంఖ్య పెరిగితే.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌నేది వాస్తవం! ఆ అన్యాయం కూడా ఏదో త‌ప్పు చేసినందుకు కాదు, కేవ‌లం కుటుంబ నియంత్ర‌ణ‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పాటించినందుకు ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఈ అన్యాయం జ‌ర‌గ‌బోతోంది. మ‌త‌సంప్ర‌దాయ‌లు, అంటూ వేరే మ‌తంతో పోటీలు పెట్టుకుంటూ, క్ర‌మ‌శిక్ష‌ణ అనేది లేకుండా ఇబ్బ‌డిముబ్బ‌డిగా సంతానాన్ని క‌ని, దేశ జ‌నాభాను విచ్చ‌ల‌విడిగా పెంచినందుకు గానూ యూపీ, బిహార్ , మ‌ధ్య‌ప్ర‌దేశ్ తో స‌హా.. ఉత్తరాది రాష్ట్రాలన్నింటికీ రాజ‌కీయ ప్రాధాన్య‌త పెరుగుతుంది ఇప్పుడు డీలిమిటేష‌న్ జ‌రిగితే!

యూపీ ప్ర‌స్తుత జ‌నాభా మేర‌కు అక్క‌డ లోక్ స‌భ సీట్ల సంఖ్య‌ను పెంచితే, బిహార్ విషయంలోనూ ఇదే జ‌రిగితే చాలు.. ఆ రాష్ట్రాల్లో ఎవ‌రు నెగ్గుతారో వారే ఢిల్లీ రాజ‌కీయంలో చక్రం తిప్పుతారు. కొత్త జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం లోక్ స‌భ సీట్ల సంఖ్య‌ను పెంచితే.. త‌మిళ‌నాడులో ఉన్న వాటిల్లో తొమ్మిది ఎంపీ సీట్లు త‌గ్గిపోతాయ‌ట‌! మ‌రి త‌మిళ‌నాడే కాదు.. ఏపీ, తెలంగాణ‌లు కూడా బాధిత రాష్ట్రాలే అవుతాయి. త‌మిళ‌నాడులో త‌గ్గిపోయాయంటే.. ఇప్ప‌టికే విడిపోయి రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను కోల్పోయిన తెలుగు రాష్ట్రాలు మ‌రింత వీక్ అవుతాయి!

కేర‌ళ‌, క‌ర్ణాట‌క ప‌రిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఉండ‌దు! అయితే ఈ అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షా కొన్నాళ్లుగా మాట్లాడుతూ.. డీలిమిటేష‌న్ జ‌రిగినా త‌మిళ‌నాడులో ఒక్క ఎంపీ సీటు కూడా త‌గ్గ‌దంటూ ప్ర‌చారం చేస్తూ ఉన్నారు! అయితే త‌మిళ‌నాడుతో స‌హా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కూడా త‌గ్గ‌క‌పోవ‌చ్చు.. అయితే ఇదే స‌మ‌యంలో పెర‌గ‌వు కూడా! ఏ లెక్క‌న చూసినా.. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక‌వేళ ప‌ది ఎంపీ సీట్లు పెరిగినా.. ఇదే స‌మ‌యంలో యూపీ, బిహార్ లోనే అర‌వై డెబ్బై ఎంపీ సీట్లు పెరుగ‌తాయి!

1977 నాడు పెట్టిన ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల జ‌నాభాకూ ఒక లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం అనే నియ‌మం ప్ర‌కారం చూస్తే.. దేశం మొత్తం లోక్ స‌భ సీట్ల సంఖ్య 1400 వ‌ర‌కూ చేరుతుంది! ఇందులో యూపీ సీట్లే దాదాపు 200కు చేర‌తాయి. బిహార్ లో ప్ర‌స్తుతం 25 ఎంపీ సీట్లు ఉంటే.. అవి 82 అవుతాయి! మ‌రి ఇదే లెక్క ప్ర‌కారం చూసుకుంటే.. ఏపీలో 25 ఎంపీ సీట్లున్నాయి ఇప్పుడు. ఇలా చూస్తే 50 సీట్ల వ‌ర‌కూ పెర‌గాలి! అయితే.. ఇలా చూసినా.. సౌత్ స్టేట్స్ అన్నీ రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను కోల్పోతాయి. 80 ఎంపీ సీట్లున్న యూపీ రెండు వంద‌ల స్థాయికి చేరుతుంది, 25 ఎంపీ సీట్లున్న ఏపీ 50 కావొచ్చు! అయితే ఇంత‌మంది ఎంపీల‌కు కొత్త లోక్ స‌భ భ‌వ‌నం కూడా అవ‌కాశం ఇవ్వ‌దు! కొత్త‌గా నిర్మించిన లోక్ స‌భ భ‌వ‌నంలో ఒకేసారి 888 మందే కూర్చోగ‌ల‌ర‌ట‌! అంటే ప్ర‌తి ప‌ది ల‌క్షల జ‌నాభాకూ ఒక లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం అనేది జ‌రిగే ప‌నికాద‌నుకోవాలి. ఒక‌వేళ ఇర‌వై ల‌క్ష‌ల జ‌నాభాకూ ఒక లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం అంటే అప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, సౌత్ స్టేట్స్ అంతా మరింత ఇర‌కాటంలో ప‌డ‌తాయి.

