నెంబర్ల గురించి పట్టించుకోను-నాని

హీరో నాని పక్కా పాదరసం టైపు హీరో. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. క్యారెక్టర్ ను తెరపై చూస్తే ఇది నాని మాత్రమే చేయాలి. నాని కోసమే తయారైన టైలర్ మేడ్ క్యారెక్టర్…

హీరో నాని పక్కా పాదరసం టైపు హీరో. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. క్యారెక్టర్ ను తెరపై చూస్తే ఇది నాని మాత్రమే చేయాలి. నాని కోసమే తయారైన టైలర్ మేడ్ క్యారెక్టర్ ఇది అనిపించేలా, మైమరపించేలా చేసేస్తాడు. అలాంటి హీరో లేటెస్ట్ సినిమా 'వి'. వి ఫర్ వయిలెన్స్,  వి ఫర్ వెంజన్స్,  అంటూ వస్తున్నారు హీరో నాని డైరక్టర్ ఇంద్రగంటి కలిసి. ఈ ఇద్దరు ఇప్పుడు వి ఫర్ విక్టరీ అంటారేమో? ఇలా నానార్థాలు తీసుకునే వీలున్న  వి సినిమా విడుదల సందర్భంగా హీరో నానితో గ్రేట్ ఆంధ్ర చేసిన చిన్న ఇంటర్వ్యూ

* సాధారణంగా మీ సినిమాలు ఏడెనిమిది వందల థియేటర్లలో విడుదలవుతాయి. తొలిరోజే లక్షల మంది చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ లో విడుదలవుతున్న మీ సినిమాను తొలి రోజు ఎంత మంది చూస్తారని అంచనా?

అలా ఎప్పుడూ ఆలోచించలేదు కానీ, అమెజాన్ ప్రయిమ్ కు ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల సబ్ స్క్రయిబర్లు వున్నారు. వీరిలో తెలుగు సబ్ స్క్రయిబర్లు కూడా మిలియన్ల కొద్దీ వున్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చూస్తారని అనుకుంటున్నాను.

* అంటే మీ తొలి పాన్ వరల్డ్ సినిమా అన్నమాట.

హ.హ.హ..అయినా నేను ఎప్పుడూ ఈ నెంబర్లు, కలెక్షన్లు ఇలాంటివి పట్టించుకోను. అయినా ఎవరో ఒకరు ఎప్పడూ చెబుతూ వుంటారు. ఇంత వచ్చింది..ఇలా వుండి..స్టడీగా వుంది. పికప్ అయింది..ఇలా రకరకాలుగా. 

* నిర్మాత దిల్ రాజు వచ్చి వి సినిమాను ఒటిటి కి ఇచ్చేస్తున్నాను అన్నపుడు మీ స్పందన ఏమిటి?

ఆయన ఓటిటి కి ఇచ్చేస్తున్నాను అని చెప్పలేదు. పరిస్థితులు ఇలా వున్నాయి. ఏం చేద్దాం అని అడిగారు. ఇలాంటి పరిస్థితులు మన జనరేషన్ లో ఎప్పుడూ చూడలేదు. అందువల్ల ఇప్పుడు ఎవరూ ఏమీ చేయగలిగింది లేదు. నిజానికి మనమే ఇలా ఓటిటి గురించి ఆలోచిస్తున్నామా? మిగిలిన సినిమాలు కూడా ఆలోచిస్తున్నాయా? అలాంటపుడు మనం కూడా ఓ స్టెప్ ముందుకు వేయడం మంచిదేగా..ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం.

*ఇంద్రగంటి గతంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఫోన్ ల్లో చూసే సినిమా కాదు థియేటర్ లోనే చూడాలి అన్నారు. మరి ఇఫ్ఫుడు ఆయన ఎలా ఫీలవుతున్నారు?

ఈ మధ్య ఈ సినిమాను మేము, ఆయన చూసుకున్నపుడు కూడా ఆయనది, మాది అదే ఫీలింగ్. ఇదే సినిమా థియేటర్ లో పడితేనా అని. ఎంతయినా మనకు థియేటర్ తో వున్న అటాచ్ మెంట్ అలాంటిది కదా. 

