తమ వయసును, తమ అసలు రూపాన్ని చూపడానికి చాలా తక్కువ మందికి ధైర్యం ఉంటుంది. ఈ హిపోక్రాటిక్ వరల్డ్‌లో దేవుళ్లుగా చలామణి అయ్యే సెలబ్రిటీల్లో తక్కువ మందే తమ అసలు రూపాన్ని చూపుతూ ఉంటారు. మేకప్, బట్టతలపై విగ్గు లేనిది వీళ్లు బయటకు కదలరు. ఒకవేళ వెంట్రుకలు ఉంటే వాటి రంగును మార్చేసి రంగంలోకి దిగుతారు. అయితే కొంతమంది ఈ పై పై పటారానికి మినహాయింపు. దక్షిణాది హీరోల్లో అందరూ నెరిసిపోయిన వాళ్లే. అయితే రంగేసుకుని తిరుగుతున్నారు. లేకపోతే విగ్గులు.
విగ్గుకు మినహాయింపు రజనీకాంత్ అయితే, నెరిసిన జుట్టును ధైర్యంగా చూపిస్తున్నది అజిత్. ఇక అందరూ అందరే. వాస్తవానికి దూరంగా, తమ మీద అందరిలోనూ భ్రమలు కల్పించి దేవుళ్లుగా చలామణి అయిపోతున్న వాళ్లే.
వాస్తవాన్ని దాయడమే గుడ్ లుకింగ్స్ కింద చలామణి అయిపోతోంది దీనికి క్రికెట్ కూడా మినహాయింపు కాదు. అందరూ కాదు కానీ, కొంతమంది క్రికెటర్లు వయసును దాచే తపనను పడుతూ ఉంటారు. సినిమా హీరోలతో పోలిస్తే క్రికెటర్లు ఈ విషయంలో కొంత నిజాయితీ పరులే. ఈ నిజాయితీ పరుల్లో కూడా మరింత నిజాయితీ పరుడిగా నిలుస్తున్నాడు ఎంఎస్ ధోనీ.
భారత క్రికెట్ జట్టును రెండు ప్రపంచకప్ లో విజేతగా నిలిపిన ధోనీ కెరీర్ ఆరంభం నుంచి స్టైల్ విషయంలో ఐకాన్ గా నిలుస్తున్న క్రికెటరే అని చెప్పనక్కర్లేదు. ధోనీ జులపాలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. పాకిస్తాన్ నాటి అధ్యక్షుడు కూడా వాటికి ఫిదా అయ్యాడు. ఇక అప్పటి యూత్ లో అయితే వాటికి బీభత్సమైన క్రేజ్. ఇదంతా 14 యేళ్ల కిందటి సంగతి.
తన స్టైల్ కు క్రేజ్ వచ్చిందని చెప్పి ధోనీ దాంట్లోని మగ్గిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ జుట్టు చాలా ఊడింది. అంటకత్తెర వేయించుకుని కూడా కనిపించాడు చాలా సార్లు. ఈ పరంపరలో ధోనీ ఇప్పుడు గ్రే లుక్ లోకి వచ్చాడు. గడ్డం బాగా నెరిసిపోయింది. క్లీన్ షేవ్ తోనో, రంగేసుకునో ధోనీ దాన్ని కవర్ చేసుకోవచ్చు. అయితే ఇతడు హిపోక్రాట్ కాదు. అందుకే గ్రే లుక్ తో డేర్ గా కనిపిస్తున్నాడు. ఇది వరకూ గ్రే లుక్ తో దర్శనమిచ్చిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. కపిల్ దేవ్, సందీప్ పాటిల్ లు సగం నెరిసిన జుట్టు, మీసాలతో కనిపించారు. అయితే వారు అప్పటికే డ్రెస్సింగ్ రూమ్, కామెంటరీ బాక్స్ ను చేరిపోయారు. ధోనీ మాత్రం ఇంకా ఫీల్డ్ లోనే ఉండి తెల్లబడిన గడ్డంతో కనిపిస్తున్నాడు. ఈ వయసులో కూడా కీపర్ గా కొనసాగగలగడం ఒకరకంగా గొప్పదనం అయితే, మొహమాటం లేకుండా వయసును ప్రదర్శించుకోవడం మరో గొప్పదనం.