బహుశా ఇదే జ‌రగొచ్చు కూడా! ప్ర‌తి ఇర‌వై ల‌క్ష‌ల జ‌నాభాకూ ఒక లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం అంటే ఏపీ లో ఎంపీ సీట్ల సంఖ్య ఒక్క‌టి కూడా పెర‌గ‌దు! త‌మిళ‌నాడు ప‌రిస్థితి ఇంతే, క‌ర్ణాట‌క ప‌రిస్థితీ ఇంతే, కేర‌ళ‌లో అయితే లోక్ స‌భ సీట్ల సంఖ్య త‌గ్గిపోతుంది! ఇదే లెక్క‌న యూపీ ప‌రిస్థితి చూస్తే.. అక్క‌డ ఇర‌వై కోట్ల మంది జ‌నాభా ఉన్నార‌నుకున్నా.. ఎంపీ సీట్ల మ‌రో ఇర‌వై పెరుగుతుంది. బిహార్ లో లోక్ స‌భ సీట్ల సంఖ్య 40ను దాటేస్తుంది. ఇలా పెరిగే ప్ర‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఉత్త‌రాది రాష్ట్రాల్లోనే ఉంటుంది త‌ప్ప‌, ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న నియోజ‌క‌వ‌ర్గాలే మిగ‌లడం లేదా, ఉన్న వాటిల్లో కూడా త‌గ్గిపోవ‌డం జ‌ర‌గుతుంది.

ప‌ది ల‌క్ష‌ల జనాభాకూ ఒక లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. సౌత్ లో కూడా పెరిగినా, రాజ‌కీయ ప్రాధాన్య‌త అయితే పెర‌గ‌దు. ఇర‌వై ల‌క్ష‌ల జ‌నాభాకూ ఒక లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. అంతే సంగ‌తులు! ద‌క్షిణాదిన ఉన్న సీట్లు కూడా కొట్టుకుపోతాయి! జ‌నాభా నియంత్ర‌ణ పాటించిన పాపానికి ద‌క్షిణాది రాజ‌కీయ ప్రాధాన్య‌త మ‌రింత త‌గ్గిపోతుంది. మ‌రి ఇలాంటి నేప‌థ్యంలో.. స్టాలిన్ మాట్లాడుతున్నాడు. డీలిమిటేష‌న్ ఊసును ప‌క్క‌న పెట్టాల‌ని, ఇంకో ముప్పై యేళ్ల త‌ర్వాత ఇలాంటివి మాట్లాడుకుందామ‌ని అంటున్నాడు. దీనికి అన్నాడీఎంకే కూడా మ‌ద్ద‌తు ప‌లికింది. అయితే తెలుగునాట ఇంకా నోరు మెద‌ప‌డం లేదు నేత‌లు!

అస‌లు మోడీ ప్ర‌భుత్వ‌మే చంద్ర‌బాబు మ‌ద్ద‌తు మీద ఆధార‌ప‌డిందంటున్నారు క‌దా, ఇర‌వై ల‌క్ష‌ల జ‌నాభా లెక్క‌న డీలిమిటేష‌న్ జ‌రిగితే, ఇక భ‌విష్య‌త్తులో సౌత్ లోని ఏ ప్రాంతీయ పార్టీకీ ఇలా చెప్పుకునే అవ‌కాశం కూడా ఉండ‌దు! సౌత్ రాష్ట్రాల‌కు ఎలా సున్నం రాసినా.. ఉత్తరాది ఓట్లే కేంద్రంలో ఎవ‌రు అధికారంలో ఉండాల‌నేది నిర్ణ‌యిస్తాయి. మా మీదే ఆధార‌ప‌డి ఉన్నారు.. అనే మాట‌ను చెప్పుకోవ‌డానికి కూడా ఏమీ ఉండ‌దు!

4 Replies to “సీట్ల సంఖ్య త‌గ్గిపోతాయా, త‌మిళుల తెగువ‌, తెలుగునాట ఎప్పుడు?”

  1. జనాబా ప్రకారం నియొజికవర్గాల పునర్విభజన జరగటం లెదు. కాస్త తెలుసుకొని రాయిరా సన్నాసి!

Comments are closed.