కొందరితో స్నేహం అవసరం..మరి కొందరితో స్నేహం అపాయం..అయినా అవసరం కొద్దీ అపాయమని తెలిసినా స్నేహం చేయాల్సి వచ్చినపుడు కాస్త జాగ్రత్తగా వుండాలి. ఇప్పుడు తెలుగుదేశంతో భారతీయ జనతాపార్టీ వ్వవహారం అలాగే వుంది.
తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని, ఆంధ్రలో అది చేస్తున్న పనులు అన్నింటికీ తందాన తాన అంటూ అయిదేళ్ల నాటికి ఏం బావుకుంటుందో, బలపడుతుందో దానికే ఎరుక. కానీ అదే సమయంలో ఇంకో సమస్య కూడా వుంది భాజపాకు. ఎప్పటికైనా అధికారం అందుకుంటామన్న ఆశ ఇంతో అంతో తెలంగాణలోనే వుంది.
కానీ తెలుగుదేశానికి వత్తాసు పలుకుతోందని, తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తోందనీ అన్న మీనింగ్ కనుక అక్కడి జనాల్లోకి వెళ్తే, మాత్రం మొదటికే మోసం వస్తుంది. దానికి తోడు కేసిఆర్ భాజపాను దోషిగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు..చేస్తారు కూడా. దానికి ఇప్పుడు జరిగిన విమానాశ్రయం పేరు మార్పు లాంటివి తోడైతే, భాజపా జనం ముందుకు ధైర్యంగా రావడం కష్టమవుతుంది.
ఎన్టీఆర్ జాతీయ నాయకుడు అని ఏ భాజపా లీడర్ కూడా తెలంగాణలో జనం ముందుకు వచ్చి చెప్పేది వుండదు. ఇప్పుడు మోడీకి తెలిసి చేసారని అనుకోవడానికి లేదు. ఎప్పుడో పెండింగ్ లో వున్న ఫైలును మంత్రి అశోక్ గజపతి ఇప్పుడు దుమ్ము దులిపి వుంటారు. అందుకే ఆయన అప్పుడే వెనుకంజ వేసి, తమది తప్పు కాదు అన్నట్లు మాట్లాడుతున్నారు. 1999 లో నిర్ణయం అది, ఇప్పుడు ఓకె చేసామని అంటున్నారు. ఇక్కడ కొన్ని పాయింట్లు వున్నాయి.
1999 నిర్ణయం ఇప్పటిదాకా పెండింగ్ లో వుందీ అంటే అందులో ఏదో తలకాయనొప్పి వుందనే అర్థం అవుతోంది.
పైగా ఇప్పుడు విభజన తరువాత ఉమ్మడి వ్యవహారాలకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించాలని మెడమీద తలకాయ వున్నవారు ఎవరైనా చెబుతారు.
పైగా ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితి చాలా సున్నితంగావుంది. ఇలాంటపుడు ఇలాంటి అగ్గి రాజేయకూడదు అని అనుభవజ్ఞుడైన మంత్రికి తెలియదని ఎలా అనుకోవాలి?
ఇప్పుడు అమలు చేసిన మంత్రి బాగానే వుంటారు. కానీ తెలంగాణలో దీనికి బదనామ్ అయ్యేది భారతీయ జనతా పార్టీ. పోనీ అలా అని ఆంధ్రలో ఏమన్నా ప్లస్ అవుతుందా అంటే అదీ లేదు.
ఉదాహరణకు మొన్నటికి మొన్న విశాఖలో హుద్ హుద్ కోసం కేంద్రం 600 కోట్లు పంపించింది. అంతకు ముందే, అవసరం వున్నా లేకున్నా,అడిగినా అడగకున్నా, విశాఖ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని 450 కోట్లతో పప్పులు, బియ్యం, నూనెలు కొని జనాలకు పంచేసారు. దీంతో జనం జై చంద్రబాబు అంటారేమో కానీ, 600 కోట్లు మోడీ ఇచ్చారని అనుకోరు.
పొరపాటున కేంద్రం నుంచి ఇలా ఏవి వచ్చినా దానికి పచ్చ ముసుగు కప్పేసి అది తన ఘనత అని డప్పేసుకోవడంలో బాబు కు చాలా అనుభవం వుంది. 24గంటల కరెంట్ అన్నది భాజపా ఎంపిక చేసి, అందించిన వ్వవహారమైతే, గడచిన రెండు నెలులుగా బాబు అది తన ఘనతగా చెప్పుకుంటున్న వైనమే ఇందుకు తాజా ఉదాహరణ.
మళ్లీ అలా అని తనకు అనుకూలమైన నిర్ణయాలు తానే వత్తిడి చేసి, అమలు చేయించినా, తెలంగాణ జనం ముందు తనకేమీ సంబంధం లేదు భాజపాదే పాపం అంతా అని కూడా చెప్పేయగలదు తేదేపా.
అందుచేత మోడీసాబ్…తెలుగుదేశంతో జర జాగ్రత్త. మీకు కాకున్నా మీ పార్టీకి గతంలో అనుభవమే ఇదంతా.