*ఈ సినిమాను మీ మిత్రులు, ఇంద్రగంటి మిత్రులు చాలా మంది చూసారు. మాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటంటే, మీ అందరి సంగతి అలా వుంచితే ఇంద్రగంటికి ఓ మాంచి యాక్షన్, కమర్షియల్ డైరక్టర్ గా పేరు వస్తుందని.

నిజమే నేను ఇప్పటి వరకు రకరకాల సినిమాలు చేస్తూ వచ్చాను. అందువల్ల ప్రేక్షకులు నాగురించి ప్రిపేర్ అయి వుంటారు. కానీ ఇంద్రగంటి అలా కాదు. ఆయన తనకంటూ ఓ స్టయిల్ లో సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా చూసిన వారికి షాక్ నే. ఆ లెవెల్ లో తీసారు ఆయన.

*ఇంద్రగంటి కాకపోయి వుంటే, మీరు ఇలా మల్టీ స్టారర్ చేసేవారా?

మీరు నా సినిమాలు చూస్తున్నారు కదా. నాకు అలాంటివి ఏమీ వుండవు. పైగా ఇంద్రగంటి కథ చెప్పినపుడు ముందే చెబుతారు. నీ పాత్ర, ఆ పాత్ర అని ఆలోచించకు. కథ మొత్తం విను అంటారు. 

*కానీ ఈ సినిమా మల్టీ స్టారర్ గా కన్నా నాని సినిమాగానే ఎక్కువ ప్రచారంలో వుంది.

అది నా దృష్టికి కొంత వచ్చింది. సుధీర్ ను ఇంటర్వ్యూలు చేసినపుడు కూడా ఇలా అడిగారు ఎవరో? నిజానికి ఇద్దరి సినిమా ఇది. ఇద్దరికీ సమానంగా వుండే సినిమా ఇది.

*నాని అంటే సున్నితమైన, ప్రశాంతమైన కూల్ స్మయిల్. అలాంటిది ఈ సినిమాలో వికటాట్టహాసం చేసారు.

అదా…ట్రయిలర్ లో అది బాగా రిజిస్టర్ అయింది. కానీ షాట్ చేసినపుడు కాస్త ఇంప్రూవైజ్ చేసి చేసాను కానీ, పెద్దగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అది బాగా వెళ్లింది జనాల్లోకి. 

*సాధారణంగా ఓవర్ సీస్ లో ముందుగా విడుదలవుతాయి సినిమాలు. ఇప్పుడు మన దగ్గర కూడా వాళ్లతో సమానంగా విడుదులవుతోంది కదా 

అవును. ఇక ఇప్పుడు నో టెన్షన్. ఎర్లీ రిపోర్టులు, ట్వీట్ లు, లైవ్ అప్ డేట్ లు ఇలా చాలా వుండేవి, ఇప్పుడు అన్ని చొట్లా ఒకేసారి చూస్తారు కాబట్టి ఇక ఆ టెన్షన్ వుండదు.

*అంటే రివ్యూల టెన్షన్ కూడా లేనట్లేనా?

అది వుంటుంది. ఎంత ఓటిటి అయినా రివ్యూలు కూడా కావాలి కదా. ఓటిటి  విడుదలకు అయినా మీ అందరి జడ్జిమెంట్ కోసం చూడడం తప్పదు.

*కరోనా కల్లోలం ముగిసి, మళ్లీ థియేటర్ల దగ్గర ఈలలు, గోలలు, కాగితాలు చింపి ఎగరేయడాలు ఇలాంటి సీన్లు మళ్లీ కనిపించే రోజలు వస్తాయా?

తప్పకుండా, ఈసారి మరింతగా వుంటుంది వ్యవహారం. థియేటర్ టైమ్ వచ్చినపుడు మీరే చూస్తారు, సందడి డబుల్ అవుతుంది. 

*థాంక్యూ అండీ

థాంక్యూ

వి ఎస్ ఎన్ మూర్